Saturday, 16 May 2026

సుమేరు శృంగ మధ్యస్థా

సుమేరు శృంగ మధ్యస్థా అను అసమాన నామము అమ్మవారికి శ్రీలలితా సహస్ర నామావళిలో చెప్పబడిన ఏభై ఐదవ నామము. ఆ తల్లి శుభకరమయిన మేరు పర్వతము యొక్క శిఖరము మధ్య ప్రదేశంలో ఉంది.శ్రీచక్రంలోని బిందువే మేరుశృంగం.ఇక్కడ ఉండే త్రిభుజంలో తూర్పు కోణం వద్ద ఇచ్ఛాశక్తి,నైఋతీ కోణం వద్ద క్రియా శక్తి మరియు వాయువ్య కోణం వద్ద జ్ఞానశక్తి ఉంటాయి.ఈ మూడింటి బిందు స్థానం అయిన మేరుశృంగంలో అమ్మవారు అయ్యవారి వామాంకం పై ఆశీనురాలయి ఉంటుంది.కాబట్టి ఈనామ మంత్రాన్ని సుమేరు మధ్య శృంగస్థా అని కూడా పలుకుతారు.సుందరమయిన మేరు శిఖరాలు మూడు ఉన్నాయి.వాటి మధ్యలో ఇంకో శిఖరం ఉంది.మధ్య శిఖరంలో అమ్మవారు అయ్యవారితో కూడి ఉంటారు.మిగిలిన మూడు శిఖరాలు క్రమముగా బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులలోకాలకు ఆధారములు అయ్యాయి. మనలో ఉండే వెన్నెముకను మేరుదండమని అంటారు.ఆ వెన్నెముక మధ్యనుండి సుషుమ్నా మర్గము సహస్రార చక్రము వరకూ ఉంటుంది.మేరు పదాన్ని విడదీస్తే మ్+అ+ఇ+ర్+ఉ.ఈ అయిదు అక్షరములు అయిదు శృంగములు.దీనిలో మధ్యలో ఉన్నది ఇ.కాబట్టి ఆ తల్లి సుమేరు శృంగ మధ్యస్థా అయింది.

Friday, 15 May 2026

స్వాధీన వల్లభా

స్వాధీన వల్లభా అను పరమ పవిత్రమయిన నామము అమ్మవారికి శ్రీలలితా సహస్ర నామావళిలో చెప్పబడిన ఏభై నాల్గవ నామము.తన స్వాధీనంలో వల్లభుడిని ఉంచుకుంది గాబట్టి ఆ తల్లికి స్వాధీన వల్లభా అనే నామము అతికినట్లు సరిపోయింది.శివుడు శక్తితో కూడినప్పుడే సృష్టి,స్థితి,లయ కార్యములు చేయగలతాడు.లేకపోతే అడుగుకూడా జరపలేడు.త్రికోణాకారంలో ఉండే శ్రీచక్రము నందు శివుడు బిందు స్వరూపుడు.అంటే ఆమె గుప్పెట్లో ఉన్నాడు అన్నమాట. శివుని ఇచ్ఛాశక్తి పరమేశ్వరి.అమ్మవారు త్రిలోకసుందరి.మరి అయ్యవారు ఎలా తప్పించుకుంటాడు?శివుని ఆత్మ శివాని ఆధీనంలో ఉంది.కాళికా పురాణంలో పరమేశ్వరి చింతామణి గృహమునంద శివుడు ఉన్నాడని చెప్పబడిఉంది.శంకరాచార్యులు ఇలా అంటున్నారు.శక్తితో ఉంటే శివం-కదలగలిగేది.శక్తి లేకుంటే శవం-కదలలేనిది.అంటే అమ్మవారితో ఉంటేనే అయ్యవారికి మంచిది,మేలు.శివుడి రూపమయిన లింగము శక్తిరూపమయిన పానమట్టం లేకపోతే నిలువలేదు.శంకరుడే అమ్మవారి వెనక కళ్ళకు గంతలు కట్టినా తిరుగుతుంటే,ఇంక మన పరిస్థితి ఏంది?అమ్మవారి కాళ్ళ పైన పడి,మ్రొక్కుకోవాల్సిందే!

Wednesday, 13 May 2026

శివా

శివా అను మంగళప్రదమయిన నామము అమ్మవారికి శ్రీలలితా సహస్ర నామావళిలో చెప్పబడిన ఏభై మూడవ నామము. ఆ తల్లి శివుని శరీరంలో అర్థ భాగం అయింది.అయ్యవారిని అర్థ నారీశ్వరుడిని చేసేసింది.అసలు నిజానికి వారు ఇద్దరు కాదు,ఒక్కరే!అది మన మట్టి బుర్రలకు అర్థం అయ్యేదానికి జీవితకాలం సరిపోదు.అమ్మవారు సదాశివుని ఇచ్ఛాస్వరూపురాలు.సృష్టించాలనే ఇచ్ఛ గలిగింది ఆ తండ్రికి.ఆ ఇచ్ఛే మన శక్తి.పరమేశ్వరి శివునితో అభేదము పొందింది గావున శివా అయింది.శివము అనగా మంగళము.కాబట్టి అయ్యవారు,అమ్మవారు మంగళస్వరూపులు.శివుడికి దేవతలు,రాక్షసులు అని భేదం లేదు.ఆయన దృష్ఠిలో అందరూ ఒకటే.అందరి మంచీ కోరుకుంటాడు.శివ అంటే శాంతించువాడు అని కూడా అర్థం ఉంది. వేదములలో ఇలా చెప్పారు.ఎవడైతే స్వాభావికంగా నిర్మలుడో,స్వచ్ఛత ఉందో,శమము,జగదాధారమగుట,భక్తులకు మోక్షదాయిత్వము,బలము,ఇచ్ఛాశక్తి అనే గుణములు ఉన్నాయో అతడే శివుడు అని చెప్పబడి ఉంది.ఆ తల్లి తండ్రి అనుబంథము,బంథము విడదీయలేనిది కావున ఇవి ఇద్దరికీ వర్తిస్తాయి.కాబట్టి అమ్మ శివా అయింది. ఈశ్వరుని అష్ట మూర్తులు సూర్యుడు,జలము,పృథివి,వాయువు,వహ్ని,ఆకాశము,దీక్షిత బ్రాహ్మణుడు మరియు చంద్రుడు.లింగ పురాణంలో ఈశానుడు,అనగా వాయువు భార్య శివా అని చెప్పబడినది.

Monday, 11 May 2026

శివ కామేశ్వరాంకస్థా

శివ కామేశ్వరాంకస్థా అను మనోజ్ఞమయిన నామము అమ్మవారికి శ్రీలలితా సహస్ర నామావళిలో చెప్పబడిన ఏభై రెండవ నామము. శివ స్వరూపుడు,కామస్వరూపుడు అయిన కామేశ్వరుడు అమ్మవారి నాథుడు.ఇంక అమ్మవారి స్థానము ఏమవుతుంది?ఆ తల్లి కామేశ్వరుని అంకమును స్థానముగా చేసుకుని విరాజిల్లుతూ ఉంటుంది. శివుడు,కాముడు అనునవి పరమేశ్వరుడికి విశేషణములు.అందుకే ఆయన శివకామేశ్వరుడయ్యాడు.పరమేశ్వరుడికి సృష్టి చేయాలని ఇచ్ఛ కలిగింది.ఆ శివుని ఇచ్ఛకు పరమేశ్వరి స్వరూపురాలు అయింది.అందుకే ఆమెను ఇచ్ఛా శక్తి,ఇచ్ఛా స్వరూపురాలు అని అంటారు.శివము అనగా మంగళము అని అర్థము.మంగళము కలిగించువాడు శివుడు.శివుని భార్య శివాని.కాబట్టి ఆమె కూడా మంగళరూపిణియే!ఒకరు కుడి,ఇంకొకరు ఎడమ.ఆ కుడి ఎడమల సంగమము అర్థనారీశ్వర తత్త్వము.ఆ జగజ్జనని కామేశుడైన పరమేశ్వరుని వామాంకమున స్థిరముగా ఉన్నది కావున శివకామేశ్వరాంకస్థా అను నామము సబబుగా ఉన్నది. శంకరాచార్యులవారు అమ్మవారిని ఇలా పొగుడుతున్నారు.తల్లీ!పరమేశ్వరీ!అమృత సముద్రము మధ్యలో కల్ప వృక్షాలతో నిండి వున్న మణిద్వీపం ఉంది.ఆ ద్వీపంలో కదంబ పుష్పాలతో నిండిన తోట ఉన్నది.అక్కడ చింతామణులచే పొదగబడిన గృహము ఉంది.ఆ లోపల త్రికోణాకారపు మంచము ఉంది.ఆ మంచము మీద పరమశివుని పర్యంకస్థితవై ప్రకాశిస్తూ ఉన్నావు.అక్కడ నీవు జ్ఞాన స్వరూపమై నిరతిశయ సుఖ ప్రవాహరూపముగా ఉన్నావు.నిన్ను ఆ రకంగా చూసి తరించగలిగిన వాళ్ళు ముమ్మాటికీ ధన్యులు!

Sunday, 10 May 2026

సర్వాభరణ భూషితా

సర్వాభరణ భూషితా అను మంగళకరమైన నామము అమ్మవారికి శ్రీలలితా సహస్రనామావళిలో చెప్పబడిన ఏభై ఒకటవ శుభ నామము. అపాద మస్తకమూ,అంటే కాలి మెట్టెల నుండి శిరోభూషణమైన చూడామణి వరకు వివిధ ఆభరణములను తల్లి ధరించి ఉంది.కల్ప సూత్రములో అమ్మవారు నలభై రకాల నగలు పెట్టుకుని ఉందని వర్ణన జరిగింది.ఆమె థరించిన వాటిలో కొన్ని సౌభాగ్యదాయకమయినవి,మరి కొన్ని సౌందర్యదాయకమయినవి.మంగళసూత్రము,నల్లపూసలు,కమ్మలు,ముక్కు పుడక,కాలి మట్టెలు సౌభాగ్యకరములు. మిగిలినవి సౌందర్యదాయకములు. ఏడు వారాల నగలు ................ ఆదివారము...సూర్యుని కోసం కెంపుల కమ్మలు,హారాలు మొదలగునవి సోమవారము...చంద్రుని కోసం ముత్యాల హారాలు,గాజులు మొ॥॥ మంగళ వారము..కుజుని కోసం పగడాల దండలు,ఉంగరాలు మొ॥ బుథవారము..బుధుని కోసం పచ్చల పతకాలు,గాజులు మొ॥ గురువారము..బృహస్పతి కోసం పుష్యరాగం కమ్మలు,ఉంగరాలు మొ॥ శుక్రవారము...శుక్రుని కోసం వజ్రాల హారాలు,ముక్కెర మొ॥ శనివారము...శని ప్రభావం పడకుండా ఉండడం కోసం నీలమణి హారాలు మొ॥ ముక్కెర సౌభాగ్య చిహ్నము.కాబట్టి ముత్యాల అడ్డబాస పెట్టుకుంది. అమ్మవారు నవరత్నములు పొదిగిన ఒడ్డాణము,తప్తకాంచనము,వైఢూర్యమణులతో సిద్థము చేసిన భుజకీర్తులు,గొడుగు వంటి తాటంకములు,సూర్య చంద్రుల వంటి ఆకారముతో రత్న నిర్మితమయిన దివ్యమగు చూడామణి,శుక్ర నక్షత్రముతో సమానమయిన స్వచ్ఛమయిన నాసాభరణము,అమూల్య రత్నములతో పొదిగిన మకుటము,మణులతో పొదిగిన ఉంగరము,రత్న నిర్మితమయిన కింకిణులతో,కంకణములతో అమ్మవారు విరాజిల్లుతున్నారు. సప్తశతిలో ఇంకా ఇలా చెప్పారు.పాలసముద్రుడు అమ్మవారికి మంచి ముత్యాల హారము,మంచి నాణ్యమయిన చీరలు,దివ్యమయిన శిరోరత్నము,చెవి కమ్మలు,కడియములు,పాపిడి బొట్టు,భుజకీర్తులు,కాలి యందెలు,కంఠాభరణములు,అన్ని వ్రేళ్ళకూ శ్రేష్ఠమయిన ఉంగరాలు ఇచ్చాడు.విశ్వకర్మ బంగారు గండ్ర గొడ్డలి,పలు రకములు అయిన అస్త్రములు,అభేద్యమయిన కవచము ఇచ్చాడు.సముద్రుడు ఎప్పటికీ వాడని ఉత్తమజాతి తామరపూల హారములు తలలో ముడుచుకునేదానికి,మెడలో వేసుకునేదానికీ ఇచ్చాడు.హిమవంతుడు సింహ వాహనము,అనేక రకములు అయిన రత్న భూషణములు ఇచ్చాడు.కుబేరుడు మథువు కొరకు అక్షయ పాత్రను ఇచ్చాడు.శేషుడు గొప్పదైన మణులతో చెక్కిన నాగహారమును ఇచ్చాడు.అమ్మవారు ముక్కోటి దేవతల అంశతో ప్రకటితమయింది కదా!కాబట్టి ఆ దేవతల దగ్గర నుంచి ఆభరణములూ,అస్త్రములూ వచ్చాయి. అమ్మవారు సంహారానికి పోయినట్లుగా లేదు.సర్వాభరణ భూషిత అయి శుభకార్యానికి బయలుదేరినట్లు ఉంది.ఆమె శక్తి సైన్యముతో చక్రరాజము గేయచక్రము,కిరిచక్రము మొదలైన రథములతో బయలుదేరింది.

Saturday, 9 May 2026

అనవద్యాంగీ

అనవద్యాంగీ అను సుందర,పరిపూర్ణమయిన నామము అమ్మవారికి శ్రీలలితా సహస్ర నామావళిలో చెప్పబడిన ఏభయవ నామము. అమ్మ అంగములు అన్నీ పరిపూర్ణంగా ఉన్నాయి.ఎలాంటి దోషాలూ లేవు,కానరావు.అవయవములు అన్నీ వినూత్న శోభతో,ఎలాంటి దోషాలూ లేకుండా,పరిపూర్ణంగా ఉన్నయి.సాముద్రిక శాస్త్రానికే ప్రామాణికంగా ఉన్నాయి.ఆమె పొందిక గలిగిన శరీరావయములతో,లావణ్యరాశిగా ఒప్పారుతున్నది.మనం చందమామను చూసి నోరెళ్ళబెడతాము.చందమామ ఎంత అందంగా ఉంటుంది కదా!కానీ దానిలో కూడా మచ్చ ఉంది.కానీ అమ్మవారి విషయానికి వస్తే,ఎక్కడా ఏ లోపమూ చూపలేము.అనవద్యాంగీ అంటే నింద్యములు కాని అంగములు కలది అని అర్థము.సర్వారుణాఽనవద్యాంగ్యై అని అమ్మవారిని స్తుతిస్తే అమ్మవారితో పాటు అయ్యవారుకూడా వరాలిస్తాడట!ఎంతైనా భార్యను మెచ్చుకుంటే భర్తకూడా సంతోషించి,మెత్తపడతాడు కదా!

