Thursday, 30 July 2020

ముఖం బిన్దుం కృత్వా కుచయుగ మధస్తస్య తదధో

ముఖం బిన్దుం కృత్వా కుచయుగ మధస్తస్య తదధో
హరార్ధం ధ్యాయేద్యో హరమహిషి తే మన్మథ కలామ్/
ససద్య స్సంక్షోభం నయతి వనితా ఇత్యతి లఘు
త్రిలోకీ మప్యాశు భ్రమయతి రవీన్దుస్తన యుగామ్//

ఓ మాతా!తల్లీ!అమ్మా!జగజ్జననీ!నీ ముఖారవిందాన్ని జగద్బీజంగా,సూర్య చంద్రులు సృష్టి స్వరూపిణివి అయిన నీ కుచయుగ్మంగా,భౌతిక జగత్తు మొత్తం నీ ప్రకృతిగా అనగా పురుషుడు అయిన శివుని లో అర్ధ భాగం,అదే హరార్ధంగా భావించి నీ మన్మథకల అనగా జీవుడిని భ్రాంతికి గురి చేసే స్వభావాన్ని ఎవడు ధ్యానిస్తాడో అతడు ఆ మరు క్షణమే ఆడవాళ్ళ మనసులను సంక్షోభ పెట్టటమే కాదు  ముల్లోకాలను కూడా సమ్మోహన పరచగలడు.దీనీ అర్థం ఏమిటంటే మానవులను భ్రాంతికి గురి చేసి,కర్మ బద్ధులను చేస్తున్న ఈ దృశ్యమాణ జగత్తు మొత్తం అమ్మ రూపంగా తెలుసుకొని ఎవరు అయితే అమ్మ మంగళరూపాన్ని ధ్యానిస్తారో వారు ఈ విషయ జగత్తు తో సంయోగాన్ని వదలి ముక్తులు అవుతారు.

Wednesday, 29 July 2020

తనుచ్ఛాయాభిస్తే తరుణ తరణి శ్రీ సరణిభిః

తనుచ్ఛాయాభిస్తే తరుణ తరణి శ్రీ సరణిభిః
దివం సర్వాముర్వీ మరుణిమనిమగ్నాం స్మరతి యః/
భవన్త్యస్య త్రస్యద్వనహరిణ శాలీన నయనాః
సహోర్వశ్యా వశ్యాః కతికితి న గీర్వాణ గణికాః//

ఓ మాతా!తల్లీ!అమ్మా!భగవతీ!ఉదయిస్తున్న బాలసూర్యుడి కాంతి పుంజాలను నీ బంగారు మేను వెదజల్లుతున్నది.నీ ఒంటి నుంచి ప్రసరింపబడే ఆ కెంజాయలచేత భూమి,ఆకాశాలు కెంపు జిలుగుల మున్నీటిలో మునిగి తేలుతున్నాయి.అలాంటి నీ తేజోమయమైన దివ్య స్వరూపాన్ని ధ్యానించే భక్తుడికి బెదరిన లేడి కన్నుల వంటి కన్నులు గల అప్సరసలు,రంభ,మేనక,ఊర్వశి,తిలోత్తమలు సైతం వశులవుతారు.అంటే ఆ అమ్మ యొక్క లోకాతీతమయిన దివ్య మంగళ స్వరూపాన్నిధ్యానించేవారు సర్వ సమ్మోహన రూపానికి అర్హులు అవుతారు.ఈ ముల్లోకాలలో వారికి ఆకర్షితులు కాని వారంటూ ఎవరూ ఉండరు.

Monday, 27 July 2020

సవిత్రీభిర్వాచాం శశిమణి శిలా భఙ్గరుచిభిః

సవిత్రీభిర్వాచాం శశిమణి శిలాభఙ్గరుచిభిః
వశిన్యాద్యాభిస్త్వాం సహజనని సఞ్చిన్తయతి యః/
స కర్తా కావ్యానాం భవతి మహతాం భఙ్గిరుచిభిః
వచోభిర్వాగ్దేవీ వదన కమలామోద మధురైః//

