Monday, 30 March 2026
లక్ష్యరోమలతాధారతా సమున్నేయ మధ్యమా
లక్ష్యరోమలతా ధారతా సమున్నేయమధ్యమా అను పవిత్ర నామము శ్రీలలితా సహస్ర నామావళిలో వాగ్దేవతలు అమ్మవారికి ముప్పై అయిదవ నామంగా చెప్పారు.ఇందాక నామంలో అమ్మవారి నాభి పాదులాగ ఉంది అని అనుకున్నాము కదా!ఆ పాదు నుంచి మొలచిన,వచ్చిన నూగారు లతకు స్తనద్వయం ఫలాల లాగ ఉంది అని విశ్లేషణ అయింది కదా!దానిని ఇంకొంచెం పొడిగిస్తున్నారు వాగ్దేవతలు.ఆ తీగకు ఆధారంగా సన్నని నడుము గలిగి ఉందట అమ్మవారు.స్త్రీని సింహమధ్య అని అంటారు.స్త్రీలకు నడుము అందంగా,సన్నగా,పల్చగా ఉండడం శుభప్రదమయిన సాముద్రిక లక్షణం.
శంకరాచార్యులవారు అమ్మవారి నడుముతో బాటు నడుముకు పెట్టుకున్న ఆభరణాలను వర్ణించాడు.అమ్మవారు మంగళప్రదమయిన సవ్వడులు చేస్తుండే కనక ,రత్న,మణులతో పొదగబడిన మొలనూలు ధరించి ఉందట!మదపుటేనుగుల కుంభ స్థలం లాంటి స్తనభారముచే కొంచెం ముందుకు వంగి ఉందట.మామూలు స్త్రీలే పిల్లలకు పాలు ఇచ్చే సమయంలో స్తనభారంతో ఉంటారు.అలాంటిది ముల్లోకాలకూ జగన్నాత అయిన తల్లి.ఈ సర్వ సృష్టిలోని ప్రాణుల ఆకలి తీర్చేది,తీర్చగలిగే సత్తా,స్తోమత ఉండే తల్లి పాలిండ్లు ఇంకెలా ఉండాలి?ఉంటాయి?
శంకరాచార్యులవారు ఇంకా ఇలా వర్ణిస్తున్నారు.తల్లీ!నీ నడుము చూస్తే నాకు భయంగా ఉంది.ఎంతటి సవ్నని నడుము!నాభి,నడుము ముడతల దగ్గర విరిగి పోతుందేమో అనిపిస్తున్నది.ఆయన అమ్మవారి ఆశీస్సులు ఇలా కోరుకుంటున్నాడు.తల్లీ!నీ నడుము ఎలా ఉందో చెప్పేదా!ఒడ్డు మీద నుండి వాగు వైపుకు ఒంగిన చెట్టులా వంపుగా తిరిగి ఉంది.ఆ చల్లని,శుభకరమయిన నడుము చిరకాలమూ కుశలంగా ఉండి మాకందరికీ క్షేమం కలిగించుగాక!అని ఆశ పడుతున్నాడు.
దేవి యొక్క ఆవిర్భావ సమయంలో ఇంద్రుని తేజస్సుతో నడుము మరియు పొట్టపై మూడు ముడతలు(త్రివళులు) ఏర్పడినవి.చంద్రుని తేజస్సుతో రెండు వక్షోజములు ఏర్పడినవి.
సమున్నేయ మధ్యమా అంటే చక్కగా ఉద్ధరింపబడిన నడుము కలిగినది అని అర్థము.అమ్మవారి విరాట్ రూపంలో నాభికి పైన ఊర్థ్వలోకములు,నాభికి దిగువ అధోలోకములు కానవస్తాయి.ఊర్థ్వలోకములను,అధోలోకములను ఉద్ధరించేందుకని అంతటి సన్నని నడుము కలిగి ఉంది కాబట్టి ఆ తల్లిని సమున్నేయ మధ్యమా అని వాగ్దేవతలు కొనియాడారు.
