Wednesday, 12 August 2020

త్రయాణాం దేవానాం త్రిగుణ జనితానాం తవశివే

త్రయాణాం దేవానాం త్రిగుణ జనితానాం తవశివే
భవేత్పూజా పూజా తవ చరణయో ర్యా విరచితా/
తథాహి త్వత్పాదోద్వహన మణి పీఠస్య నికటే
స్థితా హ్యేతో శశ్వ న్ముకుళిత కరోత్తం సమకుటాః//

ఓ మాతా!తల్లీ!అమ్మా!శివానీ!త్రిమూర్తులు నీ త్రిగుణాలవలన జనించిన వారే కదా.కావున నీ చరణాలకు మేము చేసే పూజే వారికి కూడా చేసే పూజ అవుతుంది.వారికి ఇంక వేరే పూజలు అవసరము లేదు.ఎందుకంటే వాళ్ళందరూ ఎల్లప్పుడూ నీ పాదాలను వహిస్తున్న నవరత్న ఖచ్చిత పీఠానికి దగ్గరగా చేరి,చేతులు తమ మణిమయ శిరోముకుటాలకు తాకేటట్లు పెట్టుకొని నీకు మొక్కుతూ వుంటారు.సర్వకాల సర్వావస్థలలో నీ ఆజ్ఞను శిరసావహిస్తుంటారు.కాబట్టి ఆతల్లి పాదసేవ ఆమె కటాక్షిస్తేనే మనకు దక్కేది అని దీని అంతరార్థం.

Wednesday, 5 August 2020

జగత్సూతే ధాతా హరిరవతి రుద్రః క్షపయతే

జగత్సూతే ధాతా హరిరవతి రుద్రః క్షపయతే
తిరస్కుర్వ న్నేతత్స్వమపి వపురీశ స్తిరయతి/
సదాపూర్వ స్సర్వం తదిద మనుగృహ్ణాతి చ శివః
తవాజ్ఞా మాలంబ్య క్షణచలితయోర్ర్భూ లతికయోః//

ఓ మాతా!తల్లీ!భగవతీ!అమ్మా!సృష్టికి కర్త అయిన బ్రహ్మ ఈ విశ్వాన్ని సృష్టిస్తున్నాడు.మహావిష్ణువు ఏమో రక్షిస్తున్నాడు.రుద్రుడు ఏమో విశ్వాన్ని లయింప చేస్తున్నాడు.కల్పాంతం లో మహేశ్వరుడు ఈ బ్రహ్మ,విష్ణువు,రుద్రులను తనలో లీనం చేసుకొని సదాశివతత్త్వంలో అంతర్భూతం చేస్తున్నాడు.ఈ ప్రకారంగా ఈ బ్రహ్మాండం అంతా లయమయిపోతుంది.మళ్ళీ  ఆ సదాశివుడు కల్పాదిలో నీవు నీ కనుబొమ్మలను ఒక్క క్షణం కదిలించగానే,అదే ఆజ్ఞగా  గ్రహించి ఈ నాలుగు తత్త్వాలతో మళ్ళీ యథావిధిగా సృష్ట్యాది కార్యాలు జరిపిస్తున్నాడు.

Tuesday, 4 August 2020

త్వయా హృత్వా వామం వపు రపరితృప్తేన మనసా

త్వయా హృత్వా వామం వపు రపరితృప్తేన మనసా
శరీరార్ధం శంభో రపరమపి శఙ్కే హృతమభూత్/
యదేత త్త్వద్రూపం సకల మరుణాభం త్రినయనం
కుచాభ్యా మానమ్రం కుటిల శశి చూడాల మకుటమ్//