ఓ మాతా! తల్లీ!అమ్మా!జగదీశ్వరీ!నీ దివ్యస్వరూపం వాక్కులను సృజించేవారూ,చంద్రకాంత మణుల శకలాల లాగా తెల్లనయిన దేహ,ముఖ కాంతి గలవారు అయిన వశిన్యాది దేవతలచే కూడి ఉంది.అలాంటి నీ దివ్య స్వరూపాన్ని ఎవరు ధ్యానిస్తారో,అతడు ఖచ్చితంగా కవి శ్రేష్టుడవుతాడు.అతడు సమర్థుడైన కవితల్లజుడవుతాడు.అతని కవిత్వం మృదువైన వాగ్గుంభనలతో కూడి రుచిమంతంగా,రసమయ భరితంగా వుంటుంది.అతని కవితా స్రవంతి సరస్వతీ దేవి యొక్క ముఖ కమల పరిమణాలను వెదజల్లుతూ వుంటుంది.ఆ కవిత్వం శ్రోతల మనసులను,పాఠకుల మనసులను ఓలలాడిస్తుంది.

Sunday, 26 July 2020

కవీన్ద్రాణాం చేతః కమలవన బాలాతప రుచిం

కవీన్ద్రాణాం చేతః కమలవన బాలాతప రుచిం
భజన్తే యే సన్తః కతిచి దరుణామేవ భవతీమ్/
విరిఞ్చి ప్రేయస్యా స్తరుణ తర శృఙ్గారలహరీ
గభీరాభిర్వాగ్భి ర్విదధతి సతాంరఞ్జనమమీ//

ఓ మాతా!తల్లీ!అమ్మా!జగజ్జననీ!పద్మాలకు ఉదయకాలపు లేత ఎండ ఎలా అవసరమో నీవు కూడా కవివరేణ్యులకు అంతే అవసరము.కవుల మనో పద్మాలకు వికాసాన్ని కలిగించే అరుణవు నీవు.అలాంటి నిన్ను ఏ సత్పురుషులు సేవిస్తారో,వారు,శారదా ప్రసాద లబ్ధమైన శృంగార రస గంభీరాలైన సుభాషితాల చేత,సభాసదులైన సుజనులకు హృదయరంజనం గావిస్తారు.అనగా వారు వారి కవితా పాటవం తో అందరి మనసులు చూరగొంటారు.

Saturday, 25 July 2020

శరజ్జ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం

శరజ్జ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం
వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తక కరామ్/
సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే
మధుక్షీర ద్రాక్షా మధురిమ ధురీణాః ఫణితయః//

ఓ మాతా! తల్లీ! అమ్మా! జగజ్జననీ!నీవు శరశ్చంద్రిక లాగా పరిశుద్ధురాలివి.శశియుతమైన జటాజూటమే కిరీటముగా కలదానివి.రెండు హస్తాలలో వర, అభయ ముద్రలు దాల్చి వున్నావు.మిగిలిన రెండు చేతులలో అక్షమాలా,పుస్తకాలను ధరించి వున్నావు.అలాంటి నిన్ను కవీశ్వరులు ఒక్కసారి నమస్కరిస్తే చాలు.వారికి పూదేనియతో,గోక్షీరంతో,ద్రాక్షాఫలాలతో సాటివచ్చే మాధుర్యాన్ని గలిగిన మధురవాక్కులు సంప్రాప్తించేలా చేస్తావు.అలా వారికి ప్రాప్తించకుండా ఎలా ఉంటాయి?నీకు ఒక్కసారి మనస్పూర్తిగా మొక్కితేనే అన్ని వరాలిస్తావు.

Friday, 24 July 2020

క్షితౌ షట్పఞ్చాశ ద్ద్విసమధిక పఞ్చశదుదకే

క్షితౌ షట్పఞ్చాశ ద్ద్విసమధిక పఞ్చశదుదకే
హుతాశే ద్వాషష్టి శ్చతురధిక పంచాశ దనిలే/
దివిద్విష్షట్త్రింశ న్మనసి చ చతుష్షష్టి రితి యే
మయూఖాస్తేషా మప్యుపరి తవపాదాంబుజ యుగమ్//

ఓ భవానీ!మాతా!తల్లీ!అమ్మా!దేవీ!అన్ని చక్రాలకు ఉపరిగా  సహస్రార చక్ర మధ్యం లో సహస్రదళ పద్మంగా నీవు విరాజిల్లుతావు.నీ నుండి ప్రసరించే శక్తిసంజనితమైన తేజోకిరణాలు యాభై ఆరు,మూలాధార కేంద్రంలో పృథ్విగా పరివర్తనం చెందుతాయి.మణిపురంలో ఏభై రెండు జలతత్త్వంగా,స్వాధిష్ఠానంలో అరవై రెండు అగ్నితత్త్వంగా, అనాహతంలో ఏభై నాలుగు వాయు తత్త్వంగా,విశుద్ధ చక్రంలో డెబ్బై రెండు ఆకాశ తత్త్వంగా, ఆజ్ఞాచక్రంలో అరవై నాలుగు మనస్సుగా పరిణమిస్తాయి.

