Wednesday, 29 April 2026
మహా లావణ్య శేవథి
మహా లావణ్య సేవథి అను అమృతతుల్యమయిన నామము అమ్మవారికి శ్రీలలితా సహస్ర నామావళిలో చెప్పబడిన నలభై ఎనిమిదవ నామము.
అమ్మవారు అతిశయింతిన అందానికి నిథి,ప్రతీక!సేవథి అంటే నిథి అని అర్థము.ఆ తల్లి అణువణువు సౌందర్యభరితమే!ప్రతి అంగమూ అలవిమాలిన లావణ్యంతో,మార్దవంతో,సౌకుమార్యంతో విరాజిల్లుతుంది.అందుకనే వశిన్యాది వాగ్దేవతలు ఆమె అందాన్ని వర్ణించేదానికి మేమంటే మేము అంటూ ముందు వరసలో ఉన్నారు.ఆ తల్లి శిరోజాలనుంచి పూలకు సుగంథాలు అద్దుకున్నాయట!ఆమె లలాటం అష్టమి చంద్రునిలాగ ఉందట!కనుబొమలు మన్మథగృహ తోరణాల లాగ ఉన్నాయి.నయనాలు చలించే మీనాలలాగ ఉన్నాయి.సంపెంగ వంటి నాసిక!ఆమె చెక్కిళ్ళు పద్మరాగశిలలు లాగ,అద్దంలాగ నునుపుగా మెరుస్తున్నాయి.ఎర్రని పగడాలు,దొండపండులాంటి పెదవులు నిరతం చిరునవ్వులు చిందిస్తూ ఉంటాయి.శుద్ద విద్యాంకురముల వలె దంత పంక్తులు అట!సరస్వతి కచ్ఛపి వీణ కంటే మథురమయిన పలుకులు పలకగల నేర్పు!ఆమె చుబుకము అసలు దేనితోనూ పోల్చలేమట!ఇలా ఇక్కడా అక్కడా అని కాకుండా మొత్తం అందాల కలబోతగా ఉంది అమ్మవారు.అందుకనే అమ్మవారు అందాల గని,సౌందర్య ఖని,సులావణ్య నిథి అయింది.
ఉరకలు వేస్తూ ఎత్తైన పర్వత శిఖరాల నుండి జాలువారే సెలయేర్ల అందం అమ్మవారి శిరోజాలనుండి అబ్బిందట!అమ్మవారి నాసికను చూసి సంపెంగ ఈర్ష్యతో వాడిపోయింది.అమ్మవారి పెదవుల ఎరుపుదనం చూసి దొండ పండు గింజుకుంది.అది చూసి అమ్మవారి మీనాలు చెవులదాక సాగి చెవిలో చెప్పాయట!పోనీలే పాపం అని అమ్మవారు పూలకు రకరకాల రంగులు,సుగంథాలు ప్రసాదించింది.అమ్మవారి మాటల మాథుర్యమును పూలలోని మకరందానికి కొంచెం అద్దింది అట!ఎంత విశాల హృదయం కదా!
ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు.అది జగమెరిగిన సత్యం.కానీ అమ్మవారి సౌందర్యం నిత్యనూతనం,శాశ్వతం,సచ్చిదానందమయినది.ఆ తల్లిని వీక్షిస్తే జన్మ ధన్యం అవుతుంది.అఖండమయిన బ్రహ్మానందం కలుగుతుంది.
Monday, 27 April 2026
మరాళీ మందగమనా
మరాళీ మంద గమనా అను అద్భుత నామము అమ్మవారికి శ్రీ లలితా సహస్రనామావళిలో చెప్పబడిన నలభై ఏడవ నామము.లలితాంబ బహు సౌందర్యవతి అని అందరికీ తెలుసు కదా!ఆమె అందం లాగే ఆమె నడక బహు సొంపైనది అని వశిన్యాది వాగ్దేవతలు మురిసి పోతున్నారు.ఆడ హంస లాగ మందగమనముతో అడుగులు వేస్తుంది అట.తల్లిని చేరేదానికి భక్తుడు కూడా ఆడహంస మందగమనము వంటి నెమ్మది గలిగిన శ్వాసద్వారా లక్ష్యము చేరుకుంటాడు అట!మరాళీ అంటే ఆడహంస అని అర్థము.
మూలాథారమునదున్న కుండలినీ శక్తి మరాళి వంటిది.సాథకుడు తన యోగ సాథనలో కుండలినీ శక్తిని (మరాళీ)జాగృతము చేయగా సుషుమ్నా నాడి ద్వారా సహస్రారానికి చేరుతుంది.ఇక్కడనుంచి మరల మూలాథారము యందు ప్రవేశిస్తుంది.ఈ దారి మొత్తమూ కుండలినీ శక్తి ఆడహంస లాగా మందగమనయై ఉంటుంది.
పరమేశ్వరి హంస స్వరూపిణి.భక్తమానస సరోవరంలో విహరించే హంస స్వరూపిణి అమ్మ.అమ్మవారు జీవాత్మ,పరమాత్మలు ఒకటి అనే పరమార్థాన్ని తెలియ చెప్పే అద్వైతస్వరూపిణి.
Saturday, 25 April 2026
శింజాన మణిమంజీర మండిత శ్రీ పదాంబుజా
శింజాన మణిమంజీర మండిత శ్రీ పదాంబుజా అను పవిత్ర నామము శ్రీ లలితా సహస్ర నామావళిలో అమ్మవారికి పెట్టబడిన నలభై ఆరవ నామము.
అమ్మవారు కాలి అందెలు ధరించి ఉన్నారు.అవి ఎలా ఉన్నాయంటే మథురమయిన చిరు సవ్వడులు చేస్తున్నాయి.ఆ కాలి అందెలు మణిఖచితమయి ఉన్నాయి.అవి ధరించిన అమ్మవారు శుభకరంగా,శోభాయమానంగా వెలిగి పోతున్నారు.ఆమె పాదాలను అలంకరించిన మణిఖచిత అందెలు శ్రవణానందంగా చిరు సవ్వడులు చేస్తున్నాయి.ఆ సవ్వడులు ప్రణవ నాదం చేస్తున్నట్లున్నాయి.పంచదశీ మంత్రము నర్మగర్భితంగా ఆలపిస్తున్నట్లుంది.శుద్ధవిద్యాంకుర స్వరూపులైన బ్రాహ్మణులు వల్లెవేసే వేదాధ్యయనం లాగ అనిపిస్తుంది.
శంకరాచార్యులవారి చతురత ఇక్కడ బయట పెట్టారు.శివుడికి పార్వతి చేత పాదతాడనం చేయించుకోవాలి అని కోరిక కలిగింది అంట.అందుకని గౌరి ఊసు ఎత్తాడట ఉమ ముందర.ఇంకేముంది?పరాయి స్త్రీ మాట పతి నోట వస్తే ఇంక ప్రళయమే కదా!ఆమె శివుడి పైకి కాలు విసిరింది అంట!భవుడికి జరిగిన పరాభవము చూసి మన్మథుడు విరగబడి నవ్వాడట!నవ్వడా?ఆ శివుడే కదా ఈ మన్మథుడిని భస్మ చేసింది!మన్మథుడి మనసు కొంచెం తేలికపడి,ప్రశాంతంగా,ఒకింత పరిహాసంగా కిలకిలమని నవ్వినట్లుందట ఆ అందెల సవ్వడి!
Friday, 24 April 2026
పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా
పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా అను దివ్యనామము అమ్మవారికి శ్రీలలితా సహస్ర నామావళిలో చెప్పబడిన నలభై అయిదవ శుభనామము.