Wednesday, 6 May 2026

సర్వారుణా

సర్వారుణా అను నామథేయము అమ్మవారికి శ్రీలలితా సహస్ర నామావళి లో పెట్టబడిన నలభై తొమ్మిదవ శుభనామము. అమ్మవారు అరుణారుణ కాంతులతో శోభిల్లుతున్నది.ఒక్కటేమిటి?ఆమెకు సంబంథించిన ప్రతి విషయమూ ఎరుపుతో కలబోత అయినదే!అమ్మవారి శరీరఛాయ ఎఱుపు!ఆమె ధరించిన ఆభరణములు అన్నీ ఎఱుపే!ఆమె పళ్ళ పైన ఉండే చిగుళ్ళు ఎఱుపు!పెదవులు ఎర్రటి దొండపండ్లే!ఆమె కట్టిన వస్త్రం ఎఱుపు!ఆమెకు ఇష్టమయిన రంగు ఎఱుపు!సర్వం అరుణమయమే!అందుకే ఆమెకు సర్వారుణా అనే నామధేయం అతికినట్లు సరిపోయింది.ఆమె అంతా ఎఱుపులో మునిగి,తేలుతుంది కదా!అమ్మవారి శరీరం సింథూరం లాగ ఎర్రని ఎఱుపు.ఆమె చేతిలో కలువ కూడా నేను ఏమీ తక్కువ తినలేదు అన్నట్లు ఎర్రగా మెరిసిపోతుంది.రత్నఘటమునందుంచిన ఎర్రని,కోమలమయిన పాదాలతో అలరారుతున్నది.ఇవేనా?అంటే,ఊహూ!ఆమె తలలో తురుమిన పూలు కూడా ఎర్రదనంతో చిక్కగా ఉండే కదంబము,మందారము,దాడిమీ కుసుమాలతో ఘుమాయిస్తున్నాయి.ఆ తల్లి ముక్కెర గురించి చెప్పనే అఖ్ఖరలేదు.ఎఱ్ఱని పగడపు ముక్కెర సంపెంగలాంటి నాసిక అందాన్ని ద్విగుణీకృతం చేస్తున్నది.ఆమె రెండు పెదాలలో ఒకటి విద్రుమము లాగ,ఇంకొకటి దొండపండులాగ ముచ్చట గొలుపుతున్నాయి.తమషానా!ఆమె చిదగ్నికుండ సంభూత కదా!వీటన్నిటినీ త్రోసి రాజంటూ అపాదమస్తకమూ ఎఱ్ఱని కాంతులతో విరాజిల్లుతున్నది. అడుగడుగునా అరుణవర్ణ శోభిత అమ్మవారు.ప్రాతః సమయాన ఉదయభానుడి కిరణాలు,సాయం సమయాన సంధ్యారుణ కిరణాలకు బోధకములు అనిపిస్తుంది.భక్తులకు చైతన్యం కలిగించే జ్ఞానోదయానికి సంకేతములుగా భావించాలి.ఆ ఎఱుపు అద్వైత చైతన్యానికి నాంది పలికే సంకేతం!ఆమె శరీరం నుండి వెలువడే అరుణకాంతులు ఆ తల్లి కరుణాంతరంగ,అనిర్వచనమయిన,ఆప్యాయతా వీక్షణాలు.అపాద మస్తకమూ అరుణవర్ణంతో భాసిల్లుతున్నది.అమ్మ నుదుటన కస్తూరీ తిలకంతో కళకళలాడుతున్నది.

Wednesday, 29 April 2026

మహా లావణ్య శేవథి

మహా లావణ్య సేవథి అను అమృతతుల్యమయిన నామము అమ్మవారికి శ్రీలలితా సహస్ర నామావళిలో చెప్పబడిన నలభై ఎనిమిదవ నామము. అమ్మవారు అతిశయింతిన అందానికి నిథి,ప్రతీక!సేవథి అంటే నిథి అని అర్థము.ఆ తల్లి అణువణువు సౌందర్యభరితమే!ప్రతి అంగమూ అలవిమాలిన లావణ్యంతో,మార్దవంతో,సౌకుమార్యంతో విరాజిల్లుతుంది.అందుకనే వశిన్యాది వాగ్దేవతలు ఆమె అందాన్ని వర్ణించేదానికి మేమంటే మేము అంటూ ముందు వరసలో ఉన్నారు.ఆ తల్లి శిరోజాలనుంచి పూలకు సుగంథాలు అద్దుకున్నాయట!ఆమె లలాటం అష్టమి చంద్రునిలాగ ఉందట!కనుబొమలు మన్మథగృహ తోరణాల లాగ ఉన్నాయి.నయనాలు చలించే మీనాలలాగ ఉన్నాయి.సంపెంగ వంటి నాసిక!ఆమె చెక్కిళ్ళు పద్మరాగశిలలు లాగ,అద్దంలాగ నునుపుగా మెరుస్తున్నాయి.ఎర్రని పగడాలు,దొండపండులాంటి పెదవులు నిరతం చిరునవ్వులు చిందిస్తూ ఉంటాయి.శుద్ద విద్యాంకురముల వలె దంత పంక్తులు అట!సరస్వతి కచ్ఛపి వీణ కంటే మథురమయిన పలుకులు పలకగల నేర్పు!ఆమె చుబుకము అసలు దేనితోనూ పోల్చలేమట!ఇలా ఇక్కడా అక్కడా అని కాకుండా మొత్తం అందాల కలబోతగా ఉంది అమ్మవారు.అందుకనే అమ్మవారు అందాల గని,సౌందర్య ఖని,సులావణ్య నిథి అయింది. ఉరకలు వేస్తూ ఎత్తైన పర్వత శిఖరాల నుండి జాలువారే సెలయేర్ల అందం అమ్మవారి శిరోజాలనుండి అబ్బిందట!అమ్మవారి నాసికను చూసి సంపెంగ ఈర్ష్యతో వాడిపోయింది.అమ్మవారి పెదవుల ఎరుపుదనం చూసి దొండ పండు గింజుకుంది.అది చూసి అమ్మవారి మీనాలు చెవులదాక సాగి చెవిలో చెప్పాయట!పోనీలే పాపం అని అమ్మవారు పూలకు రకరకాల రంగులు,సుగంథాలు ప్రసాదించింది.అమ్మవారి మాటల మాథుర్యమును పూలలోని మకరందానికి కొంచెం అద్దింది అట!ఎంత విశాల హృదయం కదా! ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు.అది జగమెరిగిన సత్యం.కానీ అమ్మవారి సౌందర్యం నిత్యనూతనం,శాశ్వతం,సచ్చిదానందమయినది.ఆ తల్లిని వీక్షిస్తే జన్మ ధన్యం అవుతుంది.అఖండమయిన బ్రహ్మానందం కలుగుతుంది.

Monday, 27 April 2026

మరాళీ మందగమనా

మరాళీ మంద గమనా అను అద్భుత నామము అమ్మవారికి శ్రీ లలితా సహస్రనామావళిలో చెప్పబడిన నలభై ఏడవ నామము.లలితాంబ బహు సౌందర్యవతి అని అందరికీ తెలుసు కదా!ఆమె అందం లాగే ఆమె నడక బహు సొంపైనది అని వశిన్యాది వాగ్దేవతలు మురిసి పోతున్నారు.ఆడ హంస లాగ మందగమనముతో అడుగులు వేస్తుంది అట.తల్లిని చేరేదానికి భక్తుడు కూడా ఆడహంస మందగమనము వంటి నెమ్మది గలిగిన శ్వాసద్వారా లక్ష్యము చేరుకుంటాడు అట!మరాళీ అంటే ఆడహంస అని అర్థము. మూలాథారమునదున్న కుండలినీ శక్తి మరాళి వంటిది.సాథకుడు తన యోగ సాథనలో కుండలినీ శక్తిని (మరాళీ)జాగృతము చేయగా సుషుమ్నా నాడి ద్వారా సహస్రారానికి చేరుతుంది.ఇక్కడనుంచి మరల మూలాథారము యందు ప్రవేశిస్తుంది.ఈ దారి మొత్తమూ కుండలినీ శక్తి ఆడహంస లాగా మందగమనయై ఉంటుంది. పరమేశ్వరి హంస స్వరూపిణి.భక్తమానస సరోవరంలో విహరించే హంస స్వరూపిణి అమ్మ.అమ్మవారు జీవాత్మ,పరమాత్మలు ఒకటి అనే పరమార్థాన్ని తెలియ చెప్పే అద్వైతస్వరూపిణి.

Saturday, 25 April 2026

శింజాన మణిమంజీర మండిత శ్రీ పదాంబుజా

శింజాన మణిమంజీర మండిత శ్రీ పదాంబుజా అను పవిత్ర నామము శ్రీ లలితా సహస్ర నామావళిలో అమ్మవారికి పెట్టబడిన నలభై ఆరవ నామము. అమ్మవారు కాలి అందెలు ధరించి ఉన్నారు.అవి ఎలా ఉన్నాయంటే మథురమయిన చిరు సవ్వడులు చేస్తున్నాయి.ఆ కాలి అందెలు మణిఖచితమయి ఉన్నాయి.అవి ధరించిన అమ్మవారు శుభకరంగా,శోభాయమానంగా వెలిగి పోతున్నారు.ఆమె పాదాలను అలంకరించిన మణిఖచిత అందెలు శ్రవణానందంగా చిరు సవ్వడులు చేస్తున్నాయి.ఆ సవ్వడులు ప్రణవ నాదం చేస్తున్నట్లున్నాయి.పంచదశీ మంత్రము నర్మగర్భితంగా ఆలపిస్తున్నట్లుంది.శుద్ధవిద్యాంకుర స్వరూపులైన బ్రాహ్మణులు వల్లెవేసే వేదాధ్యయనం లాగ అనిపిస్తుంది. శంకరాచార్యులవారి చతురత ఇక్కడ బయట పెట్టారు.శివుడికి పార్వతి చేత పాదతాడనం చేయించుకోవాలి అని కోరిక కలిగింది అంట.అందుకని గౌరి ఊసు ఎత్తాడట ఉమ ముందర.ఇంకేముంది?పరాయి స్త్రీ మాట పతి నోట వస్తే ఇంక ప్రళయమే కదా!ఆమె శివుడి పైకి కాలు విసిరింది అంట!భవుడికి జరిగిన పరాభవము చూసి మన్మథుడు విరగబడి నవ్వాడట!నవ్వడా?ఆ శివుడే కదా ఈ మన్మథుడిని భస్మ చేసింది!మన్మథుడి మనసు కొంచెం తేలికపడి,ప్రశాంతంగా,ఒకింత పరిహాసంగా కిలకిలమని నవ్వినట్లుందట ఆ అందెల సవ్వడి!

Friday, 24 April 2026

పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా

పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా అను దివ్యనామము అమ్మవారికి శ్రీలలితా సహస్ర నామావళిలో చెప్పబడిన నలభై అయిదవ శుభనామము. ప్రభాజాలములు అంటే కాంతి కిరణాలు.ఆ తల్లి పాదములు పద్మముల కాంతిని సైతం తిరస్కరించేటంత కాంతులతో విరాజిల్లుతున్నాయి.మాములుగా దేవుళ్ళు,దేవతల పాదపద్మములు అని చెప్పుకుంటాము కదా!కానీ ఇక్కడ అమ్మవారి పాదద్వయము అంతకు మించి అనినట్లు ఉంది.ఆమె పాదములు పద్మముల కంటే కూడా దివ్యకాంతులతోను,మృదువుగా,కోమలంగా విరాజిల్లుతున్నాయి. వశిన్యాది వాగ్దేవతలు ఇలా అనే దానికి గట్టి కారణమే ఉంది.లేకపోతే అంత ఆషామాషీగా ఎలా అనేస్తారు?వారి ఉద్దేశ్యంలో పద్మాలు,వాటి కాంతులు ఎక్కువ సేపు నిలవవు.నీటిలో ఉన్నా సరే,నీటి బయట ఉన్నా సరే.కానీ అమ్మవారి పాదపద్మముల కాంతి అనంతరం,నిరంతరం వెలుగులు చిమ్ముతూనే ఉంటాయి.ఎందుకంటే 360 కిరణములు అమ్మవారి పదద్వయ ప్రభాజాలములే!ఈ కిరణాలే చరాచర జగత్తును ప్రకాశింప చేస్తున్నాయి.లేక పోతే అంతా అంధకార బంధురమే!ఈ పాదాలను మనము పూజిస్తున్నాము అంటే మనము చాలా చాలా అదృష్టవంతులము.ఎందుకంటారా?ఆ పాదములను నిత్యమూ బ్రహ్మ,విష్ణువు,మహేశ్వరులు పూజిస్తారు.అంతేనా?చతుర్వేదముల చేత కూడా పూజింపబడతాయి. అమ్మవారి కుడి పాదము శుక్లవర్ణము.అమ్మవారి ఎడమ పాదము రక్త వర్ణము.ఈ రెండూ కలిసి అజ్ఞానము,అవిద్యా రూప సంసార బంధమును తొలగింపచేస్తాయి.బ్రహ్మ తేజముతో అమ్మవారి పాదద్వయము ఏర్పడింది.

Tuesday, 21 April 2026

నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణా

నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణా అను శుభప్రదమయిన నామము శ్రీలలితా సహస్ర నామావళిలో అమ్మవారికి పెట్టబడిన నలభై నాల్గవ నామము. తిమిరము అంటే చీకటి,అజ్ఞానము అని కదా అర్ధము.చీకటిని పారద్రోలాలంటే వెలుతురు కావాలి కదా!అమ్మవారి కాలి గోళ్ళు తన దగ్గరకు నమస్కరించేదానికి వచ్చే భక్తుల అజ్ఞానాంధకారాన్ని పారద్రోలేలాగా దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి.అందులోనూ ఆ గోళ్ళు,అదే నఖములు,దేవతల తలపైన ఉన్న మకుటాలలో ఉండే వజ్ర వైఢూర్యాల రాపిడితో సానబెట్టబడి ఉన్నాయి కదా!ఎందుకంటే ముక్కోటి దేవతలూ అను నిత్యమూ ఆమెకు పాదాభివందనం చేస్తుంటారు కదా! అమ్మవారి పాదాలు షట్చక్రాలకు పైన ఉండి,చక్రాలపైన అనంతమయిన కిరణాలను వర్షింపచేస్తాయి.అలా వర్షించే కిరణాలలో అగ్నికి సంబంధించినవి 108 ఉన్నాయి.సూర్యుడికి సంబంధించినవి 116 కిరణాలు ఉన్నాయి.అలాగే చంద్ర సంబంధిత కిరణాలు కూడా 136 ఉన్నాయి.దీనినే సౌర సంవత్సరము అని అంటారు. శంకరాచార్యులు అమ్మవారిని ఇలా స్తుతిస్తున్నారు.అమ్మా!జగన్మాతా!నీవు బ్రహ్మరంథ్ర స్థానములో ఉన్న సహస్రార చక్రములో అయ్యవారితో విహరిస్తున్నావు.నీ పాదద్వయముల మధ్యభాగము నుండి అమృతధారా వర్షములు ఉబికి వేల నాడుల ప్రపంచమును తడుపుతున్నాయి.అమృతాతిశయ కాంతిగల చంద్రుని స్థానము,అనగా బ్రహ్మ రంధ్రమును,వీడి మరలా స్వస్థానమయిన మూలాధారమును చేరుతున్నాయి.అంటే ఒక రకంగా చెప్పాలంటే పాములాగ తనను తాను చుట్టుకున్నట్లుగా ఉంది.పృథ్వీతత్త్వమగు మూలాధారమందు తామరతూండ్ల మధ్యలోని సన్నని రంథ్రములో సూక్ష్మముగా కుండలినీ శక్తిగా నిద్రిస్తూ ఉంటావు. భక్తుడు నీ పాదపద్మాలను చేరాలంటే చాలా దీర్ఘమయిన యాత్ర చేయాల్సిందే!సాధకుడు తన దేహంలో ఉన్న పృథ్వీతత్వంతో కూడిన మూలాథార చక్రంలో 56 కిరణాలను దాటాలి.ఆ పై జల తత్వాత్మికమయిన మణిపూరక చక్రంలో 52 మయూఖములను దాటాలి.ఆ తరువాత అగ్ని తత్వాత్మికమయిన అనాహత చక్రంలో 54 కాంతి రేఖలు దాటాలి.అటు పైన ఆకాశతత్వాత్మికమయిన విశుద్ధ చక్రము నందు 72 కాంతి కిరణాలు దాటాలి.ఆఖరున మనస్తత్వంతో కూడిన ఆజ్ఞాచక్రము నందు 64 కిరణ పుంజాలు దాటాలి.అప్పుడే అమ్మవారి పాదాలు గోచరమవుతాయి. శంకరాచార్యుల వారు స్వర్గంలోని కల్పవృక్షం అమ్మవారి కాలి గోటికి కూడా సమం కాదు అని ఎద్దేవా చేస్తున్నారు.ఎందుకంటే కల్పవృక్షం స్వర్గంలోని దేవతల కోరికలు మటుకే తీరుస్తుంది,మనకు కాదు.కానీ అమ్మవారి పాదపద్మాలను నమ్ముకుంటే మన అందరి కోర్కెలూ తీరుస్తుంది. ఇంకో సారూప్యం కూడా చెబుతున్నారు శంకరాచార్యులవారు.అమ్మవారి గోర్లు చంద్రబింబాలలాగ వెలిగి పోతున్నాయట.శచీ దేవి,మిగిలిన దేవతలు ఆమె పాదాలకు నమస్కరించేటప్పుడు,వారి చేతులు చంద్రుని కాంతికి పద్మాలలాగ ముడుచుకుని పోతున్నాయట.