Wednesday, 22 July 2020

నరం వర్షీయాంసం నయనవిరసం నర్మసు జడం

నరం వర్షీయాంసం నయనవిరసం నర్మసు జడం
తవాపాఙ్గాలోకే పతిత మనుధావన్తి శతశః/
గనద్వేణీ బంధాః కుచకలశ విస్రస్త సిచయాః
హఠత్తృట్య త్కాంచ్యో విగళిత దుకూలా యువతయః//

ఓ మాతా!తల్లీ!అమ్మా!జగజ్జననీ!కనికరం ఉట్టిపడే నీ కడకంటి చూపుకు నోచుకున్న వాడు ఎవడైన సరే,వాడు ముసలి వాడు ఐనా,కురూపి అయినా,శృంగార పరిభాషలోమందబుద్ధికలవాడైనా,ఆడవాళ్ళు,యువతులు,ప్రౌఢలు అతగాడినే వలచి దాసోహం అంటారు.వారు తమ తమ కొప్పులు వీడి పోతున్నా,పైటలు జారిపోతున్నా,మొలనూళ్ళు నడుము నుంచి జారి పోతున్నా,కట్టుకున్న పట్టు చీరలు వాళ్ళ శరీరాలను కాదని జారి పోతున్నా వాళ్ళెవ్వరికీ ఆ స్పృహ వుండనే వుండదు.వందలాది వనితలు ఆ పురుషుడి వెంటబడి పరుగులు తీస్తూ వస్తారు.ఆ పురుషుడినే మనసా,వాచా,కర్మణా కోరుకుంటారు.దీనీ కంతటికీ కారణం ఏందంటే ఆ తల్లి అనుగ్రహానికి పాత్రుడైన వాడే లోకోత్తర సుందరుడు అవుతాడు.దీనికి ఇంక తిరుగు లేదు.

Tuesday, 21 July 2020

త్వదీయం సౌన్దర్యం తుహినగిరి కన్యే తులయితుం

త్వదీయం సౌన్దర్యం తుహినగిరికన్యే తులయితుం
కవీన్ద్రాః కల్పంతే కథమపి విరిఞ్చి ప్రభృతయః/
యదాలోకౌత్సుక్యా దమర లలనాయాన్తి మనసా
తపోభి ర్దుష్ప్రాపామపి గిరిశ సాయుజ్య పదవీమ్//

ఓ మాతా!తల్లీ!అమ్మా!హిమగిరి తనయా!నీ మేలిమి బంగారు లావణ్యాన్ని,అవయవాల సౌందర్యాన్ని సరిపోల్చి వర్ణించడానికి బ్రహ్మ,విష్ణువు,ఇంద్రుడు మొదలైన కవివరేణ్యులు వేరే ఏ వస్తువు కనిపించక గమ్మున ఉన్నారు.వాళ్ళకు నిన్ను తెలుసు కోవడం చేతకావటంలేదు.అలాంటి నీ లోకోత్తర సౌందర్యాన్ని చూడాలన్న కుతూహలం గలవారై అప్సరసలు నీ అందంతో పోలిస్తే వాళ్ళు  నీ కాలి కోటికి కూడా సరి కారు అనే నిష్టుర సత్యాన్ని తెలుసుకున్నారు.వారు ఇక తపస్సుల చేత కూడా పొందరానిదైన  పరమ శివుడి సాయుజ్య స్థానాన్ని మనస్సు చేత పొందేదానికి ఇచ్ఛ,ఉత్సాహం చూపిస్తున్నారు.అనగా ఒక్క పరమ శివుడికి మాత్రమే నీలో సాయుజ్యం పొందే అర్హత వుంది.అతను ఒక్కడే నీలో సాయుజ్యం పొందగలడు కాబట్టి వారు మొదట శివసాయుజ్యం పొంది తద్వారా నిన్ను చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు.కానీ ఆ ప్రయత్నం లోనూ వాళ్ళు సఫలీకృతం కాలేక పోతున్నారు.కాకపోతే ఒక విధమైన మానసికమైన అనుభూతితో సంతృప్తి చెందుతున్నారు.