Sunday, 29 March 2026
నాభ్యాలవాల రోమాళి లతా ఫల కుచద్వయీ
నాభ్యాలవాల రోమాళి లతా ఫల కుచద్వయీ అను దివ్యనామము శ్రీలలితా సహస్రనామావళిలోని ముప్పై నాల్గవ నామము.రవి కాంచని చోటు కవి కాన్చును అని అంటారు కదా!ఆ మాటలకు ఉదాహరణ ఈ నామము.అమ్మవారి నాభి ఒక పాదు లాంటిది.నాభి నుంచి ఊర్ధ్వ ముఖంగా పాకిన నూనూగు తీగలాగ ఉందట సన్నని వెంట్రుకల సముదాయము.ఆ నూగారు తీగ కొనలకు పండిన ఫలాలలాగా ఉన్నాయట ఆమె స్తనద్వయం.ఇంత శోభతో అలరారుతున్నది ఆ తల్లి.
ఇక్కడ నాభి అనేది మణిపూర చక్రము.అయితే స్తన మధ్య భాగము అనాహత చక్రము అవుతుంది.అప్పుడు ఇడా,పింగళ నాడులను ఆ తల్లి స్తనములుగా భావించాలి.అప్పుడు బొఢ్డు నుండి వక్ష స్థలము వరకు ఊర్థ్వ ముఖంలో ఉండే సన్నని రోమాళిని సుషుమ్నా నాడిగా భావించాలి.వశిన్యాది దేవతల వర్ణనలో ఎంత అర్థమూ,పరమార్థమూ ఉన్నాయి కదా!
ఇంతేనా!నాభిని పాదుతో పోల్చడం ఆలవాలత్వము.ఒక విత్తు మొలక కావాలంటే కావాలసిన నీరు,సత్తువను ఇవ్వగల పాదు ఆలవాలత్వము అంటే.రోమాళియందు లతాత్వము సమన్వయింపబడింది.కుచముల యందు ఫలత్వము అన్వయింపబడింది.ఎంత హృద్యంగా,రమణీయంగా ఉంది కదా పోలిక.బిడ్డ పుట్టగానే బొడ్డు కోస్తారు.దానితో తల్లీ బిడ్జ భౌతికంగా వేరవుతారు తప్ప మానసికంగా,ప్రేమపరంగా కాదు.
ఇంకో విశేషము.శివుడు కోపంతో మన్మథుడిని భస్మం చేసాడు కదా!అప్పుడు ఆయన తాపం తగ్గించుకునేదానికి అమ్మవారి నాభి అనే సరస్సులోకి దూకాడట!
శంకరాచార్యులవారు అమ్మను కీర్తించడంలో అసలు అలసిపోరు.తల్లి నాభి నిశ్చలమయిన గంగా ప్రవాహం లాంటిది అట.నీ నాభి స్తనములు అనే పూల మొగ్గలకు ఆథారమయిన రోమరాజి అనే తీగెకు పాదులాంటిది.అది మన్మథుని పరాక్రమాగ్నికి హోమగుండము.రతీదేవికి విహారగృహము.ఈశ్వరుని కనుల సిద్థికి గుహాముఖము అయి విరాజిల్లుతున్నది.
అమ్మవారిని ఇంత బాగా వర్ణించడం వారికే చెల్లు.
Friday, 27 March 2026
కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణ స్తనీ
కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణ స్తనీ అనే ఆధ్యాత్మకమయిన నామము శ్రీలలితా సహస్ర నామావళిలోని ముప్పై మూడవ నామము.ఈ నామము వాగ్దేవతలు చాలా ఆలోచించి పెట్టినట్లున్నారు.
అమ్మవారు కామేశ్వరుని భౌతికాతీతమయిన ప్రేమరత్నం కోసం చాలా తపించింది.అందుకని తన భౌతికపరమయిన స్తనరత్నములును పణముగా కామేశ్వరుడికి అర్పించుకున్నది.ఇదే ఇచ్చి పుచ్చుకోవడం అంటే.మనకు నచ్చిన,ఇష్టమయిన దానికోసం మనలను మనము సమర్పించుకోవటం ఆ ప్రేమకు పరాకాష్ట కదా!అందుకనే వారిని ఆది దంపతులు అని అంటారు. ముచ్చటగా అర్థ నారీశ్వర విగ్రహం అని అంటారు.
నిర్గుణ పరబ్రహ్మ యొక్క కర్మ స్వరూపం శ్రీ మహా విష్ణువు అయితే జ్ఞాన స్వరూపము పరమేశ్వరుడు.అందుకే లౌకికమయిన పురోగతికి శ్రీ మహా విష్ణువును ఆరాథించాలి.ఆధ్యాత్మిక పురోగతికి,సచ్చిదానందమయిన కైవల్యం కోసరము శివస్వరూపాన్ని ఆరాధించాలి.
