Friday, 27 February 2026
పద్మరాగ శిలాదర్శపరిభావి కపోలభూః
పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూః అను అత్యంత రమణీయమయిన నామము శ్రీ లలితా సహస్ర నామావళిలో అమ్మకు పెట్టబడిన ఇరవై మూడవ నామము.
అమ్మ మృదు మోము రాగరంజితము.ఆమె చెక్కిళ్ళు పద్మరాగమణులతో తయారు చేయబడ్డ అద్దాన్ని కూడా త్రోసి రాజంటున్నాయట.అంటే అంత నున్నగా,లేలేతగా నిర్మలంగా కెంపు రంగుతో మిరుమిట్లుగొలుపుతున్నాయి.
పద్మరాగమణులు పండు దానిమ్మగింజలంత ఎర్రగా ఉంటాయి.ఎరుపు రంగు ప్రేమకు,అనురాగానికి చిహ్నము.పద్మరాగమణులకు సహజ సిద్థంగానే కాంతులు ఎక్కువ.అంతకంటే అంటే ఇంకెంత కాంతిమంతంగా ఉందో కదా ఆ తల్లి ముఖారవిందము.వీటన్నిటికీ తోడు అమ్మ నిత్య యౌవన సంపన్నురాలు.ఇంక ఆమె మృదు మథుర సోయగం గురించి వశిన్యాది వాగ్దేవతలు ఎంత వర్ణించినా తక్కువే సుమా!
ఆది శంకరాచర్యులు ఆ తల్లిని వర్ణించడంలో ఇంకో నాలుగు ఆకులు ఎక్కువే చదివారు.ఆ తల్లి కపోలములు ఎంత నున్నగా,మృదువుగా,నిర్మలంగా,అద్దంలాగా మెరిసి పోతున్నాయంటే ఆమె చెవి తాటంకములు ఆమె బుగ్గల పైన ప్రతిబింబిస్తున్నాయట!ఎంత హృద్యమయిన వర్ణన కదా!అంతేనా?కాదు కాదు.ఆమె ముఖము తాటంకములు,వాటిబింబాలతో కలసి నాలుగు చక్రాలతో కూడుకున్న మన్మథుని రథంలాగా కానవస్తుందట.మన్మథుడు ఆతల్లి ముఖారవిందాన్ని ఆశ్రయిస్తే శంకరుడు ఎక్కడ తప్పించుకుంటాడు అమ్మ వలపులనుండి,సరాగాల నుంచీ?మన్మథుడు ఎంత తెలివి కలవాడు కదా!శంకరుడు మన్మథుడిని ఆకారం లేకుండా బూడిద చేసాడు.ఈయనేమో అమ్మ ముఖారవిందం ఆసరాగా చెరుకుగడ వింటితో శరసంథానం చేస్తున్నాడు.అమ్మ కనుబొమలు మన్మథుడి వింటిని ప్రతిబింబిస్తున్నాయి కదా!
Thursday, 26 February 2026
తాటంక యుగళీభూత తపనోడుప మండలా
తాటంక యుగళీభూత తపనోడుప మండలా అను అందమయిన నామము శ్రీలలితా సహస్ర నామావళిలోని ఇరవై రెండవ అమ్మవారి నామము.
అంటే అమ్మవారు తన చెవి తమ్మెలకు సూర్య చంద్ర మండలాలను తగిలించుకుని దేదీప్యమానంగా వెలిగి పోతూ ఉంది.నవగ్రహాలలో సూర్యుడు,చంద్రుడిని మించిన వాళ్ళు లేరు.అలాంటి సూర్య చంద్ర మండలాలను తన చెవి కమ్మలుగా ధరించినది అంటే ఆమె అసమాన్యమయినది అని కదా అర్థము.అలాంటి అమ్మవారిని ఆశ్రయించి ఉన్నామంటే మనకు ఎలాంటి గ్రహ పరమైన అవాంతరాలు,ఆటంకాలు మన దరికి రావు.ఆమె ధరించిన తాటంకములే అనంతాలు అయినపుడు,ఆమె ఇంక ఎంత మహిమాన్వితురాలు అయి ఉండాలి?అది మనం ఊహించలేనిది.