చతుర్భి శ్శ్రీకణ్ఠై శ్శివయువతిభిః పఞ్చభిరపి

చతుర్భి శ్శ్రీకణ్ఠై శ్శివయువతిభిః పఞ్చభిరపి
ప్రభిన్నాభి శ్శమ్భోర్నవభిరపి మూలప్రకృతిభిః/
చతుశ్చత్వారింశ ద్వసుదళ కలాశ్రత్రివలయ
త్రిరేఖాభి స్సార్ధం తవ శరణకోణాః పరిణతాః//

ఓ మాతా!తల్లీ!అమ్మా!జగజ్జననీ!నీవు నలుగురు శ్రీకంఠులతో అనగా శివచక్రాలు,ఐదుగురు శివ యువతులతో అనగా శక్తి చక్రాలు,మొత్తం తొమ్మిది మూలప్రకృతులతో మూల బిందువైన శంభు కాకుండా,నీవు అభివ్యక్తమవుతున్నావు అనగా మాకు కనిపిస్తున్నావు.అష్టదళం,షోడశదళం,మేఖలాత్రయం,భూపురం అనే వాటితో కూడి నీకు నివాస స్థానమైన శ్రీచక్రం యొక్క కోణాలు నలభై నాలుగు సంఖ్య గలవిగా పరిణమించి వున్నాయి. ఆ భగవతి నాలుగు శివచక్రాలు,ఐదు శక్తి చక్రాలు కలిపి నలభై నాలుగు కోణాలతో అలరారుతూ వుంది 
అని భావం.

Sunday, 19 July 2020

సుధాధారాసారై శ్చరణ యుగళాన్తర్విగళితైః

సుధాధారాసారై శ్చరణ యుగళాన్తర్విగళితైః
ప్రపంఞ్చం సిఞ్చన్తీ పునరపి రసామ్నాయ మహసః/
అవాప్య స్వాంభూమిం భుజగనిభనధ్యుష్టవలయం
స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుణ్డే కుహరిణి//

ఓ మాతా!తల్లీ!అమ్మా!నీవు త్రిపురసుందరిగా మేమంత పిలుచుకునే కుండలిని శక్తివి.నీ పాదపద్మాల రెంటి మధ్య ప్రదేశం నుంచి స్రవించే అమృత ధారల చేత ఈ ప్రపంచాన్ని తడుపుతావు.అలా తడుపుతూ అమృతతుల్య కాంతి చే చంద్రుణ్ణి,అనగా సహస్రార కుండలిన శివసాయుజ్య మొందే స్థానం,వీడి స్వస్థానమైన మూలాధార చక్రాన్ని మరల ప్రాపించి,సుషమ్న చివరి భాగంలో స్వస్వరూపాన్ని గ్రహించి,సర్పం వలె చుట్ట చుట్టుకొని కుండలినీ శక్తిలా  నిద్రిస్తావు.అది నాకే సాధ్యం తల్లీ!

Saturday, 18 July 2020

మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం

మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం
స్థితం స్వాధిష్ఠానే హృది మరుత మాకాశ ముపరి/
మనోఽపి భ్రూమధ్యే సకలమపి భిత్త్వా కులపథం
సహస్రారే పద్మే సహ రహసి పత్యా విహరసే//9//

ఓ తల్లీ!మాతా!అమ్మా!భగవతీ!నీవు మూలాధారం లో వున్న పృథివీతత్త్వాన్ని,మణిపూర చక్రం లో వున్న ఉదక తత్త్వాన్ని,స్వాధిష్ఠాన చక్రం లోని అగ్ని తత్త్వాన్ని,అనాహత చక్రంలోని వాయు తత్త్వాన్ని,అంతకు పైన వుండే విశుద్ధ చక్రంలోని ఆకాశ తత్త్వాన్ని,కనుబొమల నడుమనుండే ఆజ్ఞా చక్రం లోని మనస్తత్త్వాన్ని వదిలి,సుషుమ్నా మార్గాన్ని ఛేదించుకొని సహస్రార కమలం లోని నీ పతి అయిన ఆ సదాశివుడితో జత కలిసి రహస్యంగా విహరిస్తున్నావు.