భౌతికాతీతమయిన పరమేశ్వరుని ప్రేమ ఎంత ఉన్నత మయినది కదా!అది పొందాలనే భౌతికమయిన తన స్తన ద్వయాన్ని అయ్యవారికి అమ్మవారు సమర్పించి,తరించింది.ఈ కార్యం పాతివ్రత్యానికీ,ఏక పత్నీవ్రతానికి ప్రతీక మరియు మచ్చు తునక.
యోగం శివుడిని సకల దుఃఖ హరుడైన రుద్రుడిగా వర్ణిస్తుంది.మనము దుఃఖం పోవడానికి ఓం నమో భగవతే రుద్రాయ అని జపించాలి.విషపూరిత జీవుల నుండి రక్షణకు ఓం నమో భగవతే నీలకంఠాయ అని నామజపం చేయాలి.
Wednesday, 25 March 2026
రత్న గ్రైవేయ చింతాక లోల ముక్తా ఫలాన్వితా
రత్న గ్రైవేయ చింతాక లోల ముక్తా ఫలాన్వితా అను మనోహర నామము శ్రీలలితా సహస్ర నామావళిలో అమ్మవారికి పెట్టబడిన శుభనామము.రత్నహారములు,ప్రకాశవంతంగా మెరిసే మంచి ముత్యాల సరములు,కాంతులీనే చింతాకు పతకముల వంటి కంఠాభరణములతో ఆ తల్లి ఒప్పారుతున్నది.
వశిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని ఇలా వర్ణించారు.అమ్మ తన మెడలో వేసుకున్న మంచి ముత్యాల హారము మెడ నుండి గుండెలదాకా రత్నాల పేటల హారములకు క్రింద వేలాడే లోలాకులతో కూడి ఉన్న ముత్యాలతో కూడిన చింతాకు పతకం వ్రేలాడుతున్నది.
శంకరాచార్యులవారు ఈ విషయం అస్సలు ఒప్పుకోవటం లేదు.ఆయనకు స్త్రీల సౌందర్యాభరణాల పైన ఎక్కువ పట్టు ఉన్నట్లుంది.ఆయన ఇలా అంటున్నాడు.ఎక్కడైనా స్త్రీలు ముత్యాల పతకం ఉన్నప్పుడు ముత్యాల సరాలు ఉంటాయి కానీ ఎక్కడైనా రత్నాల పేటలు ఉంటాయా?ఊహూ!ఉండనే ఉండవు.ఆమె వేసుకుంది ముత్యాల పేటల హారాలే!కానీ ఎందుకు అవి ఎర్రగా మెరుస్తున్నాయో శంకరాచార్యుల వారు కనిపెట్టేసారు.ఆ తల్లి పెదాలు తాంబూల చర్వణానంతరం ఎర్రగా కాంతులీనుతున్నాయి కదా!ఆ ఎర్రని జిలుగులు అమ్మవారు ధరించిన ముత్యాల సరాల పైన బడి ఎర్రగా మెరిసిపోతున్నాయట!
ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉంది.అమ్మవారు ధరించిన మేలి ముత్యాలు గజకుంభం నుంచి పుట్టినవి.మామూలుగా ముత్యాలు ముత్యపు చిప్పలలోనే కాకుండా ఇంకా అయిదు చోట్ల లభిస్తాయి.అవి గజకుంభేషు,వంశేషు,ఫణేషు,జలదేమచ,శుక్తికాయా,మిక్షుదండే,షోడా మౌక్తిక సంభవా.
అంటే ఏనుగు కుంభ స్థలము నందు వివిధ వర్ణాల ముత్యాలు దొరుకుతాయి.వెదురు బొంగులో తెలుపుతో కూడిన ఎఱుపు రంగు (పాటల వర్ణము)ముత్యాలు,సర్పముల పడగల యందు నీల వర్ణములు,మేఘముల యందు మెరుపు వర్ణము కలవి,ముత్యపు చిప్పల యందు శ్వేత వర్ణము కలవి,చెరకు గడల యందు పసుపు వర్ణము కలవి సంభవిస్తాయి.