మనము ప్రయత్న పూర్వకంగా మంత్రము చెప్పడం జపము అని అంటారు.అదే అప్రయత్నంగా అదే ప్రక్రియ జరిగితే?దానిని అజపా అని అంటారు.ఇది సహజమయిన ఉచ్ఛ్వాస నిశ్శ్వాసలచే జరుపబడే హంస స్సోహం అనే అప్రయత్న జపము.దీనినే అజపా గాయత్రీ,హంస గాయత్రీ అని కూడా అంటారు.గాయంతం త్రాయతే అంటే జపము చేయివానిని రక్షించునది అని అర్థము.హంస అను శబ్దము ప్రాణ శక్తికి సంకేతము.కాబట్టి మానవులలో సహజంగా,ప్రకృతి సిద్ధంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్శ్వాసలను ప్రాణ గాయత్రీ అని అంటారు.శబ్ద గ్రాహ్యమునకు సంబంథించిన అమ్మవారి చెవులకు ఆభరణాలుగా సూర్య చంద్ర మండలాలను చెప్పడం వశిన్యాది వాగ్దేవతల చతురతకు తార్కాణం!
శంకరాచార్యులవారు అయితే ఆమె కణతల దగ్గర చెవులు వంపు తిరిగి ఉండడం మన్మథుని ధనుస్సును గుర్తుకు తెస్తున్నాయి అని చమత్కరిస్తున్నారు.
Wednesday, 25 February 2026
కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరా
కదంబ మంజరీక్లుప్త కర్ణపూర మనోహరా అను అమ్మవారి నామము శ్రీలలితా సహస్ర నామావళిలోని అత్యద్భుతమయిన ఇరవై ఒకటవ నామము.
అంటే అమ్మవారు కదంబ కుసుమాల గుత్తిని చెవుల పైభాగంలో ఒత్తుగా ధరించి మనోహరంగా, ధగధగలాడుతున్నది అని అర్థము
రావి,తులసి,కదంబము,మారేడు,పారిజాతములను దేవతా వృక్షాలు అని అంటారు.ఇవి లక్ష్మీ ప్రదమయినవి.అన్నిటికంటే కదంబ కుసుమాలు అమ్మకు ప్రియమయినవి.కదంబ వృక్షము చెంత ఉండడం కూడా ఆమెకు ఇష్టం.అందుకే ఆమెను తరచూ కదంబ వన వాసినీ,కదంబ కుసుమ ప్రియా అని కూడా పొగుడుతుంటాము.
అమ్మవారి చెవులు విశాలముగా,సుదీర్ఘంగా,పూలగుత్తులు మోయగలిగేటంత ధృఢంగా ఉన్నాయి.ఆమె కర్ణములు శ్రీకారముల వలెను,శ్రీకరములుగానూ ఉన్నాయి.అమ్మవారి కుడి చెవిని ఉ కారంతోనూ,ఎడమ చెవిని ఊ కారంతోనూ న్యాసం చేయవలెను.న్యాసము అంటే జప తపాలు చేసేటప్పుడు ఆయా అవయవాల వద్ద మంత్రాక్షరాలను ఉంచడం అని విశేషార్థము.
Tuesday, 24 February 2026
తారాకాంతి తిరస్కారీ నాసాభరణ భాసురా
తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా అను దివ్య నామము అమ్మవారి శ్రీ లలితా సహస్ర నామావళిలోని ఇరవయ్యో నామము.
అమ్మ మోము ఎంత చూసినా తనివి తీరదు.ఆమె తన ముక్కుకు ధరించే ఆభరణము నక్షత్ర కాంతిని కూడా త్రోసి రాజంటున్నది.అమ్మవారి ముఖసౌందర్యం వర్ణించడంలో వశిన్యాది వాగ్దేవతలు తరించిపోయారు.వాళ్ళు కైవల్యం అందులోనే చూసుకున్నారు.
