Friday, 12 June 2026

మహా పద్మాటవీ సంస్థా

మహా పద్మాటవీ సంస్థా అను అద్వితీయ నామము అమ్మవారికి శ్రీ లలితా సహస్ర నామావళిలో చెప్పబడిన ఏభై తొమ్మిదవ నామము. మహా మహిమాన్వితమైన షట్చక్రములు అనే పద్మములు ఉన్న వనమునందు నివసిస్తుంది ఆ తల్లి.మహా పద్మము వర్ణన లలితా స్తవరత్నములో చెప్పబడినది.మణిద్వీపము మధ్యలో మహాపద్మముల వనము ఉంది.ఆ మహా పద్మమునకు పది తాడిచెట్లంత పొడవు ఉన్న ఆకులు ఉన్నాయి.ఒక యోజనము ఎత్తు ఉన్న కాడలు ఉన్నాయి.ఐదు తాటి చెట్లంత దట్టమయిన కేసరములతో ఉంది.ఆ మహా పద్మములందు మకరంద ప్రవాహము ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది.ఆ పద్మముల మకరందము,పరిమళము ఆస్వాదించేదానికి తుమ్మెదలు గుంపులు గుంపులుగా వస్తాయి.అక్కడ వీచే మంచి గంథపు పరిమళ వాయువుల తాకిడికి పసుపు పచ్చని పుప్పొడి పైకి లేచి,ఆ ప్రదేశము మొత్తమూ పింజరవర్ణ శోభితంగా ఉంది. ఇంక పిండాండము విషయానికి వస్తే శరీరమే ఒక శ్రీచక్రము. సప్త చక్రములు (సహస్రారముతో)-సప్త పద్మములు(సహస్రార పద్మముతో) ఈ శరీరమే ఒక పద్మాటవి అంటారు.షట్చక్రములు,డెబ్బై రెండు నాడులు కలసి మహా పద్మములు అవుతాయి.ఇందు బ్రహ్మ రంధ్రము నందలి సహస్రార కమలములో శ్రీదేవి విరాజిల్లుతూ ఉంటుంది. బ్రహ్మ రంధ్రమునకు అధోముఖముగ సహస్రదళములతో సహస్రార పద్మము వికసించి యుంటుంది.సహస్రార పద్మమునకు ఎనిమిది దళములు ఉంటాయి.ఒక్కొక్క దళమునకు నూట ఇరవై అయిదు దళములు ఉంటాయి.కాబట్టి మొత్తమూ వేయి దళములు అవుతాయి.అందుకే అమ్మవారిని మహాపద్మాటవీ సంస్థా అని అన్నారు.

No comments:

Post a Comment