devunislokalu
Sunday, 9 August 2026
కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వరా
కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వరా అను దివ్యనామము శ్రీ లలితా సహస్ర నామావళిలో అమ్మవారికి పెట్టబడిన డెబ్బై ఏడవ నామము.
అమ్మవారు భండాసురుని సంహారమునకు బయలుదేరింది.సమరం భీకరంగా సాగుతున్నది.భండుడి సోదరుడు అయిన విశుక్రుడు జయవిఘ్నము అనే యంత్రాన్ని ప్రయోగించాడు.దానిని ఎలా ఛేదించాలో,ఇంకెలా భేదించాలో ఒక్క క్షణం అర్థం కాలేదు.శత్రువు సంధించిన జయవిఘ్నము నాశనము చేయాలంటే విఘ్న నాశనము జరగాలి.అంటే విఘ్న నాశకుడు కావాలి.అప్పుడు జగన్మాత చిరునగవుతో కామేశుని చూసింది.తక్షణం ఆమె ఒడిలోకి బాలగణేశుడు ఉద్భవించాడు.అంత కంటే విఘ్న నాయకుడు ఇంకెక్కడ దొరుకుతాడు?ఒక్కడు చాలు అన్నట్లు మహా గణేశుడు జయవిఘ్న యంత్రాన్ని నామరూపాలు లేకుండా చేసాడు.
విశుక్రుడు శక్తి సేనల మధ్యలో జయవిఘ్నము అనే శిలా యంత్రాన్ని ప్రతిష్టించాడు కదా!దాని విశిష్టతలు తెలుసుకుందాము.ఆ యంత్రానికి అష్ట దిక్కులు ఉన్నాయి.ప్రతి దిక్కుకూ కోణములు ఉన్నాయి.ప్రతి కోణములోనూ విశుక్రుడు పాతిన శూలములు ఉన్నాయి.ఆ ఎనిమిది దిక్కులలో ఉండే ప్రతి శూలానికీ ఒక్కొక్క శక్తిని ఆవాహనం చేసాడు.ఆ శక్తులు...అలసా,కృపణా,దీనా,నిద్రా,తంద్రా,ప్రమీలికా,క్లీబామరియు నిరహంకారా.వీటి ప్రభావం వలన శక్తి సైన్యానికి కళ్ళు బైర్లు కమ్మాయి.నిద్ర లాగా మగత వచ్చింది.పిరికితనం ఆవహించింది.అందరూ చతికిల బడ్డారు.శక్తి సేన మొత్తమూ చైతన్యరహితమయిపోయింది.నిర్వీర్యమయింది.వారికి ఇంక యుద్ధం చేయాలనే ఆసక్తే పూర్తిగా చచ్చిపోయింది.ఈ విషయం గమనించిన వారాహీ,శ్యామల అమ్మవారికి తెలియ చేసారు.అప్పుడు ఇంక జగన్మాత అవలోకనం చేసుకుంది.గట్టిగా బుద్ధి చెప్పకపోతే శత్రువు ఇలానే తోక ఆడిస్తుంటాడని.అప్పుడు అమ్మవారు కామేశుని క్రీగంటితో,చిరు నవ్వుతో చూసింది.ఇంకేముంది.మన బొజ్జ వినాయకుడు బుజ్జి పాపాయి లాగా అమ్మ ఒడి చేరాడు.ఆ తల్లికి బుజ్జివాడే!కానీ నిజానికి పొట్టి వాడు,పొట్టవాడు,గట్టివాడు,గజాననుడు గజగజలాడించాడు శత్రుమూకలను.పెద్ద పెద్ద చెవులతో,చిన్న చిన్న కన్నులతో,వక్ర తుండముతో ఉన్నాడు.రక్త వర్ణముతో,పది చేతులతో రక్త హీనులను చేసాడు భండుడి సేనలను.ఆ గణేశుడు బ్రహ్మాండమంతటి వాడు,బ్రహ్మాండాలనే అబ్బురపరిచే విధంగా బల్ రణం కావించాడు.ఇంతకీ ఆ గణపతి ఎవరు?అతని ఔన్నత్యం ఏంది?