Wednesday, 24 June 2026

కామాక్షీ

కామాక్షీ అను అమృతతుల్యమయిన నామము అమ్మవారికి శ్రీ లలితా సహస్ర నామావళిలో అరవై రెండవ నామముగా చెప్పబడింది.ఆ తల్లి కరుణామయి.ఆమె అణువణువు భక్తులకొరకు కరుణ,దయ,ప్రేమ,జాలితో నిండి ఉంటాయి.అలాంటిది ఆమె కనుదోయి కరుణారస సాగరాలు కాక ఇంకేమవుతాయి?ఆమె సదా,సర్వదా దయావర్షాన్ని కురిపిస్తూ ఉంటుంది.అక్షములు అంటే కళ్ళు.ఆమె తన అందమయిన,దయార్ద్ర దృష్టి గల నయనాలతో మన అందరి కామనలను తీరుస్తుంది.అందుకే కామాక్షి అనే నామము ఆమెకు బహు సొబగు కూరుస్తున్నది. శ్రీమాత ఆవిర్భావ కాలమున అగ్ని దేవుని తేజస్సుతో నేత్రములు కలిగాయి.అమ్మవారి కుడి నేత్రము ఇ కారము-అధిష్ఠాన దేవత ఇంద్రుడు,ఎడమ నేత్రము ఈ కారము-అధిష్ఠాన దేవత విరాట్పురుషుడు.మరి ఆమె కామాక్షి కాకుండా ఎలాఉంటుంది?ఆమె కన్నులు మీనాల లాగా,చంచలంగా ఉంటాయి.ఆమె కనులు మీనాలయితే మరి నీరెక్కడ అని అంటారా?ఆమె వదనమే మనోహరమయిన,శోభాయమానమయిన సరోవరము.ఆమె సౌందర్యమే ఒక పరీవాహము.అక్కడే ఆ మీనద్వయం విహరిస్తుంది.ఆ తల్లి కుడి కన్ను సూర్యుడిలాగ పగలును,ఎడమ కన్ను చంద్రుడి లాగ రాత్రిని కలిగిస్తాయి.ఆమె చూపులు భక్తకోటికి ప్రేమలు,దుష్టశక్తికి క్రోధం చూపిస్తాయి. కామేశ్వరుడు అయిన తన పతిని తన కళ్ళలోనే పెట్టుకుంటుంది.కాబట్టి కామాక్షి అయింది.ఆయనను మోహపూర్తమయిన దృక్కులతో చూస్తుంది,కాబట్టి కామాక్షి అయింది.కాముడినే తన కన్నులుగా గలిగినది,ఈ విశ్వ సృష్టి కోసరము.