అమ్మ గుండెల పైన వ్రేలాడేది చింతాకు పతకం కాదట అసలు!భగవంతుని గూర్చి చింత కలిగిన వారు చింతాకులు అంట.వారిలో మూడు రకాలు ఉన్నారు.గ్రైవేయ చింతాకులు తమ కంఠంతో అమ్మను ధ్యానిస్తారు.లోల చింతాకులు కోరికతో అమ్మను కొలుస్తారు.ముక్త చింతాకులు ముక్తి కోరుకుంటూ అమ్మను కొలుస్తారు.ఆమె ధరించే చింతాకు పతకం ఈ భక్తులకు ప్రతీక అట!అంటే ఏ రకంగా కొలిచినా భక్తులను అమ్మవారు తన గుండెల్లో పెట్టుకుని కాపాడు కుంటుంది అని అర్థము.
Monday, 23 March 2026
కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితా
కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితా అను సుందర నామము శ్రీ లలితా సహస్ర నామావళిలో అమ్మవారికి పెట్టబడిన ముప్పై ఒకటవ నామము.
కేయూరములు అంటే దండ కడియములు లేదా దండ వంకీలు అని అర్థము.అమ్మవారు రత్న,వజ్ర,మాణిక్య ఖచిత బంగారు ఆభరణాలను తన భుజములకు అలంకరించుకున్నది.అసలే ఆమె అతిలోక సుందరి.ఆమెకు సరిసాటి ఇంకెవ్వరూ లేరు ముల్లోకాలలో.దానికితోడు వజ్ర,వైఢూర్య,మణి,మాణిక్యాలతో పొదగబడిన కనకపు ఆభరణాలను తన బాహువులకు అలంకారంగా ధరించి ముగ్ధమోహనంగా వెలిగిపోతున్నది.ఆమెకు బాహువులు అనంత కోటి కిరణాలు.ఆ కిరణాల సమ్మేళనమే ప్రకాశమై భుజకీర్తులు అనబడుతున్నాయి.
Wednesday, 11 March 2026
కామేశ బద్ధ మాంగల్య సూత్రశోభిత కంధరా
కామేశ బద్ధ మాంగల్ల సూత్రశోభిత కంధరా అనే పవిత్రమయిన నామము శ్రీలలితా సహస్ర నామావళిలోని ముప్పయవ నామము.
పరమశివుడు కట్టిన మంగళసూత్రము అమ్మవారి కంఠసీమను అలంకరించి యున్నది.ఆమె గళసీమలో ఆ మంగళసూత్రము శోభాయమానంగా,కన్నులపండువగా ఉంది.దేవతలు పార్వతిని,పరమేశ్వరుడిని కలపమని మన్మథుడిని పంపిస్తారు.
శివుడి తపస్సు భంగం అయిందనే కోపంతో మన్మథుడిని భస్మం చేసాడు.పార్వతి శివుడి కోసం భీకరమయిన తపస్సు చేసింది.పర్ణాలు అనగా రాలిన ఆకులు మటుకు తిని తపస్సు చేసింది.తరువాత అవి కూడా తినడం ఆపేసింది.అందుకని ఆమెకు అపర్ణ అనే పేరు వచ్చింది.పార్వతి తపస్సు మెచ్చి పరమేశ్వరుడు బ్రహ్మచారి రూపంలో వచ్చి,పార్వతిని పెళ్ళి చేసుకుంటాడు.సంసారానికి మూలం మన్మథుడు కాబట్టి పార్వతి మన్మథుడిని మళ్ళీ బ్రతికించినట్లయింది.కామేశుడు తన మెడలో కట్టిన మంగళసూత్రము చేత ఆ కంఠము ప్రకాశిస్తూ,వెలిగిపోతుంది.అందుకనే వశిన్యాది వాగ్దేవతలు ఆమెను ప్రేమగా,మురిపెంగా కామేశ బద్ధ మాంగల్య సూత్రశోభిత కంధరా అని పిలుచుకున్నారు.ఆమెకు తన మంగళసూత్రము పైన ఎంత నమ్మకం అంటే శివుడు లోక కళ్యాణం కోసరము విషం త్రాగుతానంటే వెనక్కి లాగలేదు.సరే అని ప్రోత్సహించింది.