అతను షట్చక్రములలో మూలాధారమందు ఉండే మూలకారకుడు.కుండలినీ శక్తిని ఊర్థ్వ ముఖంగా పయనింపచేసేవాడు.అతడు పృథివీ తత్త్వాత్మకుడు.సర్వ మంత్రాలలోనూ గురు వందనం తరువాత ఆహ్వానింపబడేవాడు.సర్వ పూజలకూ,సర్వ కార్యములకూ తొలి పూజలు అందుకునేవాడు.అతను దైవ పంచాయతనములలో ఒకడు.ఇన్ని శక్తులు ఉన్న మన బొజ్జ గణపయ్యను ఆ తల్లి ఆవిర్భవింపచేసింది.మన బుజ్జి గణేశు తల్లి మాట కాదనగలడా!రణరంగంలో వీర విహారం చేసాడు.విశుక్రుడు ప్రతిష్టించిన జయ విఘ్న యంత్రాన్నీ,దాని అష్ట దిక్కులందు ఉండే శూలాలనూ తుత్తునియలు చేసాడు.ఆ శూలములపైన ఆహ్వానింపబడిన క్షుద్ర దేవతలను నామరూపాలు లేకుండా సర్వ నాశనము చేసాడు.
Saturday, 8 August 2026
విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్య నందితా
విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్య నందితా అను అద్వితీయ నామము అమ్మవారికి శ్రీ లలితా సహస్ర నామావళిలో డెబ్బై ఆరవ నామముగా చెప్పబడినది.భండాసురుడికి ఇద్దరు సోదరులు ఉన్నారు.వారు అతని బాహువుల నుంచి ఉద్భవించారు.అతనికి నిజంగానే కుడి,ఎడమ భుజాలలాగానే ఇరు వైపులా ఉంటారు.అతనికి రక్షకులుగా,సేనా నాయకులుగా ఉంటారు.వారే విషంగుడు,విశుక్రుడు.వారాహీ దేవి అమ్మవారి సేనాని కదా!ఆమె విశుక్రుని హతమార్చింది.ఆ ఘటన,సంఘటన జరిగేటప్పుడు ఆమె చూపిన పరాక్రమము అంతా ఇంతా కాదు.అమ్మవారు ముగ్ధురాలు అయి చూసింది.మహదానందపడిపోయింది.
మనలో శుక్ర ధాతువు ఉంటుంది కదా!అది కామోద్రేకాన్ని ప్రేరేపిస్తుంది.ఇక్కడ విశుక్రుడు శుక్రధాతువు లాంటి వాడు.వారాహీ దేవి వాడిని నామరూపాలు లేకుండా చేసింది అంటే అర్థం ఏంది?ఆ తల్లి మనలో ఉండే కామాన్ని కూడా రూపుమాపుతుంది అని.కామాన్ని పక్కన పెట్టిన తరువాతే మానవుడు దేవుడు,దైవము గురించి ఆలోచించగలతాడు.సప్త మాతృకలలో వారాహీ దేవి ఒక దేవత.మిగిలిన వారు బ్రాహ్మి,మాహేశ్వరి,కౌమారి,వైష్ణవి,మాహేంద్రి మరియు చాముండి.
Tuesday, 4 August 2026
మంత్రిణ్యంబా విరచిత విషంగ వధ తోషితా
మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషితా అను దివ్య నామము అమ్మవారికి శ్రీ లలితా సహస్ర నామావళిలో డెబ్బై అయిదవ నామముగా చెప్పబడినది.
భండాసురుడికి ఇద్దరు సోదరులు ఉన్నారు.వారు విషంగుడు మరియు విశుక్రుడు.అమ్మవారి మంత్రిణి అయిన శ్యామలా దేవి,(రాజ శ్యామలా)విషంగుడిని సంహరించింది.ఆ దృశ్యము చూసి అమ్మవారు అమితంగా సంతోషపడింది.