Friday, 19 June 2026

సుధా సాగర మధ్యస్థా

సుధా సాగర మధ్యస్థా అను దివ్యమయిన నామము అమ్మవారికి శ్రీలలితా సహస్ర నామావళిలో అరవై ఒకటవ నామముగా చెప్పబడినది.శ్రీ చక్రము నందు కేంద్ర బిందువే సహస్రార కమలము.అదే సుధా సాగరము లేదా అమృత సాగరము.ఆ అమృత సాగరము మధ్యలో అమ్మవారు నివసిస్తుంది కాబట్టి ఆ తల్లికి ఆ పేరు వచ్చినది. బ్రహ్మాండమునకు సంబంథించి అన్నిటికంటే పైన అమృత సాగరము ఉంది.దాని మథ్యలో చింతామణి గృహములో అమ్మవారు ఉంటుంది. పిండాండమునకు సంబంథించి మనవ శరీరము కదా మనము పరిగణలోకి తీసుకుంటాము.ఇక్కడ మానవ శరీరంలో సహస్రార కమల మధ్య కర్ణిక యందు చంద్ర మండలము ఉంది.ఈ చంద్ర మండలము మధ్య ఇంకొక సుధా సాగరము ఉంది.మన అమ్మవారు అక్కడ ఉంటుంది. ఇంక సగుణబ్రహ్మోపాసనాపరులు అపరాజిత అనగా శ్రీమన్నగరము పొందుతారు.అక్కడ అర మరియు ణ్య అనే పేరుతో సముద్రము లాంటి రెండు మడుగులు ఉన్నాయి.ఆ రెండు మడుగుల మధ్యలో అమ్మవారు నివసిస్తారు. మణి ద్వీపానికి సర్వలోకమనే పేరు కూడా ఉంది.దీనికి నాలుగు వైపులా అమృత సాగరము ఉంది.ఈ సముద్రానికి ఇరవై అయిదు ప్రాకారాలు ఉన్నాయి.అవి లోహమయ,కాంస్య,తామ్ర,సీస,ఇత్తడి,పంచలోహ,రజిత,సువర్ణమయ,పుష్పరాగమణి,పద్మ రాగమణి,గోమేథికమణి,వజ్ర,వైఢూర్య,ఇంద్రనీల,ముత్యపు,మరకత,పగడాల,మాణిక్యరత్న,సహస్ర స్తంభ,మనస్సాల,బుద్ధిసాల,అహంకార సాల,సూర్యబింబ సాల,చంద్రబింబ సాల,శృంగార సాల అను ప్రాకారాలు.ఈ ఇరవై అయిదు ప్రాకారాలు పంచ వింశతి తత్త్వములకు ప్రతీకలు.అవి.. పంచ భూతములు...భూమి,జలము,అగ్ని,వాయువు,ఆకాశము, పంచేంద్రియములు...చెవి,చర్మము,కన్ను,నాలుక,ముక్కు, పంచ కర్మేంద్రియములు...నోరు,చేతులు,కాళ్ళు,గుదము,జననేంద్రియము, విషయ పంచకములు...శబ్దము,స్పర్శము,రూపము(ఆకృతి),రసము(రుచి),గంధము(వాసన), అహంకార త్రయము...అహంకారము,బుద్ధి,మహత్తు(అవ్యక్తము), మనస్సు,కాలము లేదా పురుషుడు. కావున అమ్మవారిని సుధా సాగర మధ్యస్థ అనుట ఉచితముగా ఉన్నది.

Wednesday, 17 June 2026

కదంబ వనవాసినీ

కదంబ వన వాసినీ అను మంగళప్రదమయిన శుభనామము అమ్మవారికి శ్రీలలితా సహస్ర నామావళిలో అరవై వ నామము.ఆ తల్లి కదంబ వనమందు నివసిస్తుంది కాబట్టి ఈ నామము చెప్పబడింది. రావి,తులసి,కదంబము,మారేడు,పారిజాతము....వీటిని దేవతా వృక్షములు అని అంటారు.ఇవి శుభకరమయినవి,లక్ష్మీప్రదమయినవి.వీటన్నిటిలోకి కదంబ కుసుమములు అమ్మవారికి ప్రీతికరమయినవి.ఆ కదంబ వృక్షము క్రింద ఉండడం ఆమెకు చాలా ఇష్టము.ఈ పూలు అరుణారుణ వర్ణంలో ఉంటాయి.వీటి కేసరములు పసుపు రంగులో ఉంటాయి.ఆ పవిత్రమయిన కదంబ వనములు ఇప్పుడు లేవు.వీటిని కడిమి వృక్షాలు అని కూడా అంటారు.అమ్మవారు కడిమి వృక్షాల మధ్యలో చింతామణి గృహములో నివసిస్తుంది.