Saturday, 7 March 2026
అనాకలిత సాదృశ్య చుబకశ్రీ విరాజితా
అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితా అను అసమాన నామధేయము శ్రీ లలితా సహస్ర నామావళిలో అమ్మవారికి ఇవ్వబడిన ఇరవై తొమ్మిదవ నామము.ఇది ఇంత,కాదు అంత,కాదు కాదు ఎంతెంతో అందమయిన అని వివరించి చెప్పలేనటు వంటి చుబుకము కలదు ఆ తల్లికి.వశిన్యాది వాగ్దేవతలు కూడా ఆమె చుబుకాన్ని దేనితో పోల్చలేకపోయారు.అంతటి చుబుక సౌందర్యంతో అమ్మ అలరారుతున్నది.ఆ తల్లి బాల్యంలో హిమవంతుడు ముద్దుగా వాత్సల్యంతో ఆమె చుబుకాన్ని పుణికాడు.
ఇంక శంకరాచార్యులవారు అయితే ఇలా వర్ణించారు.తల్లీ!నీ చిన్నతనంలో నీ తండ్రి ముద్దులు మూటగట్టేలా ఉన్న ముఖారవిందాన్ని ముద్దులాడేదానికి నీ చుబుకం పట్టుకుని బ్రతిమలాడేవాడట!ఇంక అర్థనారీశ్వరుడు దగ్గరకు వస్తాము.వారిరువురూ ఏకాంతంలో ఉన్నప్పుడు నీవు సిగ్గుల మొగ్గవు అయి తల దించుకునినావు.నీ అధరామృతం కోసము శివుడు వజ్రాలపిడిలాంటి నీ చుబుకము పట్టుకుని అద్దంలాంటి నీ మోములో తననుతాను చూసుకుని మురిసిపోయాడట!
Friday, 6 March 2026
మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసా
మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసా అను అత్యంత అద్భుత నామము శ్రీ లలితా సహస్రనామావళిలో అమ్మవారికి ఇవ్వబడిన ఇరవై ఎనిమిదవ నామము.
ఈ నామము లోని భావము చాలా లోతయినది.అమ్మవారి చిరునవ్వు అవధులు లేని కాంతి ప్రవాహములా గోచరిస్తున్నది.ఆ ప్రవాహములో కామేశ్వరుడు లయమయిపోయి,మునిగి తేలుతున్నాడు.అయ్యవారి మనసును కొంగుకు ముడి వేసుకున్నట్లు ఉంది.అంటే లయకారుడు అమ్మవారి చిరునవ్వుల ఊటలో లయమయిపోతున్నాడు.ఆ పరమేశ్వరుడి మనసును గెలుచుకుని,సతతం తనతోనే,తనలోనే ఉంచుకుంది ఆ కామేశ్వరి.మామూలుగానే ఆమె అందం అట్లాంటిట్లాంటిది కాదు.అలాంటి జగన్మోహిని మందస్మిత అయి అయ్యవారిని ఓరకంట చూస్తే,ఇంకేముంది.హృదయార్పణం జరిగి తీరాల్సిందే!
ఈ విషయంగా శంకరాచార్యులవారు ఇలా అంటున్నారు.చకోర పక్షులు జగన్మాత చిరునగవులు అనే వెన్నెలలను గ్రోలుతున్నాయట.అతి మథురం అయ్యేటప్పటికి విరుగుడుగా అమృతమును పుల్లటి కడుగు నీళ్ళులాగా భావించి త్రాగుతున్నాయట!అంటే అమ్మ చిరునవ్వు అమృతము కంటే అత్యంత మథురనయినది,తీయనైనది.దానికి సాటి ఇంకేమీ లేదు ముల్లోకాలలో!ఆ అతి తీపితో మొహం మొత్తి రుచి మార్పు కోసం చంద్రుని వెన్నెల గ్రోలుతున్నాయి.అంతే!
Wednesday, 4 March 2026
నిజసల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపి
నిజసల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపి అను మృదు మథురమయిన నామము శ్రీలలితా సహస్ర నామావళిలో అమ్మవారికి ఇవ్వబడిన ఇరవై ఏడవ నామము.