Saturday, 18 April 2026

కూర్మపృష్ఠజయిష్ణు ప్రపదాన్వితా

కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితా అను మథురమయిన నామము అమ్మవారికి శ్రీలలితా సహస్ర నామావళిలో చెప్పబడిన నలభై మూడవ నామము.తాబేలు వీపుకంటే కూడా సుందరమయిన మీగాళ్ళుతో అమ్మ అలరారుతున్నది.మీగాళ్ళు అంటే అరిపాదము పైభాగము.అమ్మవారి పాదములు మోక్షప్రదములు.నాలుగు వేదాలకు సంబంథమయిన అహం బ్రహ్మాస్మి,తత్త్వమసి,ప్రజ్ఞానం బ్రహ్మ,అయమాత్మా బ్రహ్మ అనే నాలుగు పరమ పవిత్రమయిన వాక్యములు అమ్మవారి పాదాలను ప్రస్తుతించే వేదాలకు చెందినవి.శ్రీమహా విష్ణువు ఆది కూర్మము రూపములో తన పృష్ఠ భాగముతో మంధర గిరిని క్షీరసాగరంలో కృంగకుండా ఆపగలిగాడు.అటువంటి బహు సుందరమయిన ఆ ఆదికూర్మము యొక్క పృష్ఠ భాగము కంటే కూడా జగన్మాత పాదాగ్రములు సుందరమై,అత్యంత మృదుత్వంతో వెలిగిపోతున్నాయి. అమ్మవారిని కీర్తించడంలో శంకరాచార్యులు రెండాకులు ఎక్కువే చదివారు అని ఎప్పుడూ అనుకుంటాము కదా!ఇక్కడ కూడా అది నిజమయింది.ఆయన ఇలా అంటున్నాడు.ఓ అఖిలాండేశ్వరీ!నీ పాదములు యశస్సును కలిగించేవి.విపత్తులను హరిస్తాయి.పురారి అయిన శివుడు వివాహ సమయంలో మృదువైన నీ పాదములను చేతబట్టి సన్నెకల్లును త్రొక్కించాడు.ఆరాయి పైన పెట్టినప్పుడు పాదం కమిలి పోతుందేమోనని బహు వ్యాకులపడినాడు.అలాంటి సుతిమెత్తని పాదాగ్రములను కఠినమయిన తాబేలు పృష్ఠ భాగముతో పోల్చడం సబబేనా అని వాపోతున్నాడు. ఓ లలితా పరమేశ్వరీ!నిన్ను ఆశ్రయించిన వారికి సత్కీర్తులను కలిగిస్తావు.సకల ఆపదలు తొలగిస్తావు.నీ పాదాగ్రములు మంచికి పుట్టినిల్లు లాంటివి.నీ పాదాగ్రములు చెడు అనేది దరిచేరలేని శుభకరమయిన వాకిళ్ళు.

Friday, 17 April 2026

గూఢగుల్ఫా

గూఢగుల్ఫా అను అమ్మవారి నామము శ్రీలలితా సహస్ర నామావళిలోని నలభై రెండవ నామము.ఇంపైన,లావైన చీలమండలు అమ్మవారు కలిగి ఉన్నారు.అమ్మవారు చీలమండలు కనిపించకుండా,చీరకుచ్చెళ్ళను నేల తాకేదాకా జారవిడిచి ఉంది.కాలి మట్టెలుకూడా కనిపించకుండా చీర కుచ్చెళ్ళు జీరాడుతున్నాయి.పద్మాసనం వేసుకుని ఉన్నప్పుడు కూడా కానరావు.అలగే పీఠం మీద కూర్చున్నప్పుడు ఒక కాలు పీఠం మీద,రెండో కాలు పద్మాసన స్థితిలో ఉన్నా కూడా చీలమండలు కానరావు.ఎందుకంటే స్త్రీ యొక్క సౌందర్యము భర్తకు మటుకే అంకితము.గుహ్య స్థానము రత్నమణి సూచకము.చీలమండలు సంథి స్థానము.

Tuesday, 14 April 2026

ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభి జంఘికా

ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభి జంఘికా అను సుందర నామము అమ్మవారికి శ్రీ లలితా సహస్ర నామావళిలో చెప్పబడిన నలభై ఒకటవ నామము. అమ్మవారి జంఘికలు,అనగా పిక్కలు మన్మధుని అంబులపొది లాగా కనిపిస్తున్నది.అదీ ఎర్రని రంగులో ఆరుద్ర పురుగులతే చుట్టూ చెక్కబడినట్లు ఉంది.ఆమె జంఘికలు మన్మథుని సుమబాణ తుణీరము లాగ గోచరిస్తున్నది.మన్మథుని బాణ తుణీరము ఎర్రని ఇంద్రగోపములచేత పొదగబడి ఉంటుంది. ఆరుద్ర పురుగులు వ్యవసాయము మొదలు పెట్టుటకు ఆరుద్ర కార్తె అనుకూలమయినది.అవి ఎర్రగా గురివింద గింజలంత ఉంటాయి.ఆరుద్ర పురుగు మఖ్ మల్ వస్త్రము లాగ అందమయిన,సున్నితమయిన,ఎర్రని పట్టు వస్త్రము కప్పుకున్నట్లు ఉంటుంది.వర్షంలో ఇవి చావకుండా ఇంద్రుడు కాపాడుతుంటాడు.కాబట్టి వీటిని ఇంద్రగోపములు అని అంటారు.అమ్మవారి జంఘికములు ఇంద్రగోపములతో పొదగబడిన మన్మథ బాణతూణీరములాగ ఉంది.అందులో మల్లెలు,చంపకములు(సంపంగెలు),పున్నాగములు మొదలైన సుగంథ భరిత పుష్పములతో చేయబడిన బాణాలు ఉంటాయి.మన్మథుని విల్లు ఇక్షుకము(చెఱకుగడ)తోనూ,వింటి నారి బిసతంతువులు(తామరతూండ్లలోని సన్నని దారములు)తో చేయబడి ఉంటుంది.ఇంతేనా!ఆ విల్లు పైన సమ్మోహన మంత్రమూ,వశీకరణ మంత్ర బీజాక్షరములు లిఖించబడి ఉంటాయి. శంకరాచార్యులవారు ఇంకొంచెం ఎక్కువగా వర్ణిస్తున్నారు అమ్మవారి జంఘికములను.హే గిరిసుతా!ఈశ్వరుని గెలిచేదాని కోసరము మన్మథుడు నీ పిక్కలను పదేసి బాణాలుండే అమ్ముల పొదిలాగ తయారు చేసుకున్నాడు.నిజానికి ఆయన దగ్గర ఉండేవి ఐదు బాణాలే.అవి చాలవని నీ గోటికొనలనెడు బాణాగ్రములు కనుపించుచున్నవి అని అంటున్నాడు.ఆ బాణాగ్రములు అమ్మవారి పాదములకు మ్రొక్కుచున్న దేవతల కిరీటములచే పదును పెట్టబడి ఉన్నాయి.అంటే ప్రొద్దున లేచి ముక్కోటి దేవతలు ఆమెకు సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారన్నమాట.మరి ఆ కిరీటాలు అమ్మవారి కాలి గోళ్ళకు రాసుకుంటుంటే గోర్లు పదునెక్కకుండా ఉంటాయా? ఇదే కాకుండా ఇంకో విశ్లేషణ.ఇంద్రగోపములు అంటే మంత్రము లోని బీజాక్షరములు అని రహస్యార్థము.తూణము లేక తూణీరము అంటే మంత్ర సముదాయము.తూణము నందు ఉండే బాణములచేత మంత్రములు సూచితమవుతున్నాయి.ఆ జగన్మాత యొక్క జంఘికలు మహావర్ణ సంపుటికలు.

Monday, 13 April 2026

మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితా

మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత అని మంగళప్రదమయిన నామము అమ్మవారికి శ్రీ లలితా సహస్ర నామావళిలో పెట్టబడిన నలభైవ నామము. అమ్మవారు మాణిక్య కిరీటము వంటి మోకాలు చిప్పలతో విరాజిల్లుతున్నది. శంకరాచార్యులవారు అమ్మవారి మోకాలు చిప్పలగురించి ఇలా ప్రస్తావించారు.ఆమె జానువులు,అనగా మోకాళ్ళు,చాలా కఠినంగా ఉన్నాయి.ఆమె ముల్లోకాలకు తల్లి అయినా,పతివ్రతా ధర్మాన్ని తు.చ.తప్పకుండా పాటించింది.అను నిత్యమూ కామేశుడికి సేవలు చేస్తుంది.భక్తిగా మోకాళ్ళపైన పాదాభివందనం చేస్తుంది.కాబట్టే ఆమె మోకాలి చిప్పలు ఐరావతం యొక్క కుంభస్థలం అంత గట్టిగా ఉన్నాయి.కామేశుడికే తెలిసినవి అనడంలో ఒక నిగూఢమయిన పరమార్థం కూడా ఉంది.పార్వతీ పరమేశ్వరులు అర్థనారీశ్వరులు కదా!శంకరుడు పద్మాసనంలో కూర్చుంటాడు కదా!అప్పుడు ఎడమ తొడ మీదకు కుడి అరికాలు ఆనుతుంది కదా!ఇక్కడ ఎడమ తొడ అమ్మవారిది.కుడి అరిపాదం అయ్యవారిది.ఆ అరికాలి స్పర్శతో అమ్మవారి తొడ మృదత్వం అయ్యవారికి ఎరుకయింది.అంతే కానీ ఇంకో రకంగా కాదు అని శంకరాచార్యులవారి ఉవాచ. అన్మ ఎర్రని చీర కట్టుకుని ఉంది.కాబట్టి ఆమె మోకాళ్ళు ఆ ఎర్రని చీరతో కప్పబడి ఉండటంతో మాణిక్యాలలాగా వెలిగి పోతున్నాయి అని కూడా చెబుతున్నారు.

Sunday, 12 April 2026

కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితా

కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితా అను మంగళకరమయిన నామము అమ్మవారికి శ్రీలలితా సహస్ర నామావళిలో పెట్టబడిన ముప్పై తొమ్మిదవ శుభనామము.పరమేశ్వరునికి మటుకే తెలిసిన సౌభాగ్యశ్రీలతోను మృదుత్వంతోను కూడిన ఊరువులు కలిగి ఉంది అమ్మవారు.భార్య యొక్క సర్వాంగములు భర్తకు ఒక్కడికే తెలుస్తాయి.కాబట్టి వశిన్యాది వాగ్దేవతలు కూడా ఆమె ఊరువులను ఇంక దేనితోను పోల్చలేదు. అమ్మవారి సర్వాంగములు వివిధ దేవతలయొక్క అంశలనుండి ప్రకటితమయ్యాయి కదా!అలా వరుణుని తేజస్సుతో ఊరువులు,పిక్కలు కలిగాయి.భూదేవి తేజముతో నితంబభాగము అనగా పిరుదులు కలిగాయి.అమ్మవారి ఊరువుల జంటలో ఎడమ తొడ సౌభాగ్యానికి సంకేతము.కుడి తొడ మార్దవ సంకేతము కలిగి ఉంది.ఊరు లలో ఊ అను అక్షరము,రు లో ఉకారము ఉన్నాయి.ఇందులో ఉ కారము దక్షిణ ఊరువు.ఊ కారము వామోరువు.వామోరువు పరాసూచితము.దక్షిణోరువు అపరాసూచితము.వామోరువు జగత్తులోని బ్రహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అను నాలుగు వర్ణములకు సూచన.దక్షిణోరువు భూమి,నీరు,వాయువు,నిప్పు,ఆకాశము అనే పంచభూతములు మరియు మనోబుద్ధ్యహంకారములకు సూచనగా నిలుస్తాయి. కామేశుడికే తెలిసిన ఊరూద్వయం అని వశిన్యాది వాగ్దేవతలు అమ్మవారి ఊరువులను దేనితో పోల్చలేదు.కానీ శంకరాచార్యులవారు మాత్రం కొంచెం ధైర్యం చేసారు.ఆయన ఇలా అన్నారు.అమ్మా!పరమేశ్వరీ!వేదవిహితమయిన ధర్మానుష్టానము కలిగినదానివి.నీ ఊరువులు రెండూ దిగ్గజముల తొండాల శోభనూ,బంగారు అరటి బోదెల అందాన్నీ ధిక్కరిస్తున్నాయి.అవి అత్యంత శోభాయమానంగా వెలిగిపోతున్నాయి.అలాగే నీ జానువులు,అనగా మోకాలి చిప్పలు రెండూ చక్కనయిన వట్రువులు(గోళాకారం)లాగా ఉన్నాయి.నీవు పతివ్రతా శిరోమణివి కదా!నిరంతరమూ నీ భర్తకు సేవలు చేసేతూ,మోకాళ్ళపై పాదాభివందనం చేస్తుంటావు కదా!అలా ఆ మోకాళ్ళు నేలకు రాసుకుని,రాసుకుని కఠినంగా మారాయి.ఎంతటి గట్టిదనం అంటే ఐరావత దిగ్గజము యొక్క కుంభస్థలాలను సైతం ధిక్కరిస్తున్నాయి.అవి జయకరంగా విరాజిల్లుతూ ప్రకాశిస్తున్నాయి.

Saturday, 11 April 2026

రత్న కింకిణికా రమ్య రశనా దామ భూషితా

రత్న కింకిణి కా రమ్య రశనా దామ భూషితా అను దివ్య నామము అమ్మవారికి శ్రీ లలితా సహస్ర నామావళిలో చెప్పబడ్డ ముప్పై ఎనిమిదవ పవిత్ర నామము. అమ్మవారు రత్నములతోను,చిరు గజ్జెలతోను మిక్కిలి రమణీయ మైన సువర్ణపు ఒడ్డాణం ధరించి,అలరారుతున్నది.ఆడవారు మొలనూలు,లేక ఒడ్డాణం ధరిస్తారు.అమ్మవారికి ఆభరణములకు లెక్కలేదు కదా!అన్నీ నవ రత్న ఖచిత సువర్ణాభూషణములే!అందులో ఈ ఒడ్డాణం అంచులకు నవరత్నములతో పొదిగిన చిరుగంటలు వ్రేలాడు తున్నాయి.ఆమె ఒడ్డాణం నాభి మీదుగా ఉంది. అమ్మ విరాట్ స్వరూపాన్ని ఒకసారి ఊహించుకుందాము.అప్పుడు నాభికి పైన ఊర్ధ్వలోకములు,నాభి క్రింద అధోలోకములు ఉన్నట్లు కాన వస్తుంది.ఆ రెండింటినీ ఈ ఒడ్డాణం అనుసంథానిస్తున్నట్లు అనిపిస్తుంది కదా!

Tuesday, 7 April 2026

అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతటీ

అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతటీ అను పరమ పవిత్రమయిన నామము శ్రీలలితా సహస్ర నామావళిలో అమ్మవారికి పెట్టబడిన ముప్పై ఏడవ నామము. బాలభానుడు రాగ రంజితమయిన ఎఱుపు రంగుకే ఇంకొంచెం ఎఱుపు అద్దినట్లు మెరిసి పోతుంటాడు కదా!అలాంటి కుంకుమ పువ్వు ఎఱుపు రంగు వస్త్రముతో ప్రకాశించు కటి ప్రదేశము కలిగి ఉంది అమ్మవారు.అరుణవర్ణం అంటే ఎరుపు.ఎరుపుకే ఎరుపు అద్దడం అంటే ఇంకా శోభాయమానంగా అమ్మవారు వెలిగి పోతున్నట్లు. సూర్యుని రథసారథి అనూరుడు.అతను అరుణ వర్ణంలో ఉంటాడు.అందుకని అరుణుడు అని అంటారు.అనూరుడు అంటే ఊరువులు లేని వాడు అని అర్థం.ఊరువులు అంటే తొడలు. ఆ తల్లి కట్టుకునిన వస్త్రం ఒక్కటే అరుణ వర్ణం కాదు.ఆమె మొత్తం అరుణ వర్ణంలో మునిగి తేలుతుంటుంది.ఆమెకు ఎరుపు రంగు అంటే అంత ఇష్టం.ఆమె అలంకరణకు వాడే ఆభరణాలు ఎరుపు.ఆమె కొప్పులో తురుముకునే పూలు ఎరుపు.ఆమె కట్టిన వస్త్రం ఎరుపు.అంతా అరుణమయం.ఎందుకంటే బాలభానుడు లాగా ఆమె మన జీవితాలలో వెలుతురు తెస్తుంది.ఎర్రని గులాబీ లాగా ప్రేమలు పంచుతుంది.ఎరుపు ఉత్తేజం తీసుకుని వస్తుంది.సకల వేదవేదాంగాలు పుక్కిట బట్టిన బ్రాహ్మడి ముఖకమలం అరుణవర్ణ రంజితంగా ఉంటుంది.అంటే బ్రహ్మ జ్ఞానంతో వెలిగి పోతుంది.అమ్మకూడా జ్ఞానేశ్వరి కదా!ఆమె జ్ఞానం వలన శరీరం మొత్తం ఎర్రగా మెరిసిపోతుంది.దానికి తోడు ఆమె ధరించిన ఎర్రని వలువలు ఆమె జ్ఞానానికి,ప్రేమకు ఉద్దీపన చేకూరుస్తున్నాయి.