అమ్మవారి కుడి ముక్కుకు ఎఱుపు,తెలుపుల మిశ్రమ వర్ణం గల పగడపు ముక్కు పుడక ధరించి ఉంది.ఎడమ ముక్కుకు తెలుపు రంగు గల వజ్రపు ముక్కెర ధరించి ఉన్నది.నాసాదండమున సౌభాగ్యానికి చిహ్నమయిన మంచి ముత్యపు అడ్డబాస ధరించి ఉంది.వాటి వెలుగులు శుక్ర గ్రహ,కుజ గ్రహ కాంతులను వెక్కిరిస్తున్నట్లు ఉంది.మంచి ముత్యపు బులాకీ సౌభాగ్యము సూచిస్తున్నది.
ఎడమ ముక్కు రంధ్రములో ఇడా,కుడి ముక్కు రంధ్రములో పింగళ,నాసాదండము నందు సుషుమ్నా నాడి ఉన్నాయి.
శంకరాచార్యుల వారు ఇలా వర్ణిస్తున్నారు.అమ్మవారి నాసాదండంలో ముత్యములు ఉన్నాయట.ఆమె శ్వాస వదిలేటప్పుడు బయటకు వచ్చి ముక్కు చివరన బులాకీలాగా వేలాడుతూ కనిపిస్తుందట!
Monday, 23 February 2026
నవ చంపక పుష్పాభ నాసాదండ విరాజితా
నవ చంపక పుష్పాభ నాసాదండ విరాజిత అనే అద్భుతమయిన నామము శ్రీ లలితా సహస్ర నామావళిలోని పంతొమ్మిదవ అమ్మ నామము.
అమ్మ మనసులాగే అమ్మ మోము కూడా నవ నవలాడు తున్నది కదా!మరి అందులోని ఆ నాసిక అందము ఇంకేమని వర్ణించాలి?
అదే!అప్పుడే విరిసిన నవనవలాడే సుమనోహరమయిన సంపెంగ వంటి నాసాదండము విరాజిల్లుతున్నది.సంపెంగ అంటే ఒట్టి చూపులకే పరిమితము కాదు.అది వెదజల్లే సౌరభాలు,సువాసనలు మనసును దోచుకుంటున్నాయి.ఆ భావనే ఎంత మృదుమథురంగా ఉందో కదా!
అమ్మవారి ముఖము మన్మథుని వింటిలాంటి కనుబొమలు,కనులకు ధీటుగా సంపెంగ వంటి నాసికతో శోభాయమానముగా కానవస్తున్నది.
తుమ్మెద తనపై వ్రాలలేదని సంపెంగ అలిగి ఘోర తపస్సు చేసింది అంట.భగవంతుని వరం పొంది ఆడదాని నాసిక అయి,అన్ని పూల సువాసనలను ఆఘ్రాణిస్తున్నదట.ఇది ముక్కు తిమ్మన మురిపం నాసిక గురించి.
అమ్మవారి నాసిక కుబేరుని తేజముతో ఉత్పన్నమయింది అంట.విరిసీ విరియని సంపెంగలాగా విరాజమానంగా ఉన్నది.
Saturday, 21 February 2026
వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచనా
వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచనా అనే దివ్యమయిన నామము శ్రీలలితా సహస్ర నామావళిలో అమ్మవారికి చెప్పబడిన పద్దెనిమిదవ నామము.
వక్త్రము అంటే ముఖము.అమ్మవారి ముఖము నుంచి వెలువడేకాంతి ఒక ప్రవాహము లాగా గోచరిస్తున్నది.ఆ కాంతి పుంజాల ప్రవాహములో సయ్యాటలు ఆడుకునే మీనాలలాగ ఉన్నాయి ఆమె కనుదోయి అని ఉటంకిస్తున్నారు.
ఆ తల్లి అందానికి ఎంత వర్ణించినా తనివి తీరదు.ఆమె కనుబొమలు మన్మథుడి ధనుస్సు అయితే నల్లటి కాటుక కనులు వింటినారి అట.
శ్రీమాత ఆవిర్భవము జరిగే సమయములో అగ్ని దేవుడి తేజస్సు చేత నేత్రములు ఏర్పడినాయి.కుడి నేత్రము ఇ కారము-అధిష్ఠాన దేవత ఇంద్రుడు.ఎడమ నేత్రము ఈ కారము...అధిష్ఠాన దేవత విరాట్ పురుషుడు.