సౌందర్య లహరి...సుధాసిన్ధోర్మధ్యే సురవిటపివాటీపరివృతే

సుధాసిన్ధోర్మధ్యే సురవిటపివాటీపరివృతే
మణిద్వీపే నీపోపవనవతి చిన్తామణిగృహే/
శివాకారే మఞ్చే పరమశివ పర్యఙ్కనిలయామ్
భజన్తి త్వాం ధన్యాస కతిచన చిదానందలహరీమ్//8//

అమ్మా!తల్లీ!మాతా!నీవు పాలకడలి నడుమ వుండే రత్నాల దీవిలో వుంటావు.అక్కడ అంతా కల్ప వృక్షాల వరుసలు వుంటాయి.ఆ లోపల కదంబ చెట్ల పూదోటలు వుంటాయి.వాటి మధ్యలో చింతామణులతో నిర్మింపబడిన నీ గృహం వుంటుంది.ఆ గృహంలో నీవు పరమ శివుని పర్యఙ్కనిలయవై వుంటావు.అంతేనా?అలా మంగళ రూపమైన త్రికోణపు పాన్పు పైన నిరంతరమూ నిరతిశయానంద ప్రవాహ స్వరూపిణివి అయిన నిన్ను కొందరు ధన్యులు మాత్రమే సేవిస్తున్నారు.జగన్మాతా!అందరికీ నిన్ను సేవించే అదృష్టం లభించదు కదా!

Tuesday, 7 July 2020

క్వణాత్కాఞ్చీదామా కరికలభ కుంభస్తననతా

క్వణత్కాఞ్చీదామా కరికలభ కుంభస్తననతా
పరిక్షీణామధ్యే పరిణత శరచ్చంద్రవదనా/
ధనుర్బాణాన్ పాశం సృణి మపి దధానా కరతలైః
పురస్తా దాస్తాం నః పురమథితు రాహోపురుషికా//

ఓ మాతా!తల్లీ!అమ్మా!నీవు గణగణమని మ్రోగుతున్న చిరు గంటలతో కూడిన మొలనూలు కలదానివి.గున్న ఏనుగు కుంభస్థలాలతో పోటీ వచ్చే కుచముల భారంచే కాస్త ముందుకు వంగిన దానివి.సన్నని నడుము కలదానివి.నీవు శరత్కాల పూర్ణచంద్రుడి వంటి నగుమోము కలదానివి.నీ చేతులలో చెరకు వింటిని,పుష్పబాణాలను,పాశాన్ని,అంకుశాన్ని ధరించిన దానివి.త్రిపురాలను మట్టు పెట్టిన ఆ శివుని శౌర్యస్వరూపానివి అయిన భగవతీదేవీ మా ఎదుట సుఖాసీనయై ప్రత్యక్షమగుగాక.ఇదే తల్లీ మా కోరిక.

Sunday, 5 July 2020

ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః

ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః
వసన్త స్సామంతో మలయమరు దాయోధన రథః/
తథాఽప్యేకస్సర్వం హిమగిరిసుతే కామపి కృపామ్
అపాఙ్గాత్తే లబ్ధ్వా జగదిద మనఙ్గో విజయతే//6//
ఓ మాతా!తల్లీ!అమ్మా!హిమగిరి తనయ!మన్మథుడి విల్లు పువ్వులతో తయారయి వుంటుంది.వింటినారి ఏమో తుమ్మెదలువరస కట్టినట్లు వుంటుంది.అతని అంబుల పొదిలో పువ్వులతో తయారు అయిన ఐదు బాణాలు వుంటాయి.కాలానికి బద్దుడై మరల మరల వచ్చే వసంత ఋతువు అతనికి సామంతుడు.మన్మథుడు యుద్ధానికి తీసుకెళ్లే రథం ఎల్ల వేళలా కదిలే,రూపం లేని మలయ మారుతం.ఇలా ఏ ఒక్కటీ పనికిరాని పరికరాలు,సామగ్రి వుండే మన్మథుడికి అసలు రూపమనేదే లేదాయె.శరీర ధారుఢ్యం వుండే వాడు కాదు.ఇన్ని లొసుగులు వున్నా అతను నిన్ను ఆరాధించి,నీ కడకంటి కటాక్షంతో ఈ సమస్త జగత్తునే తన గుప్పిట్లో పెట్టుకుంటున్నాడు.అదంతా నీ చలవే కదా!