Friday, 12 June 2026

మహా పద్మాటవీ సంస్థా

మహా పద్మాటవీ సంస్థా అను అద్వితీయ నామము అమ్మవారికి శ్రీ లలితా సహస్ర నామావళిలో చెప్పబడిన ఏభై తొమ్మిదవ నామము. మహా మహిమాన్వితమైన షట్చక్రములు అనే పద్మములు ఉన్న వనమునందు నివసిస్తుంది ఆ తల్లి.మహా పద్మము వర్ణన లలితా స్తవరత్నములో చెప్పబడినది.మణిద్వీపము మధ్యలో మహాపద్మముల వనము ఉంది.ఆ మహా పద్మమునకు పది తాడిచెట్లంత పొడవు ఉన్న ఆకులు ఉన్నాయి.ఒక యోజనము ఎత్తు ఉన్న కాడలు ఉన్నాయి.ఐదు తాటి చెట్లంత దట్టమయిన కేసరములతో ఉంది.ఆ మహా పద్మములందు మకరంద ప్రవాహము ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది.ఆ పద్మముల మకరందము,పరిమళము ఆస్వాదించేదానికి తుమ్మెదలు గుంపులు గుంపులుగా వస్తాయి.అక్కడ వీచే మంచి గంథపు పరిమళ వాయువుల తాకిడికి పసుపు పచ్చని పుప్పొడి పైకి లేచి,ఆ ప్రదేశము మొత్తమూ పింజరవర్ణ శోభితంగా ఉంది. ఇంక పిండాండము విషయానికి వస్తే శరీరమే ఒక శ్రీచక్రము. సప్త చక్రములు (సహస్రారముతో)-సప్త పద్మములు(సహస్రార పద్మముతో) ఈ శరీరమే ఒక పద్మాటవి అంటారు.షట్చక్రములు,డెబ్బై రెండు నాడులు కలసి మహా పద్మములు అవుతాయి.ఇందు బ్రహ్మ రంధ్రము నందలి సహస్రార కమలములో శ్రీదేవి విరాజిల్లుతూ ఉంటుంది. బ్రహ్మ రంధ్రమునకు అధోముఖముగ సహస్రదళములతో సహస్రార పద్మము వికసించి యుంటుంది.సహస్రార పద్మమునకు ఎనిమిది దళములు ఉంటాయి.ఒక్కొక్క దళమునకు నూట ఇరవై అయిదు దళములు ఉంటాయి.కాబట్టి మొత్తమూ వేయి దళములు అవుతాయి.అందుకే అమ్మవారిని మహాపద్మాటవీ సంస్థా అని అన్నారు.

Thursday, 11 June 2026

పంచ బ్రహ్మాసన స్థితా

పంచ బ్రహ్మాసన స్థితా అను పవిత్రమయిన నామము అమ్మవారికి శ్రీ లలితా సహస్ర నామావళిలో ఏభై ఎనిమిదవ నామముగా చెప్పబడింది. బ్రహ్మ,విష్ణువు,రుద్ర,ఈశాన,సదాశివులు పంచ బ్రహ్మలు అని అంటరు.వీరిని ఐదుగురినీ తన ఆసనంగా స్వీకరించింది ఆ తల్లి.వీరిలో మొదటి నలుగురు మంచపు కోళ్ళు,సదాశివుడు ఆ మంచానికి పానుపు.అమ్మవారు చింతామణులచే నిర్మింప బడిన గృహములో కూర్చునే ఆసనానికి కోళ్ళుగా...।ఆగ్నేయం వైపున చతుర్ముఖ బ్రహ్మ,నైరుతి దిక్కుగా ఉండే కోడుగా శ్రీ మహా విష్ణువు,వాయువ్యంలో ఉండే కోడుగా రుద్రుడు,ఈశాన్యంలో ఉండే కోడుగా ఈశ్వరుడు ఉంటారు.ఈ నాలుగు కోళ్ళను కలుపుతూ ఒక పర్యంకం.దాని పైన అచ్ఛాదనగా సదాశివుడు ఉంటాడు.అందుకే ఆ తల్లిని పంచ బ్రహ్మాసన స్థితా అను నామకరణం జరిగింది.ఆ పర్యంకం పైన పదహారు వత్సరాల నవ మన్మథుడిలాగా ప్రకాశిస్తున్న మహా కామేశ్వరుడు తన ఎడమ తొడపైన అమ్మవారిని కూర్చుని పెట్టుకుని ఉంటాడు. అమ్మవారి మంచం కోళ్ళుగా ఉండే బ్రహ్మ సృష్టి చేస్తాడు.శ్రీ మహా విష్ణువు స్థితి కారకుడు.రుద్రుడు లయ కారకుడు.తిరోధానము,అనుగ్రహము అను ఉన్నాయి.తిరోధానము అంటే కనబడకుండా చెయ్యడం.అంటే మాయే కదా!ఈ మాయే ఈశ్వరుడు. శివుడు తెల్లని కాంతి అనే మిషతో ఆమెకు దుప్పటి లాగ అయ్యాడు.అమ్మవారి శరీరం రాగరంజితము కదా!ఆ తెల్లని దుప్పటి కూడా ఎర్రబారి,శృంగార రసము ఒలకబోస్తుంది అట! ఇదే కాకుండా తూర్పు,దక్షిణము,పడమర,ఉత్తరము,ఊర్ధ్వ దిశలు కూడా పంచ బ్రహ్మలు అని అంటారు.అలాగే పంచ భూతాలు అయిన పృథ్వి,జలము,ఆకాశము,అగ్ని,వాయువులను కూడా పంచ బ్రహ్మలు అని అంటారు.హల్లులలో క-చ-ట-త-ప లను కూడా పంచ బ్రహ్మలని అంటారు. ఆఖరుగా సద్యోజాతము,వామదేవము,అఘోరము,తత్పురుషము,ఈశానము అనే ఐదుగురు శివాకార మంచము అని అంటారు. శ్రీచక్రము నందు ఐదు శక్తి చక్రములు,నాలుగు శివ చక్రములు ఉన్నాయి.ఆ ఐదు శక్తి చక్రములనే పంచ బ్రహ్మలు అని అంటారు.వాటన్నిటి మధ్యలో ఆసీనమయి ఉండే బిందువే పరమేశ్వరి.