ఆ పరమేశ్వరి కుడికన్ను సూర్యని వలె వెలుగును ఇస్తుంది.ఎడమ కన్ను చంద్రుని వలె రాత్రిని ఇస్తుంది.ఫాలభాగములోని మూడవ నేత్రము ప్రాతః,సాయం సంధ్యాకాలములను ఏర్పరుస్తున్నది.
Thursday, 19 February 2026
వదనస్మరమాంగల్య గృహతోరణ చిల్లికా
వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా అను అమ్మవారి నామము శ్రీలలితా సహస్ర నామావళిలోని పదహేడవ నామము.
ఎంత అందమయిన,అద్భుతమయిన వర్ణన అమ్మవారి గురించీ!
ఆ పరమేశ్వరి వదనము మన్మథుని మంగళ గృహము లాగా ఉందట.అందులో ఆమె కనుబొమ్మలు గృహానికి అలంకరించే తోరణాలలాగా ప్రకాశవంతంగా విరాజిల్లుతున్నాయట!
మన్మథుడు అంటేనే అందానికి మారు పేరు,ప్రతీక.అలాంటిది అతని గృహము ఇంకా ఎంత శోభాయమానంగా ఉంటుందో మనము ఊహించుకోవచ్చు.అలాంటి అత్యంత,అరుదైన అందానికి పెట్టి పుట్టిన గృహమునకు గల బాహ్యద్వారము ఇంకెంత శోభాయమానంగా ఉండాలి?అలాంటి ద్వారానికి తోరణాలు మకుటాయమానంగా ఉండాలి.ఉంటాయి కూడానూ!అంటే ఇక్కడ అమ్మవారి కనుబొమలు అందానికి అందం చేకూర్చేలా ఉన్నాయి.
ఇదే విషయాన్ని శంకరాచార్యులవారు కూడా ముగ్థ మనోహరంగా వర్ణించారు.ఆ తల్లి కనుబొమల సౌందర్యం వర్ణించనలవి కావటం లేదంట!కొద్దిగా వంపు తిరిగిన కనబొమలు తుమ్మెదల అందం పుణికి పుచ్చుకున్నాయి అట.ధనుస్సు ఆకారంలో మన్మధుని విల్లులాగా కానవస్తుంది అట.
చిల్లిక అంటే కనుబొమల మధ్య భాగము.ఆ కనుబొమల సంధి భాగములో కస్తూరీ తిలకము కళ్ళు ఆర్పేటందుకు వీలుకానంత శోభతో విరాజిల్లుతున్నది.
అమ్మవారి వదనము పంచదశీ మంత్రంలోని వాగ్భవ కూటము.ఇందులో ఐం క్లీం సౌఃఅనే బీజాక్షరములు అమ్మవారి వదనము.శ్రీం హ్రీం అను బీజాక్షరాలు అమ్మవారి కనుబొమలు.అందుకే మంగళకరములు.
మొత్తానికి ఆ తల్లి కనుబొమలు,నీలమణులలాంటి కనులు,కనుబొమల మధ్య ప్రదేశము అంతా ఎలా కనిపిస్తున్నాయంటే....మన్మథుడు ఎడమ చేత్తో ధనుస్సును పట్టుకున్నట్లు ఉంది.ఎంత అందమైన వర్ణన కదా!
Wednesday, 18 February 2026
ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకా
ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకా అనే అద్భుతమయిన నామము శ్రీలలితా సహస్ర నామావళి లోని అమ్మవారి పదహారవ నామము.
అమ్మవారు నుదుటన కస్తూరీ తిలకము ధరిస్తుంది కదా!ఆమె ముఖారవిందము చంద్రునిలాగా ఉంది కదా!ఆ చంద్రునిలో ఉండే మచ్చలాగా ఆ కస్తూరీ తిలకము కానవస్తున్నది.అంతేకాదు,కస్తూరీ పరిమళము కూడా అద్దబడి ఉందట అమ్మవారి తిలకము.