రాక్షసులు అంటే విషయాసక్తులు,అజ్ఞానులు.అరిషడ్వర్గాలకు ప్రతిరూపాలు.లేకుంటే వారు తపోబల సంపన్నులు,మహాబలవంతులు.ప్రవృత్తి రూపేణా రక్కసులు అయ్యారు.విషంగుడు అంటే విషయలాలసానికి,విషయలంపటం జోడించి,రెచ్చగొట్టేవాడు.విషయలంపటం అంటే ఏముంది?క్రోథ,లోభ,మోహ,మద,మాత్సర్యాలే కదా!ఈ లంపటాన్ని ఛేదించగల శక్తి ఉండేది మన రాజశ్యామలా దేవికే!కాబట్టే మహానిత్యా ఆమెను పంపింది అరిషడ్వర్గ సంహారానికి.
Sunday, 2 August 2026
భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందితా
భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందితా అను అద్భుత నామము అమ్మవారికి శ్రీ సలితా సహస్ర నామావళిలో డెబ్బై నాలుగవ నామముగా చెప్పబడినది.భండుడికి ముప్పై మంది కుమారులు ఉన్నారు.వారందరూ కూడా తమ తండ్రి తరఫున యుద్ధంలో పాల్గొన్నారు.వారందరూ మూకమ్ముడిగా అమ్మవారి పైకి దూసుకొచ్చారు.అప్పుడు అమ్మ తన అంశం నుండి తొమ్మిది సంవత్సరాల బాలా త్రిపుర సుందరిని ఉద్భవింపచేసింది.ఆ బాలను భండుడి కొడుకులతో పోరు సల్పమని ఆదేశించింది.అప్పుడు ఆ బాలా కుమారి అయిన బాలా త్రిపుర సుందరి మహాత్రిపుర సుందరి ఇచ్చిన రథం ఎక్కింది.సర్వాయుథ పరిష్కృత అయింది.అమ్మకు ఎన్ని శక్తులు ఉన్నాయో బిడ్డకు కూడా అన్నీ శక్తులు ఉన్నాయి.ఇంక చండ ప్రచండంగా యుద్ధభూమిలోకి అడుగు పెట్టింది.ఎత్తిన కరవాలం దించకుండా,భండుని సైన్యాన్ని దాటింది.సుడిగాలి లాగా భండుడి పుత్రులను ఏరిపారేసింది.ఆమె అలా వారిని దునుముతూ,తుత్తినియలు చేస్తుంటే...।అమ్మవారి ఆనందానికి అంతమే లేకుండా పోయింది.అమ్మవారి ఆనందానికి ఆకాశపుటంచులు కూడా హద్దులు కాలేక చిన్నబుచ్చుకున్నాయి.
భండుని పుత్రులు...చతుర్బాహువు,చకోరాక్షుడు,చతుశిరస్కుడు, వజ్రఘోషుడు,ఊర్థ్వకేసుడు,మహాకాయుడు,మహాహనువు,ముఖశత్రువు,మఖస్కందుడు,సింహఘోషుడు,విరాలకుడు,లశునుడు,కుట్టిశేనుడు,పురజిత్తు,పూర్యరనూకుడు,సర్గశత్రువు,ఇంద్రశత్రువు,అమీత్రకుడు,విద్యున్మాలి,ఉగ్రకర్మ,ఉగ్రధన్వా, స్వర్గపీడుడు,దుర్గుడు,స్వర్గకంటకుడు,అతిమాయుడు,బృహన్నాయుడు,విభీషణుడు,శృతిపారగుడు,విదురుడు మరియు ఉపమాయువు.