Wednesday, 10 June 2026

చింతామణి గృహాంతస్థా

చింతామణి గృహాంతస్థా అను అందమయిన నామము అమ్మవారికి శ్రీ లలితా సహస్ర నామావళిలో ఏభై ఏడవ నామముగా చెప్పబడినది. అమ్మ చింతామణులచే నిర్మింపబడిన గృహంలో విరాజిల్లుతున్నది.చింతామణి అనేది ఒక రత్నము.అది ఒక్కటి ఉంటేనే ఎన్నో కోరికలు తీరుస్తుంది.అలాంటిది,ఆ మణులతోటే గృహము మొత్తం నిర్మింపబడింది అంటే ఇంకెలా ఉంటుంది? మానవుని శరీరంలో చింతామణి గృహం సహస్రారంలో ఉంటుంది.ఆ సాథన చేసేవాడు మూలాథారం నుండి సహస్రారంకు చేరుకుంటే అన్ని చింతలకూ ముక్తాయింపు చెప్పినట్లే!అతను నిష్కాముడై బ్రహ్మత్వానికి చేరుకుంటాడు. చింతామణి గృహము నవరత్న ప్రాకారానికి మధ్యలో ఉంటుంది.అందులో నాలుగు మండపాలు ఉంటాయి.ప్రతి మండపమూ వేయి స్తంభాలతో ఉంటుంది.మొదటిది శృంగార మండపము,రెండవది ముక్తి మండపము,మూడవది జ్ఞాన మండపము,నాల్గవది ఏకాంత మండపము.అన్ని మండపాలూ కోటి సూర్య ప్రభలతో,సర్వాంగ సుందరంగా ఉంటాయి.చింతామణి గృహమునే శ్రీచక్రంలో బిందు మండలము అంటారు. మూలాధారగత కుండలినీ శక్తి జాగృతమై బిందు మండలము చేరితే ఉపాసకుడు జగన్మాత దరికి చేరుకున్నట్లే!అంటే సంకల్ప సిద్ధుడు అవుతాడు.అదే చింతామణి తత్త్వము.అంటే జీవుడు సమూలంగా చింతలకు దూరమవుతాడు.బ్రహ్మానందభరితుడు అవుతాడు.అంతటితో అతను నిష్కాముడు అవుతాడు.అమ్మవారు మనలను అలా ముక్తి మార్గంలోకి పంపిస్తుంది. కల్ప వృక్షం అంటే చింతామణితో కూడిన సంకల్పము.కామథేనువు అంటే చింతామణితో కూడిన వాక్కు.అలాంటి సంకల్పము,అలాంటి వాక్కు ఆ తల్లి భక్తుడికి కానుకగా ప్రసాదిస్తుంది.