సంగీత సాహిత్యములకు అధినేత్రి సరస్వతీ దేవి.ఆమె వీణ పేరు కచ్ఛపి.అటువంటి వీణా మాథుర్యమును కూడా ధిక్కరించ గలిగేలా అమ్మ సంభాషణ ఉంది.ఈమె మాటల సొబగు,సౌందర్యము,మధురము అద్వితీయము.ఇక దేనితోనూ పోల్చలేము.కచ్ఛపీ వీణలో ఏడు తంత్రులు ఉంటాయి.ఈ వీణకు ఇరవై నాలుగు మెట్లు ఉంటాయి.దాని వలన స్వర స్థానములు ఎక్కువ పలికి స్పష్టత చాలా బాగుంటుంది.
వశినీ,కామేశ్వరీ,మోదిని,విమల,అరుణ,జయిని,సర్వేశ్వరి,కౌళిని...।వీరిని వశిన్యాది వాగ్దేవతలు అని అంటారు.
శంకరాచార్యులవారు ఇంకా బాగా వర్ణించారు అమ్మ పలుకు ని.ఒకసారి సరస్వతీ దేవి దేవతల కొలువులో శివుడిని స్తుతిస్తూ గానం,వీణానాదం చేస్తూ ఉందట.అమ్మవారు తన్మయత్వంతో తల ఆడించిందట.అది సరస్వతి గమనించింది.మామూలుగా పాడితేనే ఇలా ఊగి పోతున్నారు.నిజంగా నా తడాకా చూపించి అత్యద్భుతంగా పాడాలి అని తీర్మానించుకుని పాడడం మొదలు పెట్టింది.అది విని అమ్మవారు సాధు సాధు అని అనింది.అంటే బాగుంది ,బాగుంది అని అర్థము.ఆ రెండు పలుకులు ఎంత తీయగా,ఎంత శ్రావ్యంగా,ఎంత మధురిమలు ఒలికాయంటే ఈమె పలుకుల ముందు సరస్వతీ దేవి పాట తేలిపోయింది.ఆమె మౌనంగా తన వీణను కొంగు చాటున దాచుకుందట.అమ్మ పలుకులు అంత తేనెలూరుతున్నాయి.
Tuesday, 3 March 2026
కర్పూరవీటికామోద సమాకర్ష ద్దిగంతరా
కర్పూరవీటికామోద సమాకర్ష ద్దిగంతరా అను అందమయిన నామము అమ్మవారికి శ్రీ లలితా సహస్ర నామావళిలో ఇరవై ఆరవ నామముగా చెప్పబడింది.అమ్మవారు కర్పూరాది సుగంథ చూర్ణ మిశ్రితమయిన తాంబూలాన్ని చర్వణము చేస్తుంటే,ఆ పరిమళములు దిగంతాల వరకూ వ్యాపిస్తున్నాయట!
ఆమె తాంబూలము సేవించిందంటే ఎలా ఉండాలి?లేలేత తమలపాకుకు సున్నం రాసి,కవిరి పొడి లేక కాచు పొడి(నల్ల తుమ్మ చెట్టు బెరడు పొడి),పచ్చి పోక,వక్కపొడి,పచ్చ కర్పూరము,యాలకులు,లవంగాలు,చలువ మిరియాలు,నాగకేసరములు,జాజికాయ,జాపత్రి,కుంకుమ పువ్వు,ఎండు కొబ్బరి,పొదీనా పువ్వు తగు పాళ్ళలో వేసిన మిశ్రమము కలిపి వేసిన తాంబూలము ఘుమ ఘుమ లాడుతూ ఉండాలి.అలాంటి సుగంథ ద్రవ్యాల సమాహారంతో తయారు కాబడిన తాంబూలము నములుతుంటే అమ్మవారి నోటినుంచి సుగంథాలు దశదిశలా వ్యాపిస్తున్నాయి.దిగంతాలవరకూ వెళుతున్నాయి.అమ్మవారి నోరు ఎర్రగా పండింది.అమ్మ తాంబూల చర్వణము చేస్తుంటే దేవతలు అందరూ తాంబూల కబళము కోసము ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట.దానినే ప్రసాదంగా స్వీకరించేదానికి ఉబలాటపడుతున్నారట.ఆ పరిమాళానికి ఆకర్షించబడి తుమ్మెదలు మకరందము కోసరము ఝంకారములు చేసుకుంటూ వచ్చి,ఆమె కురులలో ఉండే పుష్ప సంపదపైన వాలాయట.భక్తులు కూడా ఆమె కృపా కటాక్షములకొరకు ఆమెను చుట్టుముట్టుతున్నారు.