Friday, 31 July 2026
నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా
నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా అను అద్భుతమయిన నామము అమ్మవారికి శ్రీ లలితా సహస్ర నామావళిలోని డెబ్బై మూడవ నామముగా చెప్పబడినది.అమ్మవారికి పదహేను మంది నిత్యా దేవతలు,అదే తిథి దేవతలు ఉన్నారు కదా.వారందరూ భండాసుర సంహారనికి ఉద్యమించారు వసతమ తమ శక్తి సేనలతో.అట్టి వారి పరాక్రమా పాటవాలను వీక్షించుచున్నది మన అమ్మవారు.వారి శక్తి యుక్తులు చూసి మురిసిపోతున్నది.మనసు నందు సంతోషం ఉత్తేజితమవుతున్నది.అమ్మవారి సైన్యంలో జ్వాలామాలిని,వహ్వివాసినీ ఉన్నారు కదా!వారు నిత్యమూ ప్రకాశిస్తూ ఉంటారు.రాక్షసి మూకలు రాత్రుళ్ళు విజృంభిస్తారు కదా!కానీ అమ్మవారి సైన్యాలు ఆ తీకటిలో కూడా వారిని గుర్తించి,చీకటిని కడిగేసినట్లు శుభ్రం చేసేస్తారు.వాళ్ళను నామరూపాలు లేకుండా చేస్తారు.
భండాసురుని సేనాపతులు పదహేను మంది.వారు...దమనక,దీర్ఘజిహ్వ,హబక,హలుమల్ల,కక్లన,కల్లివాహన,ధుక్లన,పుత్రకేతు,చంద్రబాహు,కుక్కుర,జంబుకాక్ష,కుంభగ,తీక్షశృంగ,త్రికంటక మరియు చంద్రగుప్త.
వీరినందరినీ మన నిత్యా దేవతలు సంహరించేటప్పుడు చూపిన పరాక్రమాటోపానికి మన అమ్మవారు మహదానందభరితురాలు అయింది.కాబట్టి ఆ తల్లికి ఈ పేరు సముచితంగా ఉన్నది.
Thursday, 30 July 2026
భండసైన్య వధోద్యుక్త శక్తివిక్రమ హర్షితా
భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షితా అను దివ్యప్రదమయిన నామము అమ్మవారికి శ్రీ లలితా సహస్ర నామావళిలో డెబ్బై రెండవ నామముగా చెప్పబడినది.
అమ్మవారు యుద్ధానికి సిద్ధము అయింది.రణ రంగములో భండుని చూసింది.అతని సైన్యాన్నీ తేరిపార చూసింది.ఆ దుష్ట మూకల అంతు చూసేదానికి ఉరకలు వేసే ఉత్సాహంతో,ఉద్యుక్తులు అయిన తన శక్తి సైన్యాన్నీ,వారి బల పరాక్రమాన్నీ చూసి ఆనందభరితురాలు అయింది.అందుకనే ఈ నామము చాలా దివ్యంగా అబ్బింది.
భండుడు అసురుడు.బండవాడు.అజ్ఞానానికి మారు పేరు.జీవాత్మ వేరు,పరమాత్మ వేరు అనుకుంటాడు.దానికి తోడు కృూరుడు,కుసంస్కారి!రాక్షసుడు కాబట్టి సహజంగానే అసుర ప్రవృత్తి గలవాడు.మూర్ఖులకు నేనే గొప్ప అనే అహంభావం ఎక్కువ ఉంటుంది కదా!వీడు అందులో ఎక్కడా తీసిపోడు.ఎంత అహంభావము అంటే పాంచ భౌతిక శరీరమే నేను అనుకునేటంత!అరిషడ్వర్గములకు దాసోహం అయినవాడు.ఈ జగత్తు,ఈ శరీరమే నిత్యమూ,సత్యమూ అని నమ్మిన మూర్ఖుడు.యథా రాజా తథా ప్రజా అని అంటారు కదా.రాజే అలా ఉంటే అతని ప్రజలు ఇంకెంత ఘనాపాటులు అయి ఉంటారో,మనం ఊహించుకోవచ్చు.
అరిషడ్వర్గాలు అంటే కామ,క్రోథ,మోహ,మద,లోభ,మాత్సర్యాలు.ద్వైదీభావన అంటే జీవుడు,దేవుడు వేరు వేరు అనుకోవడం.అహంభావము అంటే అంతా నేనే,నేను అంటే ఈ శరీరమే అనుకోవడము.ఇప్పుడు ఇలాంటి బాహ్యవృత్తులను నశింపచేయాలి.ఆ భావనలతో పూర్తిగా కలుషితమయిన మనసును పాప ప్రక్షాళనము చేయాలి.అప్పుడు కానీ స్వస్వరూప జ్ఞానము,ఆత్మ సాక్షాత్కారము పొందలేరు.అది పూర్తి అయితేనే జ్ఞాని మోక్షము సంపాదించుకోగలతాడు.