Sunday, 7 June 2026

శ్రీమన్నగర నాయికా

శ్రీమన్నగర నాయికా అను పవిత్రమయిన శుభ నామము అమ్మ వారికి శ్రీ లలితా సహస్ర నామావళిలో చెప్పబడిన ఏభై ఆరవ నామము. శ్రీ చక్రమే శ్రీ విద్యా నగరమై,శుభ ప్రదమై,అష్చైశ్వర్యాలతో కూడి శ్రీమన్నగరముగా విరాజిల్లుతుంది.అట్లాంటి శ్రీమన్నగరమునకు అథిష్ఠాత్రి అయిన మాతకు శ్రీమన్నగర నాయికా అని చెప్పడం బహు బాగుగా ఉన్నది. మేరు పర్వతము త్రికోణాకారంలో ఉంటుంది.దాని మూడు శిఖరాలలో తూర్పు శిఖరము బ్రహ్మకు,నైరుతీ శిఖరము విష్ణువుకు,వాయువ్య శిఖరము మహేశ్వరునికి నిలయములు.వాటినే ఇచ్ఛాశక్తి,జ్ఞాన శక్తి,క్రియా శక్తి అంటాము.ఆ మూడు శిఖరాల మధ్యన నాలుగు వందల యోజనాల ఎత్తు గలిగిన శిఖరమే అమ్మవారి నివాస స్థానము.అదే శ్రీమన్నగరము! ఇది కాకుండా అమ్మవారికి ఇంకో శ్రీమన్నగరము ఉంది.సకల బ్రహ్మాండములకు బహిర్భాగమున సుథా సాగరము ఉంది.అందులో రత్న ద్వీపము ఉంది.దీనినే మణి ద్వీపము అని కూడా అంటారు.ఈ విషయం రుద్రయామళము లో చెప్పబడినది.దానినే జగద్వీపము అని కూడా అంటారు.అక్కడ ప్రతి గోడ మూడు లక్షల యోజనముల ఎత్తు కలిగి ఉంటుంది.ఆ గోడలు ఇరవై అయిదు తత్త్వ స్వరూపాలతో అలరారుతుంటాయి.శ్రీ అనగా చాలా అర్థాలు ఉన్నాయి.అవి ....లక్ష్మి,సంపద,ఐశ్వర్యము,త్రివర్గము,వృద్థి,శోభ,అలంకరణము,కీర్తి,బుద్ధి మరియు సరస్వతి.అంటే సకల సంపదలు,అష్టైశ్వర్యములు ఉన్న ప్రతి చోటూ శ్రీమన్నగరమే!ఎందుకంటే అమ్మవారు సస్యశ్యామలానికి,వృద్థికి,పురోగతికి ప్రేరణ ఇస్తుంది కాబట్టి ఆ యా ప్రదేశాలలో ఉంటుంది.ఆమె ఎక్కడ ఉంటే అక్కడే శ్రీమన్నగరము ఉన్నట్లే కదా! త్రివర్గము అంటే ధర్మార్థకామములు.వాటి నిర్వహణ ఎక్కడ సజావుగా ఉంటే అక్కడ అమ్మ ఉన్నట్లే!అంతేనా!ఇవన్నీ సక్రమంగా ఉండే నాలుగో పురుషార్థము అయిన మోక్షం కూడా ప్రసాదిస్తుంది.మనకు ఇంకేమి కావాలి?ఇంకొక విషయం!సత్త్వరజస్తమోగుణములకు అతీతం ఈ శ్రీమన్నగరము.