Wednesday, 1 April 2026

స్తనభార దళన్మధ్య పట్టబంధ వళిత్రయ

స్తనభార దళన్మధ్య పట్టబంధ వళిత్రయ అను పవిత్రమయిన శుభనామము శ్రీలలితా సహస్ర నామావళిలో అమ్మవారికి పెట్టబడిన ముప్పై ఆరవ నామము. స్తనభారంతో నడుము విరిగిపోతుందేమో అన్నట్లు ఉందట అమ్మవారికి.అలా కాకుండా చుట్టూ పట్టీలు వలె వళిత్రయము కానవస్తుంది అంట.వళిత్రయము అంటే అమ్మవారి పొట్టపైన ఉన్న మూడు మడతలు. ఆ తల్లి స్తన ద్వయం రవిసోమాత్మకమయిన కాలాన్ని సూచిస్తుంది.అట్టి కాలాన్ని భరిస్తుంది కాబట్టి కాలస్వరూపిణి అనే నామము సార్థకమయినది.వశిన్యాది వగ్దేవతలు ఆమెను ఇలా వర్ణించగా అమ్మ అరమోడ్పు కన్నులతో మందస్మిత అయిందట! ఆ ముడతలకు చాలా అర్థం ఉంది.ఆ మూడు ముడతలు సత్త్వ రజస్తమములనే గుణత్రయానికి ప్రతీక.స్థూల సూక్ష్మ కారణ దేహాలకు గురుతులు.మువురమ్మలు అయిన మహాలక్ష్మి,మహాకాళీ,మహా సరస్వతులుగా అనుకోవచ్చు.అంతే కాకుండా త్రిమూర్తులు అయిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భావించవచ్చు.ముల్లోకాలు అయిన భూ,భువ,సువర్లోకములుగా సమన్వయించుకోవచ్చు. ఇప్పుడు ఇంక శంకరాచార్యుల వారు ఏమి చెబుతున్నారో గ్రహిస్తాము. అమ్మవారు సదా అయ్యవారి స్మరణలోనే ఉంటారు కదా!అందుకని సారెకు ప్రక్కలయందు చెమట పట్టి రవిక బిగుతు అవుతున్నదట!అందువల్ల చంకల దగ్గర ఒరుసుకుంటున్నదట.ఆ భారానికి సన్నని,లేలేత నడుము విరిగిపోకుండా మన్మథుడుచే ఏలకుల లతచేత కట్టబడిన మూడు కట్లవలె ఉన్నాయి అంట ఆ మూడు ముడతలు.ఆ మూడు ముడతలు అంత శోభాయమానంగా ఉన్నాయట! అన్నిటికంటే ఉత్తమమయిన విశ్లేషణ.శంకరాచర్యులవారు మన అందరికీ తల్లిగా,ప్రౌడ సౌందర్యంతో విరాజిల్లుతున్నది అని చెబుతున్నారు.బిడ్డల తల్లి అయిన ప్రౌడ స్త్రీకి ఉదరం పై ముడతలు అందం కన్నా పరిపూర్ణమయిన స్త్రీత్వానికి,మాతృత్వానికీ అర్థం చెబుతున్నట్లు ఉంది.సంకేతంగా కనిపిస్తున్నాయి.

Monday, 30 March 2026

లక్ష్యరోమలతాధారతా సమున్నేయ మధ్యమా

లక్ష్యరోమలతా ధారతా సమున్నేయమధ్యమా అను పవిత్ర నామము శ్రీలలితా సహస్ర నామావళిలో వాగ్దేవతలు అమ్మవారికి ముప్పై అయిదవ నామంగా చెప్పారు.ఇందాక నామంలో అమ్మవారి నాభి పాదులాగ ఉంది అని అనుకున్నాము కదా!ఆ పాదు నుంచి మొలచిన,వచ్చిన నూగారు లతకు స్తనద్వయం ఫలాల లాగ ఉంది అని విశ్లేషణ అయింది కదా!దానిని ఇంకొంచెం పొడిగిస్తున్నారు వాగ్దేవతలు.ఆ తీగకు ఆధారంగా సన్నని నడుము గలిగి ఉందట అమ్మవారు.స్త్రీని సింహమధ్య అని అంటారు.స్త్రీలకు నడుము అందంగా,సన్నగా,పల్చగా ఉండడం శుభప్రదమయిన సాముద్రిక లక్షణం. శంకరాచార్యులవారు అమ్మవారి నడుముతో బాటు నడుముకు పెట్టుకున్న ఆభరణాలను వర్ణించాడు.అమ్మవారు మంగళప్రదమయిన సవ్వడులు చేస్తుండే కనక ,రత్న,మణులతో పొదగబడిన మొలనూలు ధరించి ఉందట!మదపుటేనుగుల కుంభ స్థలం లాంటి స్తనభారముచే కొంచెం ముందుకు వంగి ఉందట.మామూలు స్త్రీలే పిల్లలకు పాలు ఇచ్చే సమయంలో స్తనభారంతో ఉంటారు.అలాంటిది ముల్లోకాలకూ జగన్నాత అయిన తల్లి.ఈ సర్వ సృష్టిలోని ప్రాణుల ఆకలి తీర్చేది,తీర్చగలిగే సత్తా,స్తోమత ఉండే తల్లి పాలిండ్లు ఇంకెలా ఉండాలి?ఉంటాయి? శంకరాచార్యులవారు ఇంకా ఇలా వర్ణిస్తున్నారు.తల్లీ!నీ నడుము చూస్తే నాకు భయంగా ఉంది.ఎంతటి సవ్నని నడుము!నాభి,నడుము ముడతల దగ్గర విరిగి పోతుందేమో అనిపిస్తున్నది.ఆయన అమ్మవారి ఆశీస్సులు ఇలా కోరుకుంటున్నాడు.తల్లీ!నీ నడుము ఎలా ఉందో చెప్పేదా!ఒడ్డు మీద నుండి వాగు వైపుకు ఒంగిన చెట్టులా వంపుగా తిరిగి ఉంది.ఆ చల్లని,శుభకరమయిన నడుము చిరకాలమూ కుశలంగా ఉండి మాకందరికీ క్షేమం కలిగించుగాక!అని ఆశ పడుతున్నాడు. దేవి యొక్క ఆవిర్భావ సమయంలో ఇంద్రుని తేజస్సుతో నడుము మరియు పొట్టపై మూడు ముడతలు(త్రివళులు) ఏర్పడినవి.చంద్రుని తేజస్సుతో రెండు వక్షోజములు ఏర్పడినవి. సమున్నేయ మధ్యమా అంటే చక్కగా ఉద్ధరింపబడిన నడుము కలిగినది అని అర్థము.అమ్మవారి విరాట్ రూపంలో నాభికి పైన ఊర్థ్వలోకములు,నాభికి దిగువ అధోలోకములు కానవస్తాయి.ఊర్థ్వలోకములను,అధోలోకములను ఉద్ధరించేందుకని అంతటి సన్నని నడుము కలిగి ఉంది కాబట్టి ఆ తల్లిని సమున్నేయ మధ్యమా అని వాగ్దేవతలు కొనియాడారు.

Sunday, 29 March 2026

నాభ్యాలవాల రోమాళి లతా ఫల కుచద్వయీ

నాభ్యాలవాల రోమాళి లతా ఫల కుచద్వయీ అను దివ్యనామము శ్రీలలితా సహస్రనామావళిలోని ముప్పై నాల్గవ నామము.రవి కాంచని చోటు కవి కాన్చును అని అంటారు కదా!ఆ మాటలకు ఉదాహరణ ఈ నామము.అమ్మవారి నాభి ఒక పాదు లాంటిది.నాభి నుంచి ఊర్ధ్వ ముఖంగా పాకిన నూనూగు తీగలాగ ఉందట సన్నని వెంట్రుకల సముదాయము.ఆ నూగారు తీగ కొనలకు పండిన ఫలాలలాగా ఉన్నాయట ఆమె స్తనద్వయం.ఇంత శోభతో అలరారుతున్నది ఆ తల్లి. ఇక్కడ నాభి అనేది మణిపూర చక్రము.అయితే స్తన మధ్య భాగము అనాహత చక్రము అవుతుంది.అప్పుడు ఇడా,పింగళ నాడులను ఆ తల్లి స్తనములుగా భావించాలి.అప్పుడు బొఢ్డు నుండి వక్ష స్థలము వరకు ఊర్థ్వ ముఖంలో ఉండే సన్నని రోమాళిని సుషుమ్నా నాడిగా భావించాలి.వశిన్యాది దేవతల వర్ణనలో ఎంత అర్థమూ,పరమార్థమూ ఉన్నాయి కదా! ఇంతేనా!నాభిని పాదుతో పోల్చడం ఆలవాలత్వము.ఒక విత్తు మొలక కావాలంటే కావాలసిన నీరు,సత్తువను ఇవ్వగల పాదు ఆలవాలత్వము అంటే.రోమాళియందు లతాత్వము సమన్వయింపబడింది.కుచముల యందు ఫలత్వము అన్వయింపబడింది.ఎంత హృద్యంగా,రమణీయంగా ఉంది కదా పోలిక.బిడ్డ పుట్టగానే బొడ్డు కోస్తారు.దానితో తల్లీ బిడ్జ భౌతికంగా వేరవుతారు తప్ప మానసికంగా,ప్రేమపరంగా కాదు. ఇంకో విశేషము.శివుడు కోపంతో మన్మథుడిని భస్మం చేసాడు కదా!అప్పుడు ఆయన తాపం తగ్గించుకునేదానికి అమ్మవారి నాభి అనే సరస్సులోకి దూకాడట! శంకరాచార్యులవారు అమ్మను కీర్తించడంలో అసలు అలసిపోరు.తల్లి నాభి నిశ్చలమయిన గంగా ప్రవాహం లాంటిది అట.నీ నాభి స్తనములు అనే పూల మొగ్గలకు ఆథారమయిన రోమరాజి అనే తీగెకు పాదులాంటిది.అది మన్మథుని పరాక్రమాగ్నికి హోమగుండము.రతీదేవికి విహారగృహము.ఈశ్వరుని కనుల సిద్థికి గుహాముఖము అయి విరాజిల్లుతున్నది. అమ్మవారిని ఇంత బాగా వర్ణించడం వారికే చెల్లు.

Friday, 27 March 2026

కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణ స్తనీ

కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణ స్తనీ అనే ఆధ్యాత్మకమయిన నామము శ్రీలలితా సహస్ర నామావళిలోని ముప్పై మూడవ నామము.ఈ నామము వాగ్దేవతలు చాలా ఆలోచించి పెట్టినట్లున్నారు. అమ్మవారు కామేశ్వరుని భౌతికాతీతమయిన ప్రేమరత్నం కోసం చాలా తపించింది.అందుకని తన భౌతికపరమయిన స్తనరత్నములును పణముగా కామేశ్వరుడికి అర్పించుకున్నది.ఇదే ఇచ్చి పుచ్చుకోవడం అంటే.మనకు నచ్చిన,ఇష్టమయిన దానికోసం మనలను మనము సమర్పించుకోవటం ఆ ప్రేమకు పరాకాష్ట కదా!అందుకనే వారిని ఆది దంపతులు అని అంటారు. ముచ్చటగా అర్థ నారీశ్వర విగ్రహం అని అంటారు. నిర్గుణ పరబ్రహ్మ యొక్క కర్మ స్వరూపం శ్రీ మహా విష్ణువు అయితే జ్ఞాన స్వరూపము పరమేశ్వరుడు.అందుకే లౌకికమయిన పురోగతికి శ్రీ మహా విష్ణువును ఆరాథించాలి.ఆధ్యాత్మిక పురోగతికి,సచ్చిదానందమయిన కైవల్యం కోసరము శివస్వరూపాన్ని ఆరాధించాలి. భౌతికాతీతమయిన పరమేశ్వరుని ప్రేమ ఎంత ఉన్నత మయినది కదా!అది పొందాలనే భౌతికమయిన తన స్తన ద్వయాన్ని అయ్యవారికి అమ్మవారు సమర్పించి,తరించింది.ఈ కార్యం పాతివ్రత్యానికీ,ఏక పత్నీవ్రతానికి ప్రతీక మరియు మచ్చు తునక. యోగం శివుడిని సకల దుఃఖ హరుడైన రుద్రుడిగా వర్ణిస్తుంది.మనము దుఃఖం పోవడానికి ఓం నమో భగవతే రుద్రాయ అని జపించాలి.విషపూరిత జీవుల నుండి రక్షణకు ఓం నమో భగవతే నీలకంఠాయ అని నామజపం చేయాలి.

Wednesday, 25 March 2026

రత్న గ్రైవేయ చింతాక లోల ముక్తా ఫలాన్వితా

రత్న గ్రైవేయ చింతాక లోల ముక్తా ఫలాన్వితా అను మనోహర నామము శ్రీలలితా సహస్ర నామావళిలో అమ్మవారికి పెట్టబడిన శుభనామము.రత్నహారములు,ప్రకాశవంతంగా మెరిసే మంచి ముత్యాల సరములు,కాంతులీనే చింతాకు పతకముల వంటి కంఠాభరణములతో ఆ తల్లి ఒప్పారుతున్నది. వశిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని ఇలా వర్ణించారు.అమ్మ తన మెడలో వేసుకున్న మంచి ముత్యాల హారము మెడ నుండి గుండెలదాకా రత్నాల పేటల హారములకు క్రింద వేలాడే లోలాకులతో కూడి ఉన్న ముత్యాలతో కూడిన చింతాకు పతకం వ్రేలాడుతున్నది. శంకరాచార్యులవారు ఈ విషయం అస్సలు ఒప్పుకోవటం లేదు.ఆయనకు స్త్రీల సౌందర్యాభరణాల పైన ఎక్కువ పట్టు ఉన్నట్లుంది.ఆయన ఇలా అంటున్నాడు.ఎక్కడైనా స్త్రీలు ముత్యాల పతకం ఉన్నప్పుడు ముత్యాల సరాలు ఉంటాయి కానీ ఎక్కడైనా రత్నాల పేటలు ఉంటాయా?ఊహూ!ఉండనే ఉండవు.ఆమె వేసుకుంది ముత్యాల పేటల హారాలే!కానీ ఎందుకు అవి ఎర్రగా మెరుస్తున్నాయో శంకరాచార్యుల వారు కనిపెట్టేసారు.ఆ తల్లి పెదాలు తాంబూల చర్వణానంతరం ఎర్రగా కాంతులీనుతున్నాయి కదా!ఆ ఎర్రని జిలుగులు అమ్మవారు ధరించిన ముత్యాల సరాల పైన బడి ఎర్రగా మెరిసిపోతున్నాయట! ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉంది.అమ్మవారు ధరించిన మేలి ముత్యాలు గజకుంభం నుంచి పుట్టినవి.మామూలుగా ముత్యాలు ముత్యపు చిప్పలలోనే కాకుండా ఇంకా అయిదు చోట్ల లభిస్తాయి.అవి గజకుంభేషు,వంశేషు,ఫణేషు,జలదేమచ,శుక్తికాయా,మిక్షుదండే,షోడా మౌక్తిక సంభవా. అంటే ఏనుగు కుంభ స్థలము నందు వివిధ వర్ణాల ముత్యాలు దొరుకుతాయి.వెదురు బొంగులో తెలుపుతో కూడిన ఎఱుపు రంగు (పాటల వర్ణము)ముత్యాలు,సర్పముల పడగల యందు నీల వర్ణములు,మేఘముల యందు మెరుపు వర్ణము కలవి,ముత్యపు చిప్పల యందు శ్వేత వర్ణము కలవి,చెరకు గడల యందు పసుపు వర్ణము కలవి సంభవిస్తాయి. అమ్మ గుండెల పైన వ్రేలాడేది చింతాకు పతకం కాదట అసలు!భగవంతుని గూర్చి చింత కలిగిన వారు చింతాకులు అంట.వారిలో మూడు రకాలు ఉన్నారు.గ్రైవేయ చింతాకులు తమ కంఠంతో అమ్మను ధ్యానిస్తారు.లోల చింతాకులు కోరికతో అమ్మను కొలుస్తారు.ముక్త చింతాకులు ముక్తి కోరుకుంటూ అమ్మను కొలుస్తారు.ఆమె ధరించే చింతాకు పతకం ఈ భక్తులకు ప్రతీక అట!అంటే ఏ రకంగా కొలిచినా భక్తులను అమ్మవారు తన గుండెల్లో పెట్టుకుని కాపాడు కుంటుంది అని అర్థము.