అందుకే భండుడు అనే బాహ్యప్రవృత్తిని నాశనము చేసేదానికి పరమేశ్వరి సైన్యము అనే అద్వైత శక్తులు ఉద్యుక్తులు అయి రంగంలోకి దిగాయి.ఆ సేనలను చూసి పాప ప్రక్షాళన జరుగుతుంది ఇక అని అమ్మవారి మనసు హర్షాతిరేకముతో నిండిపోయింది.
Wednesday, 29 July 2026
జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా
జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా అను అతి సుందర నామము అమ్మవారికి శ్రీ లలితా సహస్ర నామావళిలో డెబ్బై ఒకటవ నామముగా చెప్పబడినది.
అగ్ని దేవుని పుత్రిక జ్వాలామాలిని.ఆమె శుక్లపక్ష చతుర్దశీ తిథి దేవత.ఆమె చేత వెలిగింపబడిన వహ్ని ప్రాకారము మధ్యలో మన అమ్మవారు ప్రకాశిస్తూ,ఆసీనురాలై ఉంటుంది.ఆమె తిథులకు సంబంధించిన నిత్యా దేవతలలో శుద్ధ చతుర్దశీ తిథికీ మరియు కృష్ణ పక్ష విదియ తిథికీ చెందినది.
నిత్యా దేవతలు పదహారు మంది.చంద్రుని కళలు పదహారు.పదిహేను తిథులకు పదిహేను నిత్యలు ఉన్నారు.పదహారవ కళ మహానిత్య.ఆమె పరమేశ్వరి.
వారు..
తిథి........శుక్ల పక్షము....కృష్ణ పక్షము...
పాడ్యమి......కామేశ్వరి.....చిత్రా,
విదియ....భగమాలిని.....।।।జ్వాలా మాలిని,
తదియ...।।నిత్య క్లిన్నా.।।।।।....సర్వ మంగళా,
చవితి......భేరుండా........విజయా,
పంచమి....వహ్నివాసినీ...నీలపతాకా,
షష్టి......మహా వజ్రేశ్వరీ......నిత్యా,
సప్తమి....శివదూతీ...కుల సుందరీ,
అష్టమి...త్వరతా....త్వరితా,
నవమి...।।।కుల సుందరీ....శివదూతీ,
దశమి....నిత్యా.....మహా వజ్రేశ్వరి,
ఏకాదశి...నీలపతాకా...వహ్నివాసిని,
ద్వాదశి....।విజయ....।।భేరుండా,
త్రయోదశి.....సర్వ మంగళా...నిత్యక్లిన్నా,
చతుర్దశి....జ్వాలామాలిని...భగమాలిని మరియు
పూర్ణిమ...చిత్రా..........కామేశ్వరి.
జ్వాలామాలిని అగ్ని స్వరూపురాలు.తాకితే భస్మమయిపోవడమే,దాటిపోయే ప్రసక్తే లేదు.అందుకే అమ్మవారు భండాసురుడి పైన యుద్ధానికి పోయేటప్పుడు తన సైన్యానికి చుట్టూ వహ్ని ప్రాకారంగా విస్తరించమని జ్వాలామాలినిని ఆదేశించింది.
ఇంక ఇప్పుడు శ్రీచక్రం గురించి చెప్పుకుందాము.శ్రీచక్రంలో శక్తి సంజ్ఞ కలవి ఐదు చక్రాలు,అగ్ని సంజ్ఞ కలవి నాలుగు చక్రాలు ఉంటాయి.ఈ త్రికోణముల కలయికతో ఏర్పడినదే వహ్నిప్రాకారము.మధ్యలో ఉన్న బిందువే పరమేశ్వరి అయిన మన అమ్మ.
Subscribe to:
Posts (Atom)