ఓ జగన్మాతా!తల్లీ!అమ్మా!నీవు ముందర శివశంభుడి వామ భాగాన్ని గ్రహించావు.అయినా నీకు తనివి తీర లేదనిపిస్తుంది.ఎందుకంటే తనివితీరని మనస్సుతో అర్థనారీశ్వరుడి ఆ మిగిలిన సగ భాగంకూడా ఆక్రమించావనిపిస్తుంది.నాకు ఎందుకు ఇలా అనిపిస్తుందంటే నా హృదయఫలకం పైన విరాజిల్లుతున్న నీ దివ్య స్వరూపం అలా గోచరిస్తున్నది.నీ దివ్య స్వరూపం ఉదయ భానుడి కాంతితో సాటి వచ్చే కెంపు కాంతులతో ఒప్పారుతూ వుంది.పాలిండ్ల జంటతో యించుక ముందుకు వంగినట్లు కనపడుతూ వుంది.ఆ నీ దివ్య స్వరూపం మూడు కన్నులు కలిగి,వంపు తిరిగిన చంద్రకళ శిరోమణిగా ఉన్న కిరీటంతో సొంపారుతూ,విరాజిల్లితుంది.దీని భావం ఏందంటే అమ్మవారు తనలో శివతత్త్వాన్ని లయం చేసుకున్నారని.

Monday, 3 August 2020

భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం

భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం
ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితియః/
తదైవ త్వం తస్మై దిశసి నిజసాయుజ్యపదవీం
ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదామ్//

ఓ మాతా! తల్లీ!అమ్మా!జగజ్జననీ!భవానీ!నీ ఉపాసకుడు ఎవరైనా,తల్లీ!నేను నీ దాసుడిని.నీ కృపా కటాక్ష వీక్షణం నాపై ప్రసరింపజేయి,అని నిన్ను ప్రార్థించగానే ,అతనికి సాయుజ్య ముక్తిని కల్పిస్తున్నావు.ఆ బ్రహ్మ,ముకుందుడు,ఇంద్రుడు మొదలగు వారు తమ రత్న కిరీటాలచేత నీ పాదపద్మాలకు నీరాజనం గావిస్తారు.అంత గొప్ప ఘన కీర్తి గలిగిన నీ సాయుజ్యాన్ని నీ ఉపాసకులకు ప్రాప్తం కలిగేలా చేస్తావు.

Sunday, 2 August 2020

తటిల్లేఖా తన్వీం తపనశశి వైశ్వానరమయీం

తటిల్లేఖా తన్వీం తపనశశి వైశ్వానరమయీం
నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలామ్/
మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా
మహాన్తః పశ్యంతో దధతి పరమాహ్లాదలహరీమ్//

ఓ మాతా!తల్లీ!అమ్మా!భగవతీ!నీ సదాఖ్యకళ మెరుపు తీగ వంటిది.అది సూర్యచంద్రాగ్ని ప్రభాసమాన మైనది.సదాఖ్య అనగా శివభక్తుల సాయుజ్యం మరియు ప్రకృతి పురుషుల కలయిక.షట్చక్రాలలో ఉపరిదైనది అయిన సహస్రార మహాపద్నాటవిలో కూర్చున్న నీ సదాఖ్య కళను మహాత్ములు,పరిపక్వచిత్తులు పరమాహ్లాద లహరిగా అనుభూతి నొందుతున్నారు.అనగా ఆ సత్పురుషులు నిరతిశయానందాన్ని ఎల్ల వేళలా పొందుతున్నారు.

Saturday, 1 August 2020

కిరన్తీ మఙ్గేభ్యః కిరణ నికురుమ్బామతరసం

కిరన్తీ మఙ్గేభ్యః కిరణ నికురుమ్బామృతరసం
హృది త్వా మాధత్తే హిమకర శిలామూర్తి మివ యః/
స సర్పాణాం దర్పం శమయతి శకున్తాధిప ఇవ
జ్వరప్లుష్టాన్ దృష్ట్వా సుఖయతి సుధాధార సిరయా//

ఓ మాతా!తల్లీ!అమ్మా!జగజ్జననీ!నీ దివ్యరూపం చంద్రకాంతిమణి లాగా అమృతరసాన్ని పోలిన చల్లని కిరణాలను ప్రసరిస్తుంది.అలాంటి నీ దివ్య రూపాన్ని ఏ సాధకుడు తన హృదయంలో ప్రతిష్ఠించుకుంటాడో,అతడు గరుత్మంతుడిలా సర్పాల దర్పాన్ని శమింప చేయగలడు.దీని అర్థం ఏంటంటే విష సర్పాల లాంటి కష్టాలు,కడగళ్ళు కూడా అతడిని చలింప చేయలేవు.భవజ్వర పీడీతులకు అతడి వీక్షణం అమృత రస ధార అవుతుంది.అంటే ఉపశమనం కలిగిస్తుంది.