Monday, 23 March 2026

కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితా

కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితా అను సుందర నామము శ్రీ లలితా సహస్ర నామావళిలో అమ్మవారికి పెట్టబడిన ముప్పై ఒకటవ నామము. కేయూరములు అంటే దండ కడియములు లేదా దండ వంకీలు అని అర్థము.అమ్మవారు రత్న,వజ్ర,మాణిక్య ఖచిత బంగారు ఆభరణాలను తన భుజములకు అలంకరించుకున్నది.అసలే ఆమె అతిలోక సుందరి.ఆమెకు సరిసాటి ఇంకెవ్వరూ లేరు ముల్లోకాలలో.దానికితోడు వజ్ర,వైఢూర్య,మణి,మాణిక్యాలతో పొదగబడిన కనకపు ఆభరణాలను తన బాహువులకు అలంకారంగా ధరించి ముగ్ధమోహనంగా వెలిగిపోతున్నది.ఆమెకు బాహువులు అనంత కోటి కిరణాలు.ఆ కిరణాల సమ్మేళనమే ప్రకాశమై భుజకీర్తులు అనబడుతున్నాయి.

Wednesday, 11 March 2026

కామేశ బద్ధ మాంగల్య సూత్రశోభిత కంధరా

కామేశ బద్ధ మాంగల్ల సూత్రశోభిత కంధరా అనే పవిత్రమయిన నామము శ్రీలలితా సహస్ర నామావళిలోని ముప్పయవ నామము. పరమశివుడు కట్టిన మంగళసూత్రము అమ్మవారి కంఠసీమను అలంకరించి యున్నది.ఆమె గళసీమలో ఆ మంగళసూత్రము శోభాయమానంగా,కన్నులపండువగా ఉంది.దేవతలు పార్వతిని,పరమేశ్వరుడిని కలపమని మన్మథుడిని పంపిస్తారు. శివుడి తపస్సు భంగం అయిందనే కోపంతో మన్మథుడిని భస్మం చేసాడు.పార్వతి శివుడి కోసం భీకరమయిన తపస్సు చేసింది.పర్ణాలు అనగా రాలిన ఆకులు మటుకు తిని తపస్సు చేసింది.తరువాత అవి కూడా తినడం ఆపేసింది.అందుకని ఆమెకు అపర్ణ అనే పేరు వచ్చింది.పార్వతి తపస్సు మెచ్చి పరమేశ్వరుడు బ్రహ్మచారి రూపంలో వచ్చి,పార్వతిని పెళ్ళి చేసుకుంటాడు.సంసారానికి మూలం మన్మథుడు కాబట్టి పార్వతి మన్మథుడిని మళ్ళీ బ్రతికించినట్లయింది.కామేశుడు తన మెడలో కట్టిన మంగళసూత్రము చేత ఆ కంఠము ప్రకాశిస్తూ,వెలిగిపోతుంది.అందుకనే వశిన్యాది వాగ్దేవతలు ఆమెను ప్రేమగా,మురిపెంగా కామేశ బద్ధ మాంగల్య సూత్రశోభిత కంధరా అని పిలుచుకున్నారు.ఆమెకు తన మంగళసూత్రము పైన ఎంత నమ్మకం అంటే శివుడు లోక కళ్యాణం కోసరము విషం త్రాగుతానంటే వెనక్కి లాగలేదు.సరే అని ప్రోత్సహించింది.

Saturday, 7 March 2026

అనాకలిత సాదృశ్య చుబకశ్రీ విరాజితా

అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితా అను అసమాన నామధేయము శ్రీ లలితా సహస్ర నామావళిలో అమ్మవారికి ఇవ్వబడిన ఇరవై తొమ్మిదవ నామము.ఇది ఇంత,కాదు అంత,కాదు కాదు ఎంతెంతో అందమయిన అని వివరించి చెప్పలేనటు వంటి చుబుకము కలదు ఆ తల్లికి.వశిన్యాది వాగ్దేవతలు కూడా ఆమె చుబుకాన్ని దేనితో పోల్చలేకపోయారు.అంతటి చుబుక సౌందర్యంతో అమ్మ అలరారుతున్నది.ఆ తల్లి బాల్యంలో హిమవంతుడు ముద్దుగా వాత్సల్యంతో ఆమె చుబుకాన్ని పుణికాడు. ఇంక శంకరాచార్యులవారు అయితే ఇలా వర్ణించారు.తల్లీ!నీ చిన్నతనంలో నీ తండ్రి ముద్దులు మూటగట్టేలా ఉన్న ముఖారవిందాన్ని ముద్దులాడేదానికి నీ చుబుకం పట్టుకుని బ్రతిమలాడేవాడట!ఇంక అర్థనారీశ్వరుడు దగ్గరకు వస్తాము.వారిరువురూ ఏకాంతంలో ఉన్నప్పుడు నీవు సిగ్గుల మొగ్గవు అయి తల దించుకునినావు.నీ అధరామృతం కోసము శివుడు వజ్రాలపిడిలాంటి నీ చుబుకము పట్టుకుని అద్దంలాంటి నీ మోములో తననుతాను చూసుకుని మురిసిపోయాడట!

Friday, 6 March 2026

మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసా

మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసా అను అత్యంత అద్భుత నామము శ్రీ లలితా సహస్రనామావళిలో అమ్మవారికి ఇవ్వబడిన ఇరవై ఎనిమిదవ నామము. ఈ నామము లోని భావము చాలా లోతయినది.అమ్మవారి చిరునవ్వు అవధులు లేని కాంతి ప్రవాహములా గోచరిస్తున్నది.ఆ ప్రవాహములో కామేశ్వరుడు లయమయిపోయి,మునిగి తేలుతున్నాడు.అయ్యవారి మనసును కొంగుకు ముడి వేసుకున్నట్లు ఉంది.అంటే లయకారుడు అమ్మవారి చిరునవ్వుల ఊటలో లయమయిపోతున్నాడు.ఆ పరమేశ్వరుడి మనసును గెలుచుకుని,సతతం తనతోనే,తనలోనే ఉంచుకుంది ఆ కామేశ్వరి.మామూలుగానే ఆమె అందం అట్లాంటిట్లాంటిది కాదు.అలాంటి జగన్మోహిని మందస్మిత అయి అయ్యవారిని ఓరకంట చూస్తే,ఇంకేముంది.హృదయార్పణం జరిగి తీరాల్సిందే! ఈ విషయంగా శంకరాచార్యులవారు ఇలా అంటున్నారు.చకోర పక్షులు జగన్మాత చిరునగవులు అనే వెన్నెలలను గ్రోలుతున్నాయట.అతి మథురం అయ్యేటప్పటికి విరుగుడుగా అమృతమును పుల్లటి కడుగు నీళ్ళులాగా భావించి త్రాగుతున్నాయట!అంటే అమ్మ చిరునవ్వు అమృతము కంటే అత్యంత మథురనయినది,తీయనైనది.దానికి సాటి ఇంకేమీ లేదు ముల్లోకాలలో!ఆ అతి తీపితో మొహం మొత్తి రుచి మార్పు కోసం చంద్రుని వెన్నెల గ్రోలుతున్నాయి.అంతే!

Wednesday, 4 March 2026

నిజసల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపి

నిజసల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపి అను మృదు మథురమయిన నామము శ్రీలలితా సహస్ర నామావళిలో అమ్మవారికి ఇవ్వబడిన ఇరవై ఏడవ నామము. సంగీత సాహిత్యములకు అధినేత్రి సరస్వతీ దేవి.ఆమె వీణ పేరు కచ్ఛపి.అటువంటి వీణా మాథుర్యమును కూడా ధిక్కరించ గలిగేలా అమ్మ సంభాషణ ఉంది.ఈమె మాటల సొబగు,సౌందర్యము,మధురము అద్వితీయము.ఇక దేనితోనూ పోల్చలేము.కచ్ఛపీ వీణలో ఏడు తంత్రులు ఉంటాయి.ఈ వీణకు ఇరవై నాలుగు మెట్లు ఉంటాయి.దాని వలన స్వర స్థానములు ఎక్కువ పలికి స్పష్టత చాలా బాగుంటుంది. వశినీ,కామేశ్వరీ,మోదిని,విమల,అరుణ,జయిని,సర్వేశ్వరి,కౌళిని...।వీరిని వశిన్యాది వాగ్దేవతలు అని అంటారు. శంకరాచార్యులవారు ఇంకా బాగా వర్ణించారు అమ్మ పలుకు ని.ఒకసారి సరస్వతీ దేవి దేవతల కొలువులో శివుడిని స్తుతిస్తూ గానం,వీణానాదం చేస్తూ ఉందట.అమ్మవారు తన్మయత్వంతో తల ఆడించిందట.అది సరస్వతి గమనించింది.మామూలుగా పాడితేనే ఇలా ఊగి పోతున్నారు.నిజంగా నా తడాకా చూపించి అత్యద్భుతంగా పాడాలి అని తీర్మానించుకుని పాడడం మొదలు పెట్టింది.అది విని అమ్మవారు సాధు సాధు అని అనింది.అంటే బాగుంది ,బాగుంది అని అర్థము.ఆ రెండు పలుకులు ఎంత తీయగా,ఎంత శ్రావ్యంగా,ఎంత మధురిమలు ఒలికాయంటే ఈమె పలుకుల ముందు సరస్వతీ దేవి పాట తేలిపోయింది.ఆమె మౌనంగా తన వీణను కొంగు చాటున దాచుకుందట.అమ్మ పలుకులు అంత తేనెలూరుతున్నాయి.

Tuesday, 3 March 2026

కర్పూరవీటికామోద సమాకర్ష ద్దిగంతరా

కర్పూరవీటికామోద సమాకర్ష ద్దిగంతరా అను అందమయిన నామము అమ్మవారికి శ్రీ లలితా సహస్ర నామావళిలో ఇరవై ఆరవ నామముగా చెప్పబడింది.అమ్మవారు కర్పూరాది సుగంథ చూర్ణ మిశ్రితమయిన తాంబూలాన్ని చర్వణము చేస్తుంటే,ఆ పరిమళములు దిగంతాల వరకూ వ్యాపిస్తున్నాయట! ఆమె తాంబూలము సేవించిందంటే ఎలా ఉండాలి?లేలేత తమలపాకుకు సున్నం రాసి,కవిరి పొడి లేక కాచు పొడి(నల్ల తుమ్మ చెట్టు బెరడు పొడి),పచ్చి పోక,వక్కపొడి,పచ్చ కర్పూరము,యాలకులు,లవంగాలు,చలువ మిరియాలు,నాగకేసరములు,జాజికాయ,జాపత్రి,కుంకుమ పువ్వు,ఎండు కొబ్బరి,పొదీనా పువ్వు తగు పాళ్ళలో వేసిన మిశ్రమము కలిపి వేసిన తాంబూలము ఘుమ ఘుమ లాడుతూ ఉండాలి.అలాంటి సుగంథ ద్రవ్యాల సమాహారంతో తయారు కాబడిన తాంబూలము నములుతుంటే అమ్మవారి నోటినుంచి సుగంథాలు దశదిశలా వ్యాపిస్తున్నాయి.దిగంతాలవరకూ వెళుతున్నాయి.అమ్మవారి నోరు ఎర్రగా పండింది.అమ్మ తాంబూల చర్వణము చేస్తుంటే దేవతలు అందరూ తాంబూల కబళము కోసము ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట.దానినే ప్రసాదంగా స్వీకరించేదానికి ఉబలాటపడుతున్నారట.ఆ పరిమాళానికి ఆకర్షించబడి తుమ్మెదలు మకరందము కోసరము ఝంకారములు చేసుకుంటూ వచ్చి,ఆమె కురులలో ఉండే పుష్ప సంపదపైన వాలాయట.భక్తులు కూడా ఆమె కృపా కటాక్షములకొరకు ఆమెను చుట్టుముట్టుతున్నారు. శంకరాచార్యులవారు ఆమె తాంబూల చర్వణంపై ఇలా చెప్పారు.ఒకసారి శివుడి ఆన మేర కుమారస్వామి,ఇంద్రుడు,విష్ణువు రాక్షసులపైకి యుద్ధానికి వెళ్ళి గెలిచి వచ్చారు.శివుడు కానుకలు ఇవ్వబోతే కాదన్నారు.లోపల తూగుటుయ్యాల పైన చిన్నగా ఊగుతూ తాంబూల చర్వణం చేస్తున్న అమ్మవారి దగ్గరకు వచ్చారు.కన్నతల్లి బిడ్డలను చూస్తే అనుకోకుండా నవ్వుతుంది కదా!అలా వారిని చూసి నవ్వింది.అప్పుడు నోటిలో తాంబూలం కబళములు క్రింద పడ్డాయి.వాటిని చూచి వారు ముగ్గురూ ఆబగా తీసుకుని తిన్నారు.అమ్మ ఎంగిలి బిడ్డలకు అమృతతుల్యం కదా!దేవతలకే ఆమె మాతృమూర్తి.అలాంటిది మనమంతా కూడా ఆమె సంతతి కాకుండా పోతామా?ఆమె మనలను కాపాడకుండా చిన్న చూపు చూస్తుందా?ఎప్పటికీ కాదు.ఆమె చల్లని చూపులు మనలను ఎప్పుడూ నిమురుతూ ఉంటాయి.

Monday, 2 March 2026

శుద్థ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వలా

శుద్దవిద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వలా అను పవిత్ర నామము శ్రీ లలితా సహస్ర నామావళిలోని ఇరవై అయిదవ నామము.ఈ నామానికి చాలా అర్థమూ,పరమార్థమూ ఉంది. శ్రీవిద్య అనగా శుద్ధ విద్య యందు పదహారు వర్ణ రూపాలు,అదే బీజాక్షరములు ఉన్నాయి.ఆ తల్లి పలువరస ఆ బీజాక్షరాల జంట పంక్తులు లాగా మెరసి పోతున్నాయి.శుద్ధ విద్య అనగా జ్ఞాన విద్య.అమ్మవారు శుద్ధ విద్యాంకుర స్వరూపులగు బ్రాహ్మణులు,అదే ద్విజులు,అను పలువరసలతో ప్రకాశిస్తున్నదని వశిన్యాది వాగ్దేవతలు వర్ణిస్తున్నారు.షోడశకళా ప్రపూర్ణురాలు కాబట్టి షోడశి అను నామము సార్థకమయినది.షోడసీ మంత్రమునకు పదహారు బీజాక్షరములు ఉన్నాయి.అవి క ఏ ఈ ల హ్రీం హ స క హ ల హ్రీం స క ల హ్రీం శ్రీం.వీటిని వశిన్యది వాగ్దేవతలు శుద్థ విద్యాంకురములు అని అన్నారు.అ నుండి అః వరకు ఉండే అచ్చులు శక్తి స్వరూపాలు.క నుండి క్ష వరకు ఉండే హల్లులు శివ స్వరూపాలు.అచ్చులూ హల్లులూ కలిస్తేనే అక్షర,పద నిర్మాణం అవుతుంది.ఇవి అన్నీ కలసి ముప్పై రెండు అవుతాయి.అదే ఆమె పలువరస. మంత్రము ఉచ్ఛారణ శబ్దము అవుతుంది.ఆ శబ్దము,ఆ వాక్కుకు స్పష్టత చేకూరేదానికి నాలుగు వాక్స్వరూపములు ఉన్నాయి.అవి పరా,పశ్యంతి,మధ్యమ మరియు వైఖరి. మనము ఒక కార్యము చెయ్యాలి అనుకుంటే ఆ తలపు వచ్చేదానికి ముందు స్థితి పరా అంటారు.ఆ తలపును పశ్యంతీ వాక్కు అని అంటారు.ఆలోచన కార్య రూపము థరించే ముందు ఉండే ఊహా స్థితిని మథ్యమ వాక్కు అని అంటారు.తలపు కార్య రూపం ధరించడం వైఖరీ వాక్కు అని అంటారు.బ్రహ్మ రంథ్రంలో పుట్టి మూలాథారంలో గాలి బుడగగా మారి,విశుద్థి చక్రంలోని అచ్చులతో చేరి,వాక్కుకు స్పష్టత ఏర్పడి శబ్దంగా బయటకు వస్తుంది. బ్రాహ్మణుడికి ఉపనయనం ముందర ఒక జన్మ,ఉపనయనం అయిన తరువాత ఇంకో జన్మగా పాటిస్తారు.కాబట్టి అతనికి ద్విజుడు అనే నామము సార్థకమయినది.అతను తను సంపాదించిన జ్ఞానాన్ని శిష్య పరంపరకు ఉపదేశిస్తాడు,థారపోస్తాడు.కాబట్టి ద్విజులు విద్యాంకుర స్వరూపులు అని వాడుకలో ఉంది.ఆమె పలువరసే బీజాక్షరాలమయం కాబట్టి ఆ తల్లి జ్ఞాన స్వరూపిణి అయింది.

Sunday, 1 March 2026

నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్ఛదా

నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్ఛదా అను రమణీయమయిన నామము శ్రీలలితా సహస్ర నామావళిలో అమ్మవారికి చెప్పబడిన ఇరవై నాల్గవ దివ్యనామము. అమ్మవారి పెదవులు అప్పుడే సానబట్టిన క్రొత్త ఎర్రని పగడముల రంగును,బాగా పండిన దొండపండ్ల ఎఱుపు రంగును ధిక్కరించేటంతటి అరుణ వర్ణంలో శోభిల్లుతున్నాయి. అసలు దీని ముందర విషయం తెలుసుకుందాము. మహిషాసురుడుని చంపడం దేవతలకు సాథ్యపడలేదు.అప్పుడు విష్ణువు వాళ్ళందరికీ ఒక మార్గం చెప్పాడు.ప్రతి ఒక్కరూ వారి వారి తేజాన్నీ, శక్తినీ,వారి అంశతో ఒక దేహ భాగాన్ని ఇచ్చి ఒక స్త్రీని సృష్టించాలి.అప్పుడు బ్రహ్మాది దేవతల శరీరముల నుండి అద్భుత తేజస్సు బయటకు వచ్చింది.ఆ తేజస్సు ఒక మహత్తరమయిన స్త్రీ మూర్తిగా రూపు దిద్దుకుంది.ఆమెయే శ్రీలలితా త్రిపుర సుందరీ దేవి.ఆ తల్లికి వివిథ దేవతల అంశల నుండి అంగ సంపద లభించింది. అమ్మవారికి సూర్యుని యొక్క తేజస్సుతో మిగుల లాలిత్యము,మృదుత్వము,కోమలత్వములతో కూడిన అథరోష్టము ఆవిర్భవించింది.అధరోష్టము అంటే క్రింది పెదవి.పై పెదవి కార్తికేయుని తేజస్సుతో ప్రకటితమయినది.అమ్మవారి క్రింది పెదవి బింబము,అనగా పండిన దొండపండు లాగా ఉంది.ఆ తల్లి పై పెదవి సాన బట్టిన విద్రుమము లాగా ఎర్రగా ఉంది.విద్రుమము అంటే పగడము అని అర్థము.ఇక్కడ ఇంకో చమత్కారము ఉంది.పగడము గట్టిగా ఉంటుంది కదా!మరి అమ్మ పెదవులు మృదువుగా లేత తమలపాకుల లాగా నవ నవలాడు తున్నాయి కదా!దొండపండు రెండు మూడు రోజులలో మాగి,మగ్గి పోతుంది కదా!అందుకనే వ జత శిన్యాది వాగ్దేవతలు అమ్మవారి పెదవులు క్రొత్తగా సానబెట్టిన పగడాలనూ,దొండపండు ఎరుపులనూ ధిక్కరిస్తున్నాయి అని మనకు చెబుతున్నారు. శంకరాచార్యులవారు అయితే అమ్మవారి అందము నిరుపమానమయినది అని నొక్కి వక్కాణిస్తున్నాడు.అమ్మవారి పెదవులు దొండ పండు లాగా ఉంటాయి అని వాటికి బింబము అని పేరు వచ్చిందట.రదన అంటే పెదవులు.చక్కని పలువరసను తెరలాగా కప్పుతున్నాయి ఆ దొండ పండు,పగడపు ఎర్రదనాన్ని ధిక్కరించే ఆ లేలేత కోమలమయిన పెదవులు.

Friday, 27 February 2026

పద్మరాగ శిలాదర్శపరిభావి కపోలభూః

పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూః అను అత్యంత రమణీయమయిన నామము శ్రీ లలితా సహస్ర నామావళిలో అమ్మకు పెట్టబడిన ఇరవై మూడవ నామము. అమ్మ మృదు మోము రాగరంజితము.ఆమె చెక్కిళ్ళు పద్మరాగమణులతో తయారు చేయబడ్డ అద్దాన్ని కూడా త్రోసి రాజంటున్నాయట.అంటే అంత నున్నగా,లేలేతగా నిర్మలంగా కెంపు రంగుతో మిరుమిట్లుగొలుపుతున్నాయి. పద్మరాగమణులు పండు దానిమ్మగింజలంత ఎర్రగా ఉంటాయి.ఎరుపు రంగు ప్రేమకు,అనురాగానికి చిహ్నము.పద్మరాగమణులకు సహజ సిద్థంగానే కాంతులు ఎక్కువ.అంతకంటే అంటే ఇంకెంత కాంతిమంతంగా ఉందో కదా ఆ తల్లి ముఖారవిందము.వీటన్నిటికీ తోడు అమ్మ నిత్య యౌవన సంపన్నురాలు.ఇంక ఆమె మృదు మథుర సోయగం గురించి వశిన్యాది వాగ్దేవతలు ఎంత వర్ణించినా తక్కువే సుమా! ఆది శంకరాచర్యులు ఆ తల్లిని వర్ణించడంలో ఇంకో నాలుగు ఆకులు ఎక్కువే చదివారు.ఆ తల్లి కపోలములు ఎంత నున్నగా,మృదువుగా,నిర్మలంగా,అద్దంలాగా మెరిసి పోతున్నాయంటే ఆమె చెవి తాటంకములు ఆమె బుగ్గల పైన ప్రతిబింబిస్తున్నాయట!ఎంత హృద్యమయిన వర్ణన కదా!అంతేనా?కాదు కాదు.ఆమె ముఖము తాటంకములు,వాటిబింబాలతో కలసి నాలుగు చక్రాలతో కూడుకున్న మన్మథుని రథంలాగా కానవస్తుందట.మన్మథుడు ఆతల్లి ముఖారవిందాన్ని ఆశ్రయిస్తే శంకరుడు ఎక్కడ తప్పించుకుంటాడు అమ్మ వలపులనుండి,సరాగాల నుంచీ?మన్మథుడు ఎంత తెలివి కలవాడు కదా!శంకరుడు మన్మథుడిని ఆకారం లేకుండా బూడిద చేసాడు.ఈయనేమో అమ్మ ముఖారవిందం ఆసరాగా చెరుకుగడ వింటితో శరసంథానం చేస్తున్నాడు.అమ్మ కనుబొమలు మన్మథుడి వింటిని ప్రతిబింబిస్తున్నాయి కదా!

Thursday, 26 February 2026

తాటంక యుగళీభూత తపనోడుప మండలా

తాటంక యుగళీభూత తపనోడుప మండలా అను అందమయిన నామము శ్రీలలితా సహస్ర నామావళిలోని ఇరవై రెండవ అమ్మవారి నామము. అంటే అమ్మవారు తన చెవి తమ్మెలకు సూర్య చంద్ర మండలాలను తగిలించుకుని దేదీప్యమానంగా వెలిగి పోతూ ఉంది.నవగ్రహాలలో సూర్యుడు,చంద్రుడిని మించిన వాళ్ళు లేరు.అలాంటి సూర్య చంద్ర మండలాలను తన చెవి కమ్మలుగా ధరించినది అంటే ఆమె అసమాన్యమయినది అని కదా అర్థము.అలాంటి అమ్మవారిని ఆశ్రయించి ఉన్నామంటే మనకు ఎలాంటి గ్రహ పరమైన అవాంతరాలు,ఆటంకాలు మన దరికి రావు.ఆమె ధరించిన తాటంకములే అనంతాలు అయినపుడు,ఆమె ఇంక ఎంత మహిమాన్వితురాలు అయి ఉండాలి?అది మనం ఊహించలేనిది. మనము ప్రయత్న పూర్వకంగా మంత్రము చెప్పడం జపము అని అంటారు.అదే అప్రయత్నంగా అదే ప్రక్రియ జరిగితే?దానిని అజపా అని అంటారు.ఇది సహజమయిన ఉచ్ఛ్వాస నిశ్శ్వాసలచే జరుపబడే హంస స్సోహం అనే అప్రయత్న జపము.దీనినే అజపా గాయత్రీ,హంస గాయత్రీ అని కూడా అంటారు.గాయంతం త్రాయతే అంటే జపము చేయివానిని రక్షించునది అని అర్థము.హంస అను శబ్దము ప్రాణ శక్తికి సంకేతము.కాబట్టి మానవులలో సహజంగా,ప్రకృతి సిద్ధంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్శ్వాసలను ప్రాణ గాయత్రీ అని అంటారు.శబ్ద గ్రాహ్యమునకు సంబంథించిన అమ్మవారి చెవులకు ఆభరణాలుగా సూర్య చంద్ర మండలాలను చెప్పడం వశిన్యాది వాగ్దేవతల చతురతకు తార్కాణం! శంకరాచార్యులవారు అయితే ఆమె కణతల దగ్గర చెవులు వంపు తిరిగి ఉండడం మన్మథుని ధనుస్సును గుర్తుకు తెస్తున్నాయి అని చమత్కరిస్తున్నారు.

Wednesday, 25 February 2026

కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరా

కదంబ మంజరీక్లుప్త కర్ణపూర మనోహరా అను అమ్మవారి నామము శ్రీలలితా సహస్ర నామావళిలోని అత్యద్భుతమయిన ఇరవై ఒకటవ నామము. అంటే అమ్మవారు కదంబ కుసుమాల గుత్తిని చెవుల పైభాగంలో ఒత్తుగా ధరించి మనోహరంగా, ధగధగలాడుతున్నది అని అర్థము రావి,తులసి,కదంబము,మారేడు,పారిజాతములను దేవతా వృక్షాలు అని అంటారు.ఇవి లక్ష్మీ ప్రదమయినవి.అన్నిటికంటే కదంబ కుసుమాలు అమ్మకు ప్రియమయినవి.కదంబ వృక్షము చెంత ఉండడం కూడా ఆమెకు ఇష్టం.అందుకే ఆమెను తరచూ కదంబ వన వాసినీ,కదంబ కుసుమ ప్రియా అని కూడా పొగుడుతుంటాము. అమ్మవారి చెవులు విశాలముగా,సుదీర్ఘంగా,పూలగుత్తులు మోయగలిగేటంత ధృఢంగా ఉన్నాయి.ఆమె కర్ణములు శ్రీకారముల వలెను,శ్రీకరములుగానూ ఉన్నాయి.అమ్మవారి కుడి చెవిని ఉ కారంతోనూ,ఎడమ చెవిని ఊ కారంతోనూ న్యాసం చేయవలెను.న్యాసము అంటే జప తపాలు చేసేటప్పుడు ఆయా అవయవాల వద్ద మంత్రాక్షరాలను ఉంచడం అని విశేషార్థము.

Tuesday, 24 February 2026

తారాకాంతి తిరస్కారీ నాసాభరణ భాసురా

తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా అను దివ్య నామము అమ్మవారి శ్రీ లలితా సహస్ర నామావళిలోని ఇరవయ్యో నామము. అమ్మ మోము ఎంత చూసినా తనివి తీరదు.ఆమె తన ముక్కుకు ధరించే ఆభరణము నక్షత్ర కాంతిని కూడా త్రోసి రాజంటున్నది.అమ్మవారి ముఖసౌందర్యం వర్ణించడంలో వశిన్యాది వాగ్దేవతలు తరించిపోయారు.వాళ్ళు కైవల్యం అందులోనే చూసుకున్నారు. అమ్మవారి కుడి ముక్కుకు ఎఱుపు,తెలుపుల మిశ్రమ వర్ణం గల పగడపు ముక్కు పుడక ధరించి ఉంది.ఎడమ ముక్కుకు తెలుపు రంగు గల వజ్రపు ముక్కెర ధరించి ఉన్నది.నాసాదండమున సౌభాగ్యానికి చిహ్నమయిన మంచి ముత్యపు అడ్డబాస ధరించి ఉంది.వాటి వెలుగులు శుక్ర గ్రహ,కుజ గ్రహ కాంతులను వెక్కిరిస్తున్నట్లు ఉంది.మంచి ముత్యపు బులాకీ సౌభాగ్యము సూచిస్తున్నది. ఎడమ ముక్కు రంధ్రములో ఇడా,కుడి ముక్కు రంధ్రములో పింగళ,నాసాదండము నందు సుషుమ్నా నాడి ఉన్నాయి. శంకరాచార్యుల వారు ఇలా వర్ణిస్తున్నారు.అమ్మవారి నాసాదండంలో ముత్యములు ఉన్నాయట.ఆమె శ్వాస వదిలేటప్పుడు బయటకు వచ్చి ముక్కు చివరన బులాకీలాగా వేలాడుతూ కనిపిస్తుందట!

Monday, 23 February 2026

నవ చంపక పుష్పాభ నాసాదండ విరాజితా

నవ చంపక పుష్పాభ నాసాదండ విరాజిత అనే అద్భుతమయిన నామము శ్రీ లలితా సహస్ర నామావళిలోని పంతొమ్మిదవ అమ్మ నామము. అమ్మ మనసులాగే అమ్మ మోము కూడా నవ నవలాడు తున్నది కదా!మరి అందులోని ఆ నాసిక అందము ఇంకేమని వర్ణించాలి? అదే!అప్పుడే విరిసిన నవనవలాడే సుమనోహరమయిన సంపెంగ వంటి నాసాదండము విరాజిల్లుతున్నది.సంపెంగ అంటే ఒట్టి చూపులకే పరిమితము కాదు.అది వెదజల్లే సౌరభాలు,సువాసనలు మనసును దోచుకుంటున్నాయి.ఆ భావనే ఎంత మృదుమథురంగా ఉందో కదా! అమ్మవారి ముఖము మన్మథుని వింటిలాంటి కనుబొమలు,కనులకు ధీటుగా సంపెంగ వంటి నాసికతో శోభాయమానముగా కానవస్తున్నది. తుమ్మెద తనపై వ్రాలలేదని సంపెంగ అలిగి ఘోర తపస్సు చేసింది అంట.భగవంతుని వరం పొంది ఆడదాని నాసిక అయి,అన్ని పూల సువాసనలను ఆఘ్రాణిస్తున్నదట.ఇది ముక్కు తిమ్మన మురిపం నాసిక గురించి. అమ్మవారి నాసిక కుబేరుని తేజముతో ఉత్పన్నమయింది అంట.విరిసీ విరియని సంపెంగలాగా విరాజమానంగా ఉన్నది.

Saturday, 21 February 2026

వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచనా

వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచనా అనే దివ్యమయిన నామము శ్రీలలితా సహస్ర నామావళిలో అమ్మవారికి చెప్పబడిన పద్దెనిమిదవ నామము. వక్త్రము అంటే ముఖము.అమ్మవారి ముఖము నుంచి వెలువడేకాంతి ఒక ప్రవాహము లాగా గోచరిస్తున్నది.ఆ కాంతి పుంజాల ప్రవాహములో సయ్యాటలు ఆడుకునే మీనాలలాగ ఉన్నాయి ఆమె కనుదోయి అని ఉటంకిస్తున్నారు. ఆ తల్లి అందానికి ఎంత వర్ణించినా తనివి తీరదు.ఆమె కనుబొమలు మన్మథుడి ధనుస్సు అయితే నల్లటి కాటుక కనులు వింటినారి అట. శ్రీమాత ఆవిర్భవము జరిగే సమయములో అగ్ని దేవుడి తేజస్సు చేత నేత్రములు ఏర్పడినాయి.కుడి నేత్రము ఇ కారము-అధిష్ఠాన దేవత ఇంద్రుడు.ఎడమ నేత్రము ఈ కారము...అధిష్ఠాన దేవత విరాట్ పురుషుడు. ఆ పరమేశ్వరి కుడికన్ను సూర్యని వలె వెలుగును ఇస్తుంది.ఎడమ కన్ను చంద్రుని వలె రాత్రిని ఇస్తుంది.ఫాలభాగములోని మూడవ నేత్రము ప్రాతః,సాయం సంధ్యాకాలములను ఏర్పరుస్తున్నది.

Thursday, 19 February 2026

వదనస్మరమాంగల్య గృహతోరణ చిల్లికా

వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా అను అమ్మవారి నామము శ్రీలలితా సహస్ర నామావళిలోని పదహేడవ నామము. ఎంత అందమయిన,అద్భుతమయిన వర్ణన అమ్మవారి గురించీ! ఆ పరమేశ్వరి వదనము మన్మథుని మంగళ గృహము లాగా ఉందట.అందులో ఆమె కనుబొమ్మలు గృహానికి అలంకరించే తోరణాలలాగా ప్రకాశవంతంగా విరాజిల్లుతున్నాయట! మన్మథుడు అంటేనే అందానికి మారు పేరు,ప్రతీక.అలాంటిది అతని గృహము ఇంకా ఎంత శోభాయమానంగా ఉంటుందో మనము ఊహించుకోవచ్చు.అలాంటి అత్యంత,అరుదైన అందానికి పెట్టి పుట్టిన గృహమునకు గల బాహ్యద్వారము ఇంకెంత శోభాయమానంగా ఉండాలి?అలాంటి ద్వారానికి తోరణాలు మకుటాయమానంగా ఉండాలి.ఉంటాయి కూడానూ!అంటే ఇక్కడ అమ్మవారి కనుబొమలు అందానికి అందం చేకూర్చేలా ఉన్నాయి. ఇదే విషయాన్ని శంకరాచార్యులవారు కూడా ముగ్థ మనోహరంగా వర్ణించారు.ఆ తల్లి కనుబొమల సౌందర్యం వర్ణించనలవి కావటం లేదంట!కొద్దిగా వంపు తిరిగిన కనబొమలు తుమ్మెదల అందం పుణికి పుచ్చుకున్నాయి అట.ధనుస్సు ఆకారంలో మన్మధుని విల్లులాగా కానవస్తుంది అట. చిల్లిక అంటే కనుబొమల మధ్య భాగము.ఆ కనుబొమల సంధి భాగములో కస్తూరీ తిలకము కళ్ళు ఆర్పేటందుకు వీలుకానంత శోభతో విరాజిల్లుతున్నది. అమ్మవారి వదనము పంచదశీ మంత్రంలోని వాగ్భవ కూటము.ఇందులో ఐం క్లీం సౌఃఅనే బీజాక్షరములు అమ్మవారి వదనము.శ్రీం హ్రీం అను బీజాక్షరాలు అమ్మవారి కనుబొమలు.అందుకే మంగళకరములు. మొత్తానికి ఆ తల్లి కనుబొమలు,నీలమణులలాంటి కనులు,కనుబొమల మధ్య ప్రదేశము అంతా ఎలా కనిపిస్తున్నాయంటే....మన్మథుడు ఎడమ చేత్తో ధనుస్సును పట్టుకున్నట్లు ఉంది.ఎంత అందమైన వర్ణన కదా!

Wednesday, 18 February 2026

ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకా

ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకా అనే అద్భుతమయిన నామము శ్రీలలితా సహస్ర నామావళి లోని అమ్మవారి పదహారవ నామము. అమ్మవారు నుదుటన కస్తూరీ తిలకము ధరిస్తుంది కదా!ఆమె ముఖారవిందము చంద్రునిలాగా ఉంది కదా!ఆ చంద్రునిలో ఉండే మచ్చలాగా ఆ కస్తూరీ తిలకము కానవస్తున్నది.అంతేకాదు,కస్తూరీ పరిమళము కూడా అద్దబడి ఉందట అమ్మవారి తిలకము. మగ కస్తూరి జింక యొక్క ఉదరము,పురుషాంగాల మధ్యన ఉండే ప్రత్యేక గ్రంధి నుంచి వెలువడే తీవ్రమయిన పరిమళ ద్రవ్యము ఈ కస్తూరీ పరిమళము. అమ్మవారి నుదుటన ఉన్న కస్తూరీ తిలకము జగన్మాత ముఖచంద్ర బింబమునకు శోభను ఇస్తున్నది.అంతే కాకుండా కస్తూరీ పరిమళమును కూడా వెదజల్లుతున్నది. దీనికి ధీటుగా శంకరాచార్యులవారు కూడా అమ్మవారిని వర్ణించారు. అమ్మవారి పాపట నడుమ సింధూరము ఉంది కదా!అది చీకట్లను చీల్చుకుంటూ బయట పడుతున్న ప్రభాత సూర్య బింబములాగా అలరారుతున్నది అట!ఎందుకంటే ఆమె వంకీలలాంటి పొడవాటి వేణీ సంపద కారుచీకట్లలాగా దర్శనమిస్తుంది అంట.ఆ పాపట చిన్న నీటిపాయలా,ఒక ఝరిలాగా కానవస్తుంది అంట.

Tuesday, 17 February 2026

అష్టమీచంద్ర విభ్రాజ దళికస్థల శోభితా

అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభితా అనే అమ్మవారి నామము శ్రీలలితా సహస్ర నామావళిలోని పదహైదవ నామము. అష్టమి తిథినాటి చంద్రునిలాగా ప్రకాశంతో దేదీప్యమానంగా వెలుగొందే లలాట ప్రదేశము కలది ఆ తల్లి అని అర్థము.లలితా అమ్మవారు కురువిందమణి శ్రేణులతో కూడిన కిరీటము ధరించి ఉంటుంది కదా!అందువలన వాటి వెలుగు జిలుగుల వలన అమ్మవారి ఫాలభాగము అష్టమినాటి చంద్రుడిలాగా శోభాయమానంగా ధగధ్థగలాడుతూ ఉంది. ఈ వర్ణనలో ఒక విశేషము ఉంది.శుక్ల పక్షంలో చంద్రకళలు వృద్ధి పొందుతూ అష్టమి నాటికి చంద్ర బింబము అర్థ చంద్రాకారం అవుతుంది.అలగే బహుళ పాఢ్యమి నుండి బహుళ అష్టమి వరకూ చంద్ర కళలు తగ్గుతూ అష్టమి నాటికి మళ్ళీ చంద్రుడు అర్థ చంద్రాకారం లోకి వస్తాడు.అంటే రెండు అష్టములలోనూ చంద్రుడు సమచంద్రుడుగా దర్శనమిస్తాడు. శుక్ల పక్షము,కృష్ణ పక్షములు రెండింటిలో నిత్య దేవత త్వరితా ఉంటుంది.దీనినే త్వరిత కళ అని అంటారు.

Sunday, 15 February 2026

కురువింద మణి శ్రేణీ కనత్కోటీర మండితా

కురువిందమణి శ్రేణీ కనత్కోటీర మండితా అను నామము శ్రీ లలితా సహస్ర నామావళిలోని అమ్మవారి పదునాలుగవ నామము. అమ్మవారు కురువిందమణులతో పొదిగియున్న కిరీటము ధరించి దేదీప్యమానంగా వెలిగిపోతున్నది అని అర్థము.కురువిందమణులను పద్మరాగ మణులు అనికూడా అంటారు.ఇవి కామము,అనురాగము మొదలైన నానా గుణములు కలిగి ఉంటాయి.ఇవి ఎర్రగా కెంపు వర్ణంలో ఉంటాయి. రావణగంగ అనే ఒక నదిలో లభ్యమవుతాయి.ఇవి ఉత్తమమయిన మణులు.రావణగంగ నదిలో కురువిందములు,సౌగంథికములు,స్ఫటికములు అని మూడు రకాల శిలలు పుట్టాయి.వాటన్నిటిలోకి పద్మరాగములు మేలైనవి.ఈ మణులు బంథూకము అనగా మంకెన పువ్వు,ఇంద్రగోపము అనగా ఆరుద్ర పురుగు,మందారము,దాసాని,రక్తవర్ణము,దానిమ్మ గింజ...ఈ రంగులో ప్రకాశిస్తూ ఉంటాయి.కొన్ని మోదుగ పువ్వు రంగులో కూడా ప్రత్యక్షమవుతుంటాయి. ఇలాంటి పద్మరాగమణులు వరసగా పొదిగియున్న,బంగారంలా మెరిసిపోతూ,ప్రకాశించుచున్న కిరీటముతో అలంకరింపబడి తేజోమయంగా విరాజిల్లుతున్నది ఆ పరమేశ్వరి అని అర్థము. శంకరాచార్యుల వారు కూడా దీని వర్ణన బహు భేషుగ్గా చేసారు.ఆ తల్లి కిరీటం వరుసగా పొదగ బడిన మణులతో ద్వాదశాదిత్యులకు ఆశ్రయమిచ్చిన గూడులా కనిపిస్తుంది అట!అక్కడ ఉండే చంద్రవంక ఆ మణులకాంతి పైన బడటంతో చంద్ర శకలంలా కాకుండా అద్భుతమయిన,మనోరంజితమయిన ఇంద్ర ధనుస్సులాగా మెరసిపోతున్నది అంట!నీలాకాశంలో ఒకేసారి ఇంద్రధనుస్సుతో కూడిన పన్నెండు మంది సూర్యులు ఉదయించినట్లుగా,అత్యద్భుతము ఆవిష్కరింపబడినట్లుగా కానవస్తుంది అంట! ధాత,అర్యమ్న,మిత్ర,వరుణ,ఇంద్ర,వివస్వంత,త్వష్ట,విష్ణు,అంశుమంత,భగ,పూష మరియు క్రతులను ద్వాదశాదిత్యులు అంటారు.అంతమంది వలన వెలువడే వేడిమి,తాపమును తట్టుకోగలిగే శక్తి ఆ తల్లికి మాత్రమే ఉంది.ఎందుకంటే ఆ వేడి,ఆ చంద్రునిలోని శీతల జ్యోత్స్న ప్రకాశము ఇచ్చింది ఆ పరాశక్తే కాబట్టి.

Friday, 13 February 2026

చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా

చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా అను నామము శ్రీలలితాసహస్ర నామావళి లోని పదమూడవ నామము. అంటే చంపక,అశోక,పున్నాగ,సౌగంధిక పుష్పాలతో అమ్మవారి శిరోజాలు అలంకరించబడినాయి.ఆ రకంగా ఆ తల్లి శోభాయమానంగా విరాజిల్లుతున్నది అని అర్థము. పరమేశ్వరి వర్ణన శిరోజాలతో మొదలు అయి పాదాంతముతో పూర్తవుతుంది.అమ్మవారి సూక్ష్మ శరీరము పంచదశీ మంత్రము.పంచదశీ మంత్రమునకు వాగ్భవ,కామరాజ,శక్తి అనే మూడు కూటములు కలవు.అందులో శిరస్సు వాగ్భవ కూటముగా చెప్పబడినది. పరమేశ్వరి ఆవిర్భావము సకల దేవతల శక్తులతో జరిగినది.అందులో ఆమె కేశములు యముని తేజము నుండి సంభవించాయి.కాబట్టే ఆమె కురులు వంకీలుగా,సహజ పరిమళంతో చాలా పొడవుగా ఉన్నాయి.అంతేనా?చిక్కగా,నునుపుగా,సుమనోహరంగా మేఘ వర్ణంతో కళకళలాడుతున్నాయి.ఇక్కడ చమత్కారం ఏందంటే ఆమె తలలో తురుముకున్న పూలవలన ఆమె శిరోజాలకు సువాసనలు అద్దబడలేదు.ఆమె కురులు సహజసిద్థంగా సహజపరిమళంతో సువాసనలు వెదజల్లుతున్నాయి.ఆ సువాసనలు ఆమె తలలో తురుముకున్న పూలకు అంటుకుంది.ఆమె కురులు పూలకంటే అతి మృదువుగా ఉంటాయట!ఈ విషయం వశిన్యాది వాగ్దేవతలే చెప్పారట.ప్రశ్నించేదానికి మనము ఎవరము? ఆ శిరోజాల ఝరిలో ఇరుక్కుని తాము కూడా సుగంధభరితము కావాలని అన్ని రకాల పుష్పాలు ఉవ్విళ్ళూరుతున్నాయట! అప్పుడే వికసించిన నల్లకలువలు లాగా,నల్లటి మేఘాలలాగా ఉండే ఆమె కొప్పు అజ్ఞానము అనే చీకట్లను పారద్రోలుతుందట!ఆఖరుకి ఇంద్రుడి ఉద్యానవనంలోని కల్పవృక్షం పుష్పాలు కూడా ఎప్పుడు మేముంతా ఆమె శిరోజాలలో తురుమబడతాము అని ఉత్సాహంగా ఎదురుచూస్తూ ఉంటాయట!అమ్మవారు ప్రముఖంగా ఎఱుపు,ఆకుపచ్చ,నీలం రంగు పుష్పాలను ధరిస్తుందట!ఆ రూపం ఎంత జగన్మోహనంగా ఉంటుంది కదా!

Wednesday, 11 February 2026

నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలా

నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలా అను అమ్మవారి నామము శ్రీలలితా సహస్ర నామావళిలోని పండ్రెండవ నామము. అమ్మవారి శరీరము ఎర్రని అరుణకాంతులతో విరాజిల్లుతున్నది.ఆమె తన అరుణారుణ కాంతులతో సమస్త బ్రహ్మాండాన్ని వెలుగులతో నింపుతున్నది.ఆ శరీరపు వెలుగు జిలుగులు ఆమెకు స్వతహాగా ఉన్నవి.ఈ సృష్టి మొత్తము ఆమె సృజనే కదా!కావున ఈ బ్రహ్మాండములు అన్నీ ఆమె శరీరము యొక్క అరుణ కాంతుల శోభతో ప్రకాశిస్తున్నాయి.వెలిగిపోతున్నాయి.అమ్మవారి తాటంకములు సూర్యచంద్రులు.అలగే అమ్మవారి త్రినేత్రములు సూర్యచంద్రుల అగ్నిగోళాలు.ఇడ,పింగళ,సుషుమ్న నాడుల అధిష్ఠాన దేవతలు కూడా సూర్యచంద్రాగ్నులే!ఒక రకంగా అభివర్ణించాలంటే ఆమె పాదములనుండే ఈ సూర్యచంద్రాగ్ని మండలములకు ఆ కాంతులు,ఆ వెలుగులు,ఆ శోభ లభించాయి.అలాగే చంద్రమండలమునకు శీతలత్వము ,అమృత తత్వము ఆ తల్లి సహస్రారము నుండే లభించి ఉన్నాయి. ఆ పరమేశ్వరి వలన సూర్యచంద్రులకు వెలుగు సమకూరింది.వాటి వలన ఆ తల్లికి కాదు. ఇలా సహస్రకోటి కిరణాల సమాహారంగా,దేదీప్యమానంగా వెలుగొందుతుంది కాబట్టి ఆ తల్లికి నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండమండలా అనే నామము సార్థకమయినది.

Monday, 9 February 2026

పంచ తన్మాత్ర సాయకా

పంచ తన్మాత్ర సాయకా అనునది శ్రీలలితా సహస్రనామావళిలోని అమ్మవారి పదకొండవ నామము. పంచ తన్మాత్ర సాయకా అంటే పంచ తన్మాత్రలు,అనగా పంచభూతముల సూక్ష్మ స్వరూపములను తన బాణములుగా కలది అని అర్థము.శబ్ద,స్పర్శ,రూప,రస,గంధములను పంచ తన్మాత్రలు అని అంటారు. ఈ శబ్ద,స్పర్శ,రూప,రస,గంధములు అనేవి జ్ఞానేంద్రియ విషయ పంచకము యొక్క సూక్ష్మాంశములు.ఆ పరమేశ్వరి ధనుస్సును దక్షిణోర్ధ్వకరమున బాణములను ధరించి ఉన్నది.అంటే అమ్మవారు తన కుడి పై హస్తమున పంచతన్మాత్రలను బాణములుగా చేసుకుని విరాజిల్లుతున్నది. బీజరూపములగు శబ్దాదులు రూపరహితములగుటవలన అగోచరములు.అంటే వీటికి ఎలాంటి రూపము ఉండగు.కావున కానరావు.కళ్ళను చూడవచ్చు.చూపును చూడలేము కదా.చూడగలుగుతాము.స్పర్శ అనుభూతి. అనుభూతి పొందగలము కానీ ఆకారరూపంగా చెప్పలేము కదా! దృశ్య ప్రపంచ నిర్మాణానికి స్థూలదేహ నిర్మాణము కావాలి కదా!దానికోసరము పంచభూత తన్మాత్రల పంచీకరణమొనర్చి తన కార్యసాథనకు ఉపయోగించుకుంటుంది ఆ దేవదేవి.అందుకే పంచతన్మాత్ర సాయకా అను నామము సార్థకమయినది.

Monday, 2 February 2026

మనోరూపేక్షు కోదండా

మనోరూపేక్షు కోదండా అను నామము శ్రీలలితా సహస్ర నామావళి లోని పదవ నామము. అమ్మవారు తన ఎడమ వైపు పై చేతిలో చెఱకుగడ విల్లు ధరించి విరాజిల్లుతున్నది.ఇక్షుచాపము అంటే చెఱకుగడ విల్లు అని అర్థము.తన మనస్సునే ఇక్షుచాపము చేసుకుంది. ఇక్కడ మనము ఇలా అర్థం చేసుకోవాలి.మనస్సు అనేది సూక్ష్మము.ఇక్షుచాపము అనునది స్థూలరూపము.ఇక్షుచాపములోని మాధుర్య రసము కారణ రూపము.అంటే ఆ పరమేశ్వరి తన మనస్సులోని మాధుర్యాన్ని తీయని రసధారల ద్వారా తన భక్తులకు పంచేదానికి ఇక్షుచాపము ధరించింది.అంతేకాదు.శిష్టులకు రక్షణ,వరములు ఇచ్చినట్లే దుష్టులను శిక్షించి సన్మార్గంలో పెడుతుంది. చెఱకును పుండ్రేక్షువు అని అంటారు. మనము ఇచ్ఛాశక్తి,జ్ఞానశక్తి ఆ తల్లి మనసు అనుకుంటే,ఆమె ధరించిన విల్లు క్రియాశక్తి.

Sunday, 1 February 2026

క్రోధాకారాంకుశోజ్జ్వల

క్రోధాకారాంకుశోజ్జ్వల అను నామము శ్రీ లలితా సహస్ర నామావళిలోని తొమ్మిదవ నామము. పరమేశ్వరి ఉజ్జ్వలమయిన క్రోధమనే అంకుశమును తన క్రింది కుడిచేతిలో ధరించి విరాజిల్లుతున్నది అని అర్థము.క్రోధము దుష్టశక్తులను దునుమాడేదానికి వాడుతుంది అని నమ్మకము.అదే తన భక్తుల బాధలను,అజ్ఞానాన్ని తొలగిస్తుంది అని అర్థము.కావున ఇది జ్ఞానముతో కూడిన క్రోధస్వరూపమయిన అంకుశము అని మనం భావించవచ్చు. అమ్మవారి చేతిలో పాశము రాగాత్మకము అయితే,అంకుశము ద్వేషాత్మకము అని కూడా అర్థం రాబట్టవచ్చు. ఆ తల్లి నాలుగు ఆయుధములకు నాలుగు బీజాక్షరములు కలవు.అం అనే బీజాక్షరము పాశమునకు,క్రోం అనే బీజాక్షరము అంకుశమునకు,ఓం అనే బీజాక్షరము ధనుస్సుకు ,క్లీం అనే బీజాక్షరము బాణమునకు అన్వయింపబడినవి.

Friday, 30 January 2026

రాగస్వరూప పాశాఢ్యా

రాగస్వరూప పాశాఢ్యా అనేది శ్రీలలితా సహస్ర నామావళి లోని ఎనిమిదవ నామము. రాగము అంటే అనురాగము అని అర్థము.స్వరూప అంటే స్వరూపము కలది అని.పాశాము అంటే బంధము లేక ఉచ్చు అని అర్థము. ఆ తల్లికి నాలుగు బాహువులు ఉన్నాయి అని చెప్పుకున్నాము కదా!ఆమెకు ఎడమ వైపు గల క్రింది చేతిలో పాశము ధరించి ఉంటుంది.అది అనురాగమనే పాశము. ఆ పాశముతో ఆమె తన భక్తులు తప్పు మార్గంలో పోకుండా కాపాడుకుంటుంది.కామ,క్రోధ,మద,లోభాలకు ఉచ్చు బిగిస్తుంది.మానవుడు సరైన మార్గంలో పయనించేదానికి,ఆ అనురాగ స్వరూప పాశం ఉపయోగిస్తుంది. మంచికి చెడ్డకు,ప్రేమకు మోహానికి మనంగీత గీసుకోవాలి.లేకపోతే దారి తప్పిపోవడం చాలా సులువు.క్షణం పట్టదు మనసు నిగ్రహించుకోలేక పోతే! అనురాగము అనేది వాసనాత్మకము.పాశం అనేది స్థూల రూపం.ఒకరకంగా బంధం అంటే ప్రతిబంథకమే!అది విడిపించుకుంటేగానీ మోక్షం దక్కదు.

Tuesday, 27 January 2026

చతుర్బాహు సమన్వితా

చతుర్బాహు సమన్వితా అనే నామము శ్రీలలితా సహస్రనామావళిలోని ఏడవ నామము.చతుర్బాహు సమన్వితా అంటే నాలుగు బాహువులు కలది అను అర్థము.ఊర్ధ్వబాహువులు ధర్మ,మోక్షములు,క్రింది బాహువులు అర్థ కామములు. ఆ పరమేశ్వరి చేతులు ఋగ్వేదము,యజుర్ వేదము,సామ వేదము మరియు అధర్వణ వేదములు.చతుర్వర్ణములు కూడా ఆ తల్లినుండే ఆవిర్భవించాయి. చతురాశ్రమములు అనగా బ్రహ్మచర్యం,గృహస్థము,వానప్రస్థము మరియు సన్యాసము కూడా అమ్మవారి నాలుగు బాహువులు అనుకోవచ్చు.వీటిని మనము నిష్టగా పాటిస్తే చాలు.

Monday, 26 January 2026

ఉద్యద్భాను సహస్రాభా

ఉద్యద్భాను సహస్రాభా అనునది శ్రీలలితా సహస్రనామావళిలోని ఆరవ నామము.మనము సూర్య చంద్రులు మనకు వెలుగునిస్తున్నాయి అనుకుంటాము.కానీ నిజానికి ఆ తల్లి తేజముతోటే అవి వెలుగుతున్నాయి. ఇక్కడ అమ్మవారు ఉదయించుచున్న భానుని యొక్క సహస్ర కిరణముల సమానమైన కాంతులతో విరాజిల్లుతున్నది అని అర్థము.ఇక్కడ సహస్రము అంటే లెక్కగా వెయ్యి అని కాదు.లెక్కలేనన్ని అని,అనంతము అని అర్థము. తల్లి త్రికోణరూపిణి,శివుడు బిందురూపము.అమ్మ వ్యక్తము,అయ్య అవ్యక్తము. దేవీ భాగవతములోని కథ.తారకాసురుడు అనే రాక్షసుని బాధలు పడలేక దేవతలు పరమేశ్వరిని ప్రార్థిస్తారు.చైత్ర శుద్థ నవమి నాడు కాంతి పుంజములాగ,కోటి సూర్య ప్రభలతో,మెరుపుతీగలాగా సాక్షాత్కారము అవుతుంది.దేవతలు అంత కాంతిని చూడలేక కళ్ళు మూసుకున్నారు.అప్పుడు అపురూప లావణ్యంతో కనిపిస్తుంది.అప్పుడు వారందరూ ఉద్యద్భాను సహస్రాభా అని కీర్తిస్తారు.

Sunday, 25 January 2026

దేవకార్య సముద్యత

దేవకార్య సముద్యత అనేది శ్రీ లలితా సహస్ర నామావళిలోని ఐదవ నామము.శ్రీమాత దేవతల యొక్క కార్యములకొరకు ఆవిర్భవించినది.అందుకే ఆమెకు దేవకార్య సముద్యత అనే నామము సార్థకము అయినది. శ్రీమాత భండాసుర,మహిషాసురులను అంతమొందించే దానికి ఆవిర్భవించింది.రాక్షస సంహారముతో పాటూ సృష్టి,స్థితి,లయ కార్యముల వంటి దేవ కార్యముల నిర్వహణలో ఇంద్రాది దేవతలకు సహాయపడేదానికి జనించింది.ధర్మ పరిరక్షణకోసము పుట్టినది. నిజానికి ఆ తల్లి నిర్గుణ.కానీ రాక్షస సంహారం కోసరము సగుణరూపము ఆపాదించుకుంది. ఒకప్పుడు శివుని కోపాగ్నికి మన్మథుడు కాలి భస్మం అయిపోతాడు.గణేశ్వరుడు అనే శిల్పి ఆ భస్మంతో విచిత్ర ఆకృతి గల మానవుడుని తయారు చేసాడు.ఆ విచిత్ర పురుషుడే భండుడు అనే రాక్షసుడు.వాడు మానవులతోనే కాక,ఇంద్రాది దేవతలను,త్రిమూర్తులతోను కూడా యుద్ధానికి తలపడసాగాడు.ఎవరూ అతనిని జయించలేక పోయారు.అప్పుడు దేవతలు అందరూ ఆ తల్లిని రక్షించమని అడిగేదానికి లక్ష యోజనాల విస్తీర్ణము కల యజ్ఞకుండాన్ని నిర్మించి హోమం చేస్తారు.ఆహుతి చాలక దేవతలు వారి వారి శరీర భాగాలు కుండంలో వేసేదానికి సిద్ధ పడతారు.అప్పుడు ఆ యజ్ఞ కుండంలో నుంచి ఆవిర్భవించి రాక్షస సంహారము చేస్తుంది. మనలో ఉండే కామ,క్రోధ,లోభ,మోహ,మద,మాత్సర్యాలే మనలను ఆవహించిన అసురులు.వాటిని ప్రారదోలేదానికి,అజ్ఞానాంధకారాన్ని మటుమాయం చేసేదానికి మనకు చేయూత నిచ్చేది జ్ఞాన ప్రదాయిని శ్రీమాత.

Thursday, 22 January 2026

చిదగ్నికుండ సంభూత

లలితా సహస్రనామావళిలోని నాలుగవ నామము చిదగ్నికుండ సంభూత. చిత్ అంటే చైతన్యము.చైతన్యము అనే అగ్నికుండము నుంచి ఉద్భవించినది గావున మాతకు చిదగ్నికుండ సంభూత అనే సార్థక నామము పెట్టబడింది. చిత్ అంటే జ్ఞానము అనికూడా అర్థము.అంటే జ్ఞానమనే అగ్నికుండములోనుంచి పుట్టినది. అగ్ని కల్మషాన్ని భస్మం చేస్తుంది.అజ్ఞానము అనే అంధకారాన్ని ఆమడ దూరం పారిపోయేలా చేస్తుంది.శుద్ధబ్రహ్మము చేరుకోవాలంటే ఆ చిదగ్నికుండ సంభూత ఆశీర్వాదము మనకు కావాలి.ఆ చల్లని చూపులు మనపై ప్రసరించాలి అంటే ఆతల్లిని మనసా వాచా కొలవాలి.

Tuesday, 6 January 2026

శ్రీమత్సింహాసనేశ్వరి

శ్రీమత్ సింహాసనేశ్వరి అనే నామము శ్రీ లలితా సహస్ర నామావళి లోని మూడవ నామము. సింహం అడవికి రాజు.ఆ సింహాన్నే తన బంటుగా చేసుకుంది ఆ పరమేశ్వరి.దానిని అథిరోహించింది.దానినే తన ఆసనం చేసుకుంది.అందుకే శ్రీమత్ సింహాసనేశ్వరి అనే నామము సార్థకమయినది. శోభాయమానమయిన సింహముఖ మేర్పరచిన స్వర్ణ పీఠమును అధిష్టించిన ఈశ్వరి కావున శ్రీమత్ సింహాసనేశ్వరి అయినది. సింహము మనలోని పాశవికత,హింసాత్మక లక్షణానికి ప్రతీక.అలాంటిది ఆ దుష్ట,క్రూర సింహాన్ని అదుపులోకి తెచ్చుకుంటేనే కదా దానిని ఎక్కగలిగేది.శ్రీ లలితా పరమేశ్వరి సింహాన్ని ఎక్కి మహిషాసుర మర్దనకు బయలుదేరి ఆ అసురుడి అంతం చూసింది.అప్పటి నుంచీ ఆమెను సింహాసనేశ్వరి అని పిలుస్తున్నారు. ఆమె అధిష్టించిన పీఠానికి అయిదు కోళ్ళు ఉంటాయి.పంచ బ్రహ్మలు అనగా బ్రహ్మ,విష్ణువు,రుద్రుడు,మహేశ్వరుడు,సదాశివుడు ఆమెను అతి దగ్గరగా ఉండి సేవించుకోవాలనుకున్నారు.వారు ఒక ఆసనము ఏర్పరచి దాని నాలుగుకోళ్ళు అయినారు.సదాశివుడు అయిదవ కోడు,పరుపులాగ అయ్యాడు.

Monday, 5 January 2026

శ్రీ మహారాజ్ఞి

శ్రీమహారాజ్ఞి అనే నామము లలితా సహస్రనామావళిలో రెండవ నామము. అఖిల లోకాలకూ అధినేత్రి,సామ్రాజ్ఞి కాబట్టి మహారాజ్ఞి అనే పేరు వచ్చింది.సమస్త బ్రహ్మాండాన్ని తన పరిపాలనా దక్షతతో అన్ని వేళలా కాపాడుతుంది కాబట్టి ఆ పేరు సార్థకమయింది.ఆమె గ్రహగతులు తప్పకుండా నవగ్రహాలనూ,ఋతుధర్మాలు తప్పకుండా అష్టదిక్పాలకులనూ నియంత్రిస్తూ ఉంటుంది.సర్వం ఆమె పర్యవేక్షణలో సాగుతుంటుంది.

Thursday, 1 January 2026

శ్రీమాత ……

లలితాదేవి సహస్ర నామాలు శ్రీమాతా అని ప్రారంభమవుతాయి.మాత అంటే అమ్మ.దేవుడు కంటే ఉచ్ఛ స్థానం అమ్మది.మన సృష్టికి మూలకారణం అమ్మ. శ్రీ అంటే మంగళప్రదము,శుభప్రదము.లలితాదేవి శుభములను ఇచ్చే తల్లి.శ్రీ అంటే శారద,రమ,ఈశ్వరిల సమ్మేళనము.ఈ ముగ్గురికీ అమ్మ ఆ పరమేశ్వరి.శారద అంటే సరస్వతి,రమ అంటే లక్ష్మి,ఈశ్వరి అంటే పార్వతి.వీరు ఇచ్ఛాశక్తి,జ్ఞానశక్తి,క్రియాశక్తి స్వరూపిణులు.అంటే వీరి తల్లి సంపూర్ణ శక్తి స్వరూపిణి అని అర్థము.