శంకరాచార్యులవారు ఆమె తాంబూల చర్వణంపై ఇలా చెప్పారు.ఒకసారి శివుడి ఆన మేర కుమారస్వామి,ఇంద్రుడు,విష్ణువు రాక్షసులపైకి యుద్ధానికి వెళ్ళి గెలిచి వచ్చారు.శివుడు కానుకలు ఇవ్వబోతే కాదన్నారు.లోపల తూగుటుయ్యాల పైన చిన్నగా ఊగుతూ తాంబూల చర్వణం చేస్తున్న అమ్మవారి దగ్గరకు వచ్చారు.కన్నతల్లి బిడ్డలను చూస్తే అనుకోకుండా నవ్వుతుంది కదా!అలా వారిని చూసి నవ్వింది.అప్పుడు నోటిలో తాంబూలం కబళములు క్రింద పడ్డాయి.వాటిని చూచి వారు ముగ్గురూ ఆబగా తీసుకుని తిన్నారు.అమ్మ ఎంగిలి బిడ్డలకు అమృతతుల్యం కదా!దేవతలకే ఆమె మాతృమూర్తి.అలాంటిది మనమంతా కూడా ఆమె సంతతి కాకుండా పోతామా?ఆమె మనలను కాపాడకుండా చిన్న చూపు చూస్తుందా?ఎప్పటికీ కాదు.ఆమె చల్లని చూపులు మనలను ఎప్పుడూ నిమురుతూ ఉంటాయి.
Monday, 2 March 2026
శుద్థ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వలా
శుద్దవిద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వలా అను పవిత్ర నామము శ్రీ లలితా సహస్ర నామావళిలోని ఇరవై అయిదవ నామము.ఈ నామానికి చాలా అర్థమూ,పరమార్థమూ ఉంది.
శ్రీవిద్య అనగా శుద్ధ విద్య యందు పదహారు వర్ణ రూపాలు,అదే బీజాక్షరములు ఉన్నాయి.ఆ తల్లి పలువరస ఆ బీజాక్షరాల జంట పంక్తులు లాగా మెరసి పోతున్నాయి.శుద్ధ విద్య అనగా జ్ఞాన విద్య.అమ్మవారు శుద్ధ విద్యాంకుర స్వరూపులగు బ్రాహ్మణులు,అదే ద్విజులు,అను పలువరసలతో ప్రకాశిస్తున్నదని వశిన్యాది వాగ్దేవతలు వర్ణిస్తున్నారు.షోడశకళా ప్రపూర్ణురాలు కాబట్టి షోడశి అను నామము సార్థకమయినది.షోడసీ మంత్రమునకు పదహారు బీజాక్షరములు ఉన్నాయి.అవి క ఏ ఈ ల హ్రీం హ స క హ ల హ్రీం స క ల హ్రీం శ్రీం.వీటిని వశిన్యది వాగ్దేవతలు శుద్థ విద్యాంకురములు అని అన్నారు.అ నుండి అః వరకు ఉండే అచ్చులు శక్తి స్వరూపాలు.క నుండి క్ష వరకు ఉండే హల్లులు శివ స్వరూపాలు.అచ్చులూ హల్లులూ కలిస్తేనే అక్షర,పద నిర్మాణం అవుతుంది.ఇవి అన్నీ కలసి ముప్పై రెండు అవుతాయి.అదే ఆమె పలువరస.
మంత్రము ఉచ్ఛారణ శబ్దము అవుతుంది.ఆ శబ్దము,ఆ వాక్కుకు స్పష్టత చేకూరేదానికి నాలుగు వాక్స్వరూపములు ఉన్నాయి.అవి పరా,పశ్యంతి,మధ్యమ మరియు వైఖరి.
మనము ఒక కార్యము చెయ్యాలి అనుకుంటే ఆ తలపు వచ్చేదానికి ముందు స్థితి పరా అంటారు.ఆ తలపును పశ్యంతీ వాక్కు అని అంటారు.ఆలోచన కార్య రూపము థరించే ముందు ఉండే ఊహా స్థితిని మథ్యమ వాక్కు అని అంటారు.తలపు కార్య రూపం ధరించడం వైఖరీ వాక్కు అని అంటారు.బ్రహ్మ రంథ్రంలో పుట్టి మూలాథారంలో గాలి బుడగగా మారి,విశుద్థి చక్రంలోని అచ్చులతో చేరి,వాక్కుకు స్పష్టత ఏర్పడి శబ్దంగా బయటకు వస్తుంది.
