Monday, 30 March 2026
లక్ష్యరోమలతాధారతా సమున్నేయ మధ్యమా
లక్ష్యరోమలతా ధారతా సమున్నేయమధ్యమా అను పవిత్ర నామము శ్రీలలితా సహస్ర నామావళిలో వాగ్దేవతలు అమ్మవారికి ముప్పై అయిదవ నామంగా చెప్పారు.ఇందాక నామంలో అమ్మవారి నాభి పాదులాగ ఉంది అని అనుకున్నాము కదా!ఆ పాదు నుంచి మొలచిన,వచ్చిన నూగారు లతకు స్తనద్వయం ఫలాల లాగ ఉంది అని విశ్లేషణ అయింది కదా!దానిని ఇంకొంచెం పొడిగిస్తున్నారు వాగ్దేవతలు.ఆ తీగకు ఆధారంగా సన్నని నడుము గలిగి ఉందట అమ్మవారు.స్త్రీని సింహమధ్య అని అంటారు.స్త్రీలకు నడుము అందంగా,సన్నగా,పల్చగా ఉండడం శుభప్రదమయిన సాముద్రిక లక్షణం.
శంకరాచార్యులవారు అమ్మవారి నడుముతో బాటు నడుముకు పెట్టుకున్న ఆభరణాలను వర్ణించాడు.అమ్మవారు మంగళప్రదమయిన సవ్వడులు చేస్తుండే కనక ,రత్న,మణులతో పొదగబడిన మొలనూలు ధరించి ఉందట!మదపుటేనుగుల కుంభ స్థలం లాంటి స్తనభారముచే కొంచెం ముందుకు వంగి ఉందట.మామూలు స్త్రీలే పిల్లలకు పాలు ఇచ్చే సమయంలో స్తనభారంతో ఉంటారు.అలాంటిది ముల్లోకాలకూ జగన్నాత అయిన తల్లి.ఈ సర్వ సృష్టిలోని ప్రాణుల ఆకలి తీర్చేది,తీర్చగలిగే సత్తా,స్తోమత ఉండే తల్లి పాలిండ్లు ఇంకెలా ఉండాలి?ఉంటాయి?
శంకరాచార్యులవారు ఇంకా ఇలా వర్ణిస్తున్నారు.తల్లీ!నీ నడుము చూస్తే నాకు భయంగా ఉంది.ఎంతటి సవ్నని నడుము!నాభి,నడుము ముడతల దగ్గర విరిగి పోతుందేమో అనిపిస్తున్నది.ఆయన అమ్మవారి ఆశీస్సులు ఇలా కోరుకుంటున్నాడు.తల్లీ!నీ నడుము ఎలా ఉందో చెప్పేదా!ఒడ్డు మీద నుండి వాగు వైపుకు ఒంగిన చెట్టులా వంపుగా తిరిగి ఉంది.ఆ చల్లని,శుభకరమయిన నడుము చిరకాలమూ కుశలంగా ఉండి మాకందరికీ క్షేమం కలిగించుగాక!అని ఆశ పడుతున్నాడు.
దేవి యొక్క ఆవిర్భావ సమయంలో ఇంద్రుని తేజస్సుతో నడుము మరియు పొట్టపై మూడు ముడతలు(త్రివళులు) ఏర్పడినవి.చంద్రుని తేజస్సుతో రెండు వక్షోజములు ఏర్పడినవి.
సమున్నేయ మధ్యమా అంటే చక్కగా ఉద్ధరింపబడిన నడుము కలిగినది అని అర్థము.అమ్మవారి విరాట్ రూపంలో నాభికి పైన ఊర్థ్వలోకములు,నాభికి దిగువ అధోలోకములు కానవస్తాయి.ఊర్థ్వలోకములను,అధోలోకములను ఉద్ధరించేందుకని అంతటి సన్నని నడుము కలిగి ఉంది కాబట్టి ఆ తల్లిని సమున్నేయ మధ్యమా అని వాగ్దేవతలు కొనియాడారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment