Sunday, 9 August 2026

కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వరా

కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వరా అను దివ్యనామము శ్రీ లలితా సహస్ర నామావళిలో అమ్మవారికి పెట్టబడిన డెబ్బై ఏడవ నామము. అమ్మవారు భండాసురుని సంహారమునకు బయలుదేరింది.సమరం భీకరంగా సాగుతున్నది.భండుడి సోదరుడు అయిన విశుక్రుడు జయవిఘ్నము అనే యంత్రాన్ని ప్రయోగించాడు.దానిని ఎలా ఛేదించాలో,ఇంకెలా భేదించాలో ఒక్క క్షణం అర్థం కాలేదు.శత్రువు సంధించిన జయవిఘ్నము నాశనము చేయాలంటే విఘ్న నాశనము జరగాలి.అంటే విఘ్న నాశకుడు కావాలి.అప్పుడు జగన్మాత చిరునగవుతో కామేశుని చూసింది.తక్షణం ఆమె ఒడిలోకి బాలగణేశుడు ఉద్భవించాడు.అంత కంటే విఘ్న నాయకుడు ఇంకెక్కడ దొరుకుతాడు?ఒక్కడు చాలు అన్నట్లు మహా గణేశుడు జయవిఘ్న యంత్రాన్ని నామరూపాలు లేకుండా చేసాడు. విశుక్రుడు శక్తి సేనల మధ్యలో జయవిఘ్నము అనే శిలా యంత్రాన్ని ప్రతిష్టించాడు కదా!దాని విశిష్టతలు తెలుసుకుందాము.ఆ యంత్రానికి అష్ట దిక్కులు ఉన్నాయి.ప్రతి దిక్కుకూ కోణములు ఉన్నాయి.ప్రతి కోణములోనూ విశుక్రుడు పాతిన శూలములు ఉన్నాయి.ఆ ఎనిమిది దిక్కులలో ఉండే ప్రతి శూలానికీ ఒక్కొక్క శక్తిని ఆవాహనం చేసాడు.ఆ శక్తులు...అలసా,కృపణా,దీనా,నిద్రా,తంద్రా,ప్రమీలికా,క్లీబామరియు నిరహంకారా.వీటి ప్రభావం వలన శక్తి సైన్యానికి కళ్ళు బైర్లు కమ్మాయి.నిద్ర లాగా మగత వచ్చింది.పిరికితనం ఆవహించింది.అందరూ చతికిల బడ్డారు.శక్తి సేన మొత్తమూ చైతన్యరహితమయిపోయింది.నిర్వీర్యమయింది.వారికి ఇంక యుద్ధం చేయాలనే ఆసక్తే పూర్తిగా చచ్చిపోయింది.ఈ విషయం గమనించిన వారాహీ,శ్యామల అమ్మవారికి తెలియ చేసారు.అప్పుడు ఇంక జగన్మాత అవలోకనం చేసుకుంది.గట్టిగా బుద్ధి చెప్పకపోతే శత్రువు ఇలానే తోక ఆడిస్తుంటాడని.అప్పుడు అమ్మవారు కామేశుని క్రీగంటితో,చిరు నవ్వుతో చూసింది.ఇంకేముంది.మన బొజ్జ వినాయకుడు బుజ్జి పాపాయి లాగా అమ్మ ఒడి చేరాడు.ఆ తల్లికి బుజ్జివాడే!కానీ నిజానికి పొట్టి వాడు,పొట్టవాడు,గట్టివాడు,గజాననుడు గజగజలాడించాడు శత్రుమూకలను.పెద్ద పెద్ద చెవులతో,చిన్న చిన్న కన్నులతో,వక్ర తుండముతో ఉన్నాడు.రక్త వర్ణముతో,పది చేతులతో రక్త హీనులను చేసాడు భండుడి సేనలను.ఆ గణేశుడు బ్రహ్మాండమంతటి వాడు,బ్రహ్మాండాలనే అబ్బురపరిచే విధంగా బల్ రణం కావించాడు.ఇంతకీ ఆ గణపతి ఎవరు?అతని ఔన్నత్యం ఏంది?అతను షట్చక్రములలో మూలాధారమందు ఉండే మూలకారకుడు.కుండలినీ శక్తిని ఊర్థ్వ ముఖంగా పయనింపచేసేవాడు.అతడు పృథివీ తత్త్వాత్మకుడు.సర్వ మంత్రాలలోనూ గురు వందనం తరువాత ఆహ్వానింపబడేవాడు.సర్వ పూజలకూ,సర్వ కార్యములకూ తొలి పూజలు అందుకునేవాడు.అతను దైవ పంచాయతనములలో ఒకడు.ఇన్ని శక్తులు ఉన్న మన బొజ్జ గణపయ్యను ఆ తల్లి ఆవిర్భవింపచేసింది.మన బుజ్జి గణేశు తల్లి మాట కాదనగలడా!రణరంగంలో వీర విహారం చేసాడు.విశుక్రుడు ప్రతిష్టించిన జయ విఘ్న యంత్రాన్నీ,దాని అష్ట దిక్కులందు ఉండే శూలాలనూ తుత్తునియలు చేసాడు.ఆ శూలములపైన ఆహ్వానింపబడిన క్షుద్ర దేవతలను నామరూపాలు లేకుండా సర్వ నాశనము చేసాడు.

Saturday, 8 August 2026

విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్య నందితా

విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్య నందితా అను అద్వితీయ నామము అమ్మవారికి శ్రీ లలితా సహస్ర నామావళిలో డెబ్బై ఆరవ నామముగా చెప్పబడినది.భండాసురుడికి ఇద్దరు సోదరులు ఉన్నారు.వారు అతని బాహువుల నుంచి ఉద్భవించారు.అతనికి నిజంగానే కుడి,ఎడమ భుజాలలాగానే ఇరు వైపులా ఉంటారు.అతనికి రక్షకులుగా,సేనా నాయకులుగా ఉంటారు.వారే విషంగుడు,విశుక్రుడు.వారాహీ దేవి అమ్మవారి సేనాని కదా!ఆమె విశుక్రుని హతమార్చింది.ఆ ఘటన,సంఘటన జరిగేటప్పుడు ఆమె చూపిన పరాక్రమము అంతా ఇంతా కాదు.అమ్మవారు ముగ్ధురాలు అయి చూసింది.మహదానందపడిపోయింది. మనలో శుక్ర ధాతువు ఉంటుంది కదా!అది కామోద్రేకాన్ని ప్రేరేపిస్తుంది.ఇక్కడ విశుక్రుడు శుక్రధాతువు లాంటి వాడు.వారాహీ దేవి వాడిని నామరూపాలు లేకుండా చేసింది అంటే అర్థం ఏంది?ఆ తల్లి మనలో ఉండే కామాన్ని కూడా రూపుమాపుతుంది అని.కామాన్ని పక్కన పెట్టిన తరువాతే మానవుడు దేవుడు,దైవము గురించి ఆలోచించగలతాడు.సప్త మాతృకలలో వారాహీ దేవి ఒక దేవత.మిగిలిన వారు బ్రాహ్మి,మాహేశ్వరి,కౌమారి,వైష్ణవి,మాహేంద్రి మరియు చాముండి.

Tuesday, 4 August 2026

మంత్రిణ్యంబా విరచిత విషంగ వధ తోషితా

మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషితా అను దివ్య నామము అమ్మవారికి శ్రీ లలితా సహస్ర నామావళిలో డెబ్బై అయిదవ నామముగా చెప్పబడినది. భండాసురుడికి ఇద్దరు సోదరులు ఉన్నారు.వారు విషంగుడు మరియు విశుక్రుడు.అమ్మవారి మంత్రిణి అయిన శ్యామలా దేవి,(రాజ శ్యామలా)విషంగుడిని సంహరించింది.ఆ దృశ్యము చూసి అమ్మవారు అమితంగా సంతోషపడింది. రాక్షసులు అంటే విషయాసక్తులు,అజ్ఞానులు.అరిషడ్వర్గాలకు ప్రతిరూపాలు.లేకుంటే వారు తపోబల సంపన్నులు,మహాబలవంతులు.ప్రవృత్తి రూపేణా రక్కసులు అయ్యారు.విషంగుడు అంటే విషయలాలసానికి,విషయలంపటం జోడించి,రెచ్చగొట్టేవాడు.విషయలంపటం అంటే ఏముంది?క్రోథ,లోభ,మోహ,మద,మాత్సర్యాలే కదా!ఈ లంపటాన్ని ఛేదించగల శక్తి ఉండేది మన రాజశ్యామలా దేవికే!కాబట్టే మహానిత్యా ఆమెను పంపింది అరిషడ్వర్గ సంహారానికి.

Sunday, 2 August 2026

భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందితా

భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందితా అను అద్భుత నామము అమ్మవారికి శ్రీ సలితా సహస్ర నామావళిలో డెబ్బై నాలుగవ నామముగా చెప్పబడినది.భండుడికి ముప్పై మంది కుమారులు ఉన్నారు.వారందరూ కూడా తమ తండ్రి తరఫున యుద్ధంలో పాల్గొన్నారు.వారందరూ మూకమ్ముడిగా అమ్మవారి పైకి దూసుకొచ్చారు.అప్పుడు అమ్మ తన అంశం నుండి తొమ్మిది సంవత్సరాల బాలా త్రిపుర సుందరిని ఉద్భవింపచేసింది.ఆ బాలను భండుడి కొడుకులతో పోరు సల్పమని ఆదేశించింది.అప్పుడు ఆ బాలా కుమారి అయిన బాలా త్రిపుర సుందరి మహాత్రిపుర సుందరి ఇచ్చిన రథం ఎక్కింది.సర్వాయుథ పరిష్కృత అయింది.అమ్మకు ఎన్ని శక్తులు ఉన్నాయో బిడ్డకు కూడా అన్నీ శక్తులు ఉన్నాయి.ఇంక చండ ప్రచండంగా యుద్ధభూమిలోకి అడుగు పెట్టింది.ఎత్తిన కరవాలం దించకుండా,భండుని సైన్యాన్ని దాటింది.సుడిగాలి లాగా భండుడి పుత్రులను ఏరిపారేసింది.ఆమె అలా వారిని దునుముతూ,తుత్తినియలు చేస్తుంటే...।అమ్మవారి ఆనందానికి అంతమే లేకుండా పోయింది.అమ్మవారి ఆనందానికి ఆకాశపుటంచులు కూడా హద్దులు కాలేక చిన్నబుచ్చుకున్నాయి. భండుని పుత్రులు...చతుర్బాహువు,చకోరాక్షుడు,చతుశిరస్కుడు, వజ్రఘోషుడు,ఊర్థ్వకేసుడు,మహాకాయుడు,మహాహనువు,ముఖశత్రువు,మఖస్కందుడు,సింహఘోషుడు,విరాలకుడు,లశునుడు,కుట్టిశేనుడు,పురజిత్తు,పూర్యరనూకుడు,సర్గశత్రువు,ఇంద్రశత్రువు,అమీత్రకుడు,విద్యున్మాలి,ఉగ్రకర్మ,ఉగ్రధన్వా, స్వర్గపీడుడు,దుర్గుడు,స్వర్గకంటకుడు,అతిమాయుడు,బృహన్నాయుడు,విభీషణుడు,శృతిపారగుడు,విదురుడు మరియు ఉపమాయువు.