మగ కస్తూరి జింక యొక్క ఉదరము,పురుషాంగాల మధ్యన ఉండే ప్రత్యేక గ్రంధి నుంచి వెలువడే తీవ్రమయిన పరిమళ ద్రవ్యము ఈ కస్తూరీ పరిమళము.
అమ్మవారి నుదుటన ఉన్న కస్తూరీ తిలకము జగన్మాత ముఖచంద్ర బింబమునకు శోభను ఇస్తున్నది.అంతే కాకుండా కస్తూరీ పరిమళమును కూడా వెదజల్లుతున్నది.
దీనికి ధీటుగా శంకరాచార్యులవారు కూడా అమ్మవారిని వర్ణించారు.
అమ్మవారి పాపట నడుమ సింధూరము ఉంది కదా!అది చీకట్లను చీల్చుకుంటూ బయట పడుతున్న ప్రభాత సూర్య బింబములాగా అలరారుతున్నది అట!ఎందుకంటే ఆమె వంకీలలాంటి పొడవాటి వేణీ సంపద కారుచీకట్లలాగా దర్శనమిస్తుంది అంట.ఆ పాపట చిన్న నీటిపాయలా,ఒక ఝరిలాగా కానవస్తుంది అంట.
Tuesday, 17 February 2026
అష్టమీచంద్ర విభ్రాజ దళికస్థల శోభితా
అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభితా అనే అమ్మవారి నామము శ్రీలలితా సహస్ర నామావళిలోని పదహైదవ నామము.
అష్టమి తిథినాటి చంద్రునిలాగా ప్రకాశంతో దేదీప్యమానంగా వెలుగొందే లలాట ప్రదేశము కలది ఆ తల్లి అని అర్థము.లలితా అమ్మవారు కురువిందమణి శ్రేణులతో కూడిన కిరీటము ధరించి ఉంటుంది కదా!అందువలన వాటి వెలుగు జిలుగుల వలన అమ్మవారి ఫాలభాగము అష్టమినాటి చంద్రుడిలాగా శోభాయమానంగా ధగధ్థగలాడుతూ ఉంది.
ఈ వర్ణనలో ఒక విశేషము ఉంది.శుక్ల పక్షంలో చంద్రకళలు వృద్ధి పొందుతూ అష్టమి నాటికి చంద్ర బింబము అర్థ చంద్రాకారం అవుతుంది.అలగే బహుళ పాఢ్యమి నుండి బహుళ అష్టమి వరకూ చంద్ర కళలు తగ్గుతూ అష్టమి నాటికి మళ్ళీ చంద్రుడు అర్థ చంద్రాకారం లోకి వస్తాడు.అంటే రెండు అష్టములలోనూ చంద్రుడు సమచంద్రుడుగా దర్శనమిస్తాడు.
శుక్ల పక్షము,కృష్ణ పక్షములు రెండింటిలో నిత్య దేవత త్వరితా ఉంటుంది.దీనినే త్వరిత కళ అని అంటారు.
Sunday, 15 February 2026
కురువింద మణి శ్రేణీ కనత్కోటీర మండితా
కురువిందమణి శ్రేణీ కనత్కోటీర మండితా అను నామము శ్రీ లలితా సహస్ర నామావళిలోని అమ్మవారి పదునాలుగవ నామము.
అమ్మవారు కురువిందమణులతో పొదిగియున్న కిరీటము ధరించి దేదీప్యమానంగా వెలిగిపోతున్నది అని అర్థము.కురువిందమణులను పద్మరాగ మణులు అనికూడా అంటారు.ఇవి కామము,అనురాగము మొదలైన నానా గుణములు కలిగి ఉంటాయి.ఇవి ఎర్రగా కెంపు వర్ణంలో ఉంటాయి.
రావణగంగ అనే ఒక నదిలో లభ్యమవుతాయి.ఇవి ఉత్తమమయిన మణులు.రావణగంగ నదిలో కురువిందములు,సౌగంథికములు,స్ఫటికములు అని మూడు రకాల శిలలు పుట్టాయి.వాటన్నిటిలోకి పద్మరాగములు మేలైనవి.ఈ మణులు బంథూకము అనగా మంకెన పువ్వు,ఇంద్రగోపము అనగా ఆరుద్ర పురుగు,మందారము,దాసాని,రక్తవర్ణము,దానిమ్మ గింజ...ఈ రంగులో ప్రకాశిస్తూ ఉంటాయి.కొన్ని మోదుగ పువ్వు రంగులో కూడా ప్రత్యక్షమవుతుంటాయి.
ఇలాంటి పద్మరాగమణులు వరసగా పొదిగియున్న,బంగారంలా మెరిసిపోతూ,ప్రకాశించుచున్న కిరీటముతో అలంకరింపబడి తేజోమయంగా విరాజిల్లుతున్నది ఆ పరమేశ్వరి అని అర్థము.
శంకరాచార్యుల వారు కూడా దీని వర్ణన బహు భేషుగ్గా చేసారు.ఆ తల్లి కిరీటం వరుసగా పొదగ బడిన మణులతో ద్వాదశాదిత్యులకు ఆశ్రయమిచ్చిన గూడులా కనిపిస్తుంది అట!అక్కడ ఉండే చంద్రవంక ఆ మణులకాంతి పైన బడటంతో చంద్ర శకలంలా కాకుండా అద్భుతమయిన,మనోరంజితమయిన ఇంద్ర ధనుస్సులాగా మెరసిపోతున్నది అంట!నీలాకాశంలో ఒకేసారి ఇంద్రధనుస్సుతో కూడిన పన్నెండు మంది సూర్యులు ఉదయించినట్లుగా,అత్యద్భుతము ఆవిష్కరింపబడినట్లుగా కానవస్తుంది అంట!
ధాత,అర్యమ్న,మిత్ర,వరుణ,ఇంద్ర,వివస్వంత,త్వష్ట,విష్ణు,అంశుమంత,భగ,పూష మరియు క్రతులను ద్వాదశాదిత్యులు అంటారు.అంతమంది వలన వెలువడే వేడిమి,తాపమును తట్టుకోగలిగే శక్తి ఆ తల్లికి మాత్రమే ఉంది.ఎందుకంటే ఆ వేడి,ఆ చంద్రునిలోని శీతల జ్యోత్స్న ప్రకాశము ఇచ్చింది ఆ పరాశక్తే కాబట్టి.
Friday, 13 February 2026
చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా
చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా అను నామము శ్రీలలితాసహస్ర నామావళి లోని పదమూడవ నామము.
అంటే చంపక,అశోక,పున్నాగ,సౌగంధిక పుష్పాలతో అమ్మవారి శిరోజాలు అలంకరించబడినాయి.ఆ రకంగా ఆ తల్లి శోభాయమానంగా విరాజిల్లుతున్నది అని అర్థము.
పరమేశ్వరి వర్ణన శిరోజాలతో మొదలు అయి పాదాంతముతో పూర్తవుతుంది.అమ్మవారి సూక్ష్మ శరీరము పంచదశీ మంత్రము.పంచదశీ మంత్రమునకు వాగ్భవ,కామరాజ,శక్తి అనే మూడు కూటములు కలవు.అందులో శిరస్సు వాగ్భవ కూటముగా చెప్పబడినది.
పరమేశ్వరి ఆవిర్భావము సకల దేవతల శక్తులతో జరిగినది.అందులో ఆమె కేశములు యముని తేజము నుండి సంభవించాయి.కాబట్టే ఆమె కురులు వంకీలుగా,సహజ పరిమళంతో చాలా పొడవుగా ఉన్నాయి.అంతేనా?చిక్కగా,నునుపుగా,సుమనోహరంగా మేఘ వర్ణంతో కళకళలాడుతున్నాయి.ఇక్కడ చమత్కారం ఏందంటే ఆమె తలలో తురుముకున్న పూలవలన ఆమె శిరోజాలకు సువాసనలు అద్దబడలేదు.ఆమె కురులు సహజసిద్థంగా సహజపరిమళంతో సువాసనలు వెదజల్లుతున్నాయి.ఆ సువాసనలు ఆమె తలలో తురుముకున్న పూలకు అంటుకుంది.ఆమె కురులు పూలకంటే అతి మృదువుగా ఉంటాయట!ఈ విషయం వశిన్యాది వాగ్దేవతలే చెప్పారట.ప్రశ్నించేదానికి మనము ఎవరము?
ఆ శిరోజాల ఝరిలో ఇరుక్కుని తాము కూడా సుగంధభరితము కావాలని అన్ని రకాల పుష్పాలు ఉవ్విళ్ళూరుతున్నాయట!
అప్పుడే వికసించిన నల్లకలువలు లాగా,నల్లటి మేఘాలలాగా ఉండే ఆమె కొప్పు అజ్ఞానము అనే చీకట్లను పారద్రోలుతుందట!ఆఖరుకి ఇంద్రుడి ఉద్యానవనంలోని కల్పవృక్షం పుష్పాలు కూడా ఎప్పుడు మేముంతా ఆమె శిరోజాలలో తురుమబడతాము అని ఉత్సాహంగా ఎదురుచూస్తూ ఉంటాయట!అమ్మవారు ప్రముఖంగా ఎఱుపు,ఆకుపచ్చ,నీలం రంగు పుష్పాలను ధరిస్తుందట!ఆ రూపం ఎంత జగన్మోహనంగా ఉంటుంది కదా!
Wednesday, 11 February 2026
నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలా
నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలా అను అమ్మవారి నామము శ్రీలలితా సహస్ర నామావళిలోని పండ్రెండవ నామము.
అమ్మవారి శరీరము ఎర్రని అరుణకాంతులతో విరాజిల్లుతున్నది.ఆమె తన అరుణారుణ కాంతులతో సమస్త బ్రహ్మాండాన్ని వెలుగులతో నింపుతున్నది.ఆ శరీరపు వెలుగు జిలుగులు ఆమెకు స్వతహాగా ఉన్నవి.ఈ సృష్టి మొత్తము ఆమె సృజనే కదా!కావున ఈ బ్రహ్మాండములు అన్నీ ఆమె శరీరము యొక్క అరుణ కాంతుల శోభతో ప్రకాశిస్తున్నాయి.వెలిగిపోతున్నాయి.అమ్మవారి తాటంకములు సూర్యచంద్రులు.అలగే అమ్మవారి త్రినేత్రములు సూర్యచంద్రుల అగ్నిగోళాలు.ఇడ,పింగళ,సుషుమ్న నాడుల అధిష్ఠాన దేవతలు కూడా సూర్యచంద్రాగ్నులే!ఒక రకంగా అభివర్ణించాలంటే ఆమె పాదములనుండే ఈ సూర్యచంద్రాగ్ని మండలములకు ఆ కాంతులు,ఆ వెలుగులు,ఆ శోభ లభించాయి.అలాగే చంద్రమండలమునకు శీతలత్వము ,అమృత తత్వము ఆ తల్లి సహస్రారము నుండే లభించి ఉన్నాయి.
ఆ పరమేశ్వరి వలన సూర్యచంద్రులకు వెలుగు సమకూరింది.వాటి వలన ఆ తల్లికి కాదు.
ఇలా సహస్రకోటి కిరణాల సమాహారంగా,దేదీప్యమానంగా వెలుగొందుతుంది కాబట్టి ఆ తల్లికి నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండమండలా అనే నామము సార్థకమయినది.
Monday, 9 February 2026
పంచ తన్మాత్ర సాయకా
పంచ తన్మాత్ర సాయకా అనునది శ్రీలలితా సహస్రనామావళిలోని అమ్మవారి పదకొండవ నామము.
పంచ తన్మాత్ర సాయకా అంటే పంచ తన్మాత్రలు,అనగా పంచభూతముల సూక్ష్మ స్వరూపములను తన బాణములుగా కలది అని అర్థము.శబ్ద,స్పర్శ,రూప,రస,గంధములను పంచ తన్మాత్రలు అని అంటారు.
ఈ శబ్ద,స్పర్శ,రూప,రస,గంధములు అనేవి జ్ఞానేంద్రియ విషయ పంచకము యొక్క సూక్ష్మాంశములు.ఆ పరమేశ్వరి ధనుస్సును దక్షిణోర్ధ్వకరమున బాణములను ధరించి ఉన్నది.అంటే అమ్మవారు తన కుడి పై హస్తమున పంచతన్మాత్రలను బాణములుగా చేసుకుని విరాజిల్లుతున్నది.
బీజరూపములగు శబ్దాదులు రూపరహితములగుటవలన అగోచరములు.అంటే వీటికి ఎలాంటి రూపము ఉండగు.కావున కానరావు.కళ్ళను చూడవచ్చు.చూపును చూడలేము కదా.చూడగలుగుతాము.స్పర్శ అనుభూతి. అనుభూతి పొందగలము కానీ ఆకారరూపంగా చెప్పలేము కదా!
దృశ్య ప్రపంచ నిర్మాణానికి స్థూలదేహ నిర్మాణము కావాలి కదా!దానికోసరము పంచభూత తన్మాత్రల పంచీకరణమొనర్చి తన కార్యసాథనకు ఉపయోగించుకుంటుంది ఆ దేవదేవి.అందుకే పంచతన్మాత్ర సాయకా అను నామము సార్థకమయినది.
Monday, 2 February 2026
మనోరూపేక్షు కోదండా
మనోరూపేక్షు కోదండా అను నామము శ్రీలలితా సహస్ర నామావళి లోని పదవ నామము.
అమ్మవారు తన ఎడమ వైపు పై చేతిలో చెఱకుగడ విల్లు ధరించి విరాజిల్లుతున్నది.ఇక్షుచాపము అంటే చెఱకుగడ విల్లు అని అర్థము.తన మనస్సునే ఇక్షుచాపము చేసుకుంది.
ఇక్కడ మనము ఇలా అర్థం చేసుకోవాలి.మనస్సు అనేది సూక్ష్మము.ఇక్షుచాపము అనునది స్థూలరూపము.ఇక్షుచాపములోని మాధుర్య రసము కారణ రూపము.అంటే ఆ పరమేశ్వరి తన మనస్సులోని మాధుర్యాన్ని తీయని రసధారల ద్వారా తన భక్తులకు పంచేదానికి ఇక్షుచాపము ధరించింది.అంతేకాదు.శిష్టులకు రక్షణ,వరములు ఇచ్చినట్లే దుష్టులను శిక్షించి సన్మార్గంలో పెడుతుంది.
చెఱకును పుండ్రేక్షువు అని అంటారు.
మనము ఇచ్ఛాశక్తి,జ్ఞానశక్తి ఆ తల్లి మనసు అనుకుంటే,ఆమె ధరించిన విల్లు క్రియాశక్తి.
Sunday, 1 February 2026
క్రోధాకారాంకుశోజ్జ్వల
క్రోధాకారాంకుశోజ్జ్వల అను నామము శ్రీ లలితా సహస్ర నామావళిలోని తొమ్మిదవ నామము.
పరమేశ్వరి ఉజ్జ్వలమయిన క్రోధమనే అంకుశమును తన క్రింది కుడిచేతిలో ధరించి విరాజిల్లుతున్నది అని అర్థము.క్రోధము దుష్టశక్తులను దునుమాడేదానికి వాడుతుంది అని నమ్మకము.అదే తన భక్తుల బాధలను,అజ్ఞానాన్ని తొలగిస్తుంది అని అర్థము.కావున ఇది జ్ఞానముతో కూడిన క్రోధస్వరూపమయిన అంకుశము అని మనం భావించవచ్చు.
అమ్మవారి చేతిలో పాశము రాగాత్మకము అయితే,అంకుశము ద్వేషాత్మకము అని కూడా అర్థం రాబట్టవచ్చు.
ఆ తల్లి నాలుగు ఆయుధములకు నాలుగు బీజాక్షరములు కలవు.అం అనే బీజాక్షరము పాశమునకు,క్రోం అనే బీజాక్షరము అంకుశమునకు,ఓం అనే బీజాక్షరము ధనుస్సుకు ,క్లీం అనే బీజాక్షరము బాణమునకు అన్వయింపబడినవి.
Subscribe to:
Posts (Atom)