Friday, 3 July 2020

సౌందర్య లహరి శ్లోకము 5 హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీమ్

హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీమ్
పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్/
స్మరోఽపి త్వాం నత్వా రతినయన లేహ్యేన వపుషా
మునీనా మప్యంతః ప్రభవతి హి మోహాయ మహతామ్//
ఓ జగన్మాతా! తల్లీ!అమ్మా!నువ్వు నీకు మ్రొక్కే భక్తులకు సకల సౌభాగ్యాలు ప్రసాదిస్తావు.అలాంటి నిన్ను ఆరాధించి మునుపు శ్రీహరి సుందరాంగిగా మారి,త్రిపురాలను ధ్వంసం చేసి క్రోధాగ్నిలో ఉండే శివుడి మనసులో కామావికారాన్ని కలిగించి క్షోభ పెట్టగలిగాడు.అట్లాగే మన్మథుడు కూడా నిన్ను కొలిచాడు.ధానికి ఫలంగా తన సతి రతీదేవి కన్నులను రంజింపచేసే సౌందర్యాన్ని పొందాడు.అంతేనా!ఆ కళ్ళు చెదిరే సుందరమయిన రూపంతో అడవులలో తపస్సు చేసుకొనే మునుల మనసులలో కూడా కామాభిలాష కలిగించటంలో సమర్థుడైనాడు.ఔరౌరా!నీ ప్రసాద మహిమ అద్భుతం తల్లీ!

Thursday, 2 July 2020

సౌందర్య లహరి శ్లోకము..4

త్వదన్యః పాణిభ్యా మభయవరదో దైవతగణః
త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయా/
భయాత్త్రాతుం దాతుం ఫలమపిచ వాఞ్చాసమధికం
శరణ్యే లోకానాం తవహిచరణా వేవ నిపుణౌ//

ఓ మాతా!తల్లీ!అమ్మా!ఇంద్రుడు మొదలైన దేవతా గణాలు మొత్తం వారి వారి హస్తాలలో అభయ వర ముద్రలను పెట్టుకొని అందరికీ వరాలను,అభయాన్ని ప్రసాదిస్తున్నారు.కానీ నీవు మటుకు అలా వర,అభయ ముద్రలను పెట్టుకొని కనిపించవు.దానికి కారణం నాకు తెలుసు.ఓ అంబా!భగవతీ!లోకజననీ!భక్తులను వాళ్ళ భయాలనుంచి రక్షించేదానికి,వాళ్ళు కోరే కోర్కెలకన్నా ఎక్కువ ఫలం,ఫలితం ఇచ్చేదానికి ఆడంబరాలు అవసరం లేదని నీ ఉద్దేశం.మా లాటి భక్తులకు ఏ ఆడంబరములు,బాహ్య ప్రదర్శన లేని నీ పాదకమలములు చాలు.

Wednesday, 1 July 2020

సౌందర్య లహరి...శ్లోకము..3 అవిద్యానా మన్తస్తిమిర మిహిరద్వీపనగరీ

అవిద్యానా మన్తస్తిమిర మిహిరద్వీపనగరీ
జడానాం చైతన్యస్తబక మకరంద స్రుతి ఝరీ/
దరిద్రాణాం చిన్తామణిగుణనికా జన్మజలధౌ
నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి//3//

ఓ అమ్మా!తల్లీ!మాతా!నీ పాదరేణువు అజ్ఞానులకు,మూర్ఖులకు తామసమనే చీకటిని పారద్రోలే సూర్యద్వీపనగరము.ఆ నీ పాదలేశం మందబుద్ధులకు,చైతన్యంలేని జడులకు జ్ఞానమనే మకరందాన్ని జాలువార్చే నిర్మల ప్రవాహము.లేమి చేత కుంగిపోయే దరిద్రులకు సకల సంపదలనిచ్చే చింతామణుల శ్రేణి.ఇవన్నీ కాకుండా చావు పుట్టుకలు కలగలసిన సంసారరూపమయిన సాగరంలో మునిగి తేలే వాళ్ళకి,ఒడ్డు కనిపించక,కానరాక తబ్బిబ్బు అయ్యే వాళ్ళకి శ్రీమహావిష్ణువు అవతారమైన ఆదివరాహస్వామి యొక్క కోర అవుతుంది.అంటే సగటు మానవులను ఉద్ధరించే ఆసరా అవుతుంది.ఈ సంసార సాగరాన్ని తరింప చేస్తుంది అని భావన.