బ్రాహ్మణుడికి ఉపనయనం ముందర ఒక జన్మ,ఉపనయనం అయిన తరువాత ఇంకో జన్మగా పాటిస్తారు.కాబట్టి అతనికి ద్విజుడు అనే నామము సార్థకమయినది.అతను తను సంపాదించిన జ్ఞానాన్ని శిష్య పరంపరకు ఉపదేశిస్తాడు,థారపోస్తాడు.కాబట్టి ద్విజులు విద్యాంకుర స్వరూపులు అని వాడుకలో ఉంది.ఆమె పలువరసే బీజాక్షరాలమయం కాబట్టి ఆ తల్లి జ్ఞాన స్వరూపిణి అయింది.
Sunday, 1 March 2026
నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్ఛదా
నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్ఛదా అను రమణీయమయిన నామము శ్రీలలితా సహస్ర నామావళిలో అమ్మవారికి చెప్పబడిన ఇరవై నాల్గవ దివ్యనామము.
అమ్మవారి పెదవులు అప్పుడే సానబట్టిన క్రొత్త ఎర్రని పగడముల రంగును,బాగా పండిన దొండపండ్ల ఎఱుపు రంగును ధిక్కరించేటంతటి అరుణ వర్ణంలో శోభిల్లుతున్నాయి.
అసలు దీని ముందర విషయం తెలుసుకుందాము.
మహిషాసురుడుని చంపడం దేవతలకు సాథ్యపడలేదు.అప్పుడు విష్ణువు వాళ్ళందరికీ ఒక మార్గం చెప్పాడు.ప్రతి ఒక్కరూ వారి వారి తేజాన్నీ, శక్తినీ,వారి అంశతో ఒక దేహ భాగాన్ని ఇచ్చి ఒక స్త్రీని సృష్టించాలి.అప్పుడు బ్రహ్మాది దేవతల శరీరముల నుండి అద్భుత తేజస్సు బయటకు వచ్చింది.ఆ తేజస్సు ఒక మహత్తరమయిన స్త్రీ మూర్తిగా రూపు దిద్దుకుంది.ఆమెయే శ్రీలలితా త్రిపుర సుందరీ దేవి.ఆ తల్లికి వివిథ దేవతల అంశల నుండి అంగ సంపద లభించింది.
అమ్మవారికి సూర్యుని యొక్క తేజస్సుతో మిగుల లాలిత్యము,మృదుత్వము,కోమలత్వములతో కూడిన అథరోష్టము ఆవిర్భవించింది.అధరోష్టము అంటే క్రింది పెదవి.పై పెదవి కార్తికేయుని తేజస్సుతో ప్రకటితమయినది.అమ్మవారి క్రింది పెదవి బింబము,అనగా పండిన దొండపండు లాగా ఉంది.ఆ తల్లి పై పెదవి సాన బట్టిన విద్రుమము లాగా ఎర్రగా ఉంది.విద్రుమము అంటే పగడము అని అర్థము.ఇక్కడ ఇంకో చమత్కారము ఉంది.పగడము గట్టిగా ఉంటుంది కదా!మరి అమ్మ పెదవులు మృదువుగా లేత తమలపాకుల లాగా నవ నవలాడు తున్నాయి కదా!దొండపండు రెండు మూడు రోజులలో మాగి,మగ్గి పోతుంది కదా!అందుకనే వ జత శిన్యాది వాగ్దేవతలు అమ్మవారి పెదవులు క్రొత్తగా సానబెట్టిన పగడాలనూ,దొండపండు ఎరుపులనూ ధిక్కరిస్తున్నాయి అని మనకు చెబుతున్నారు.
శంకరాచార్యులవారు అయితే అమ్మవారి అందము నిరుపమానమయినది అని నొక్కి వక్కాణిస్తున్నాడు.అమ్మవారి పెదవులు దొండ పండు లాగా ఉంటాయి అని వాటికి బింబము అని పేరు వచ్చిందట.రదన అంటే పెదవులు.చక్కని పలువరసను తెరలాగా కప్పుతున్నాయి ఆ దొండ పండు,పగడపు ఎర్రదనాన్ని ధిక్కరించే ఆ లేలేత కోమలమయిన పెదవులు.
Subscribe to:
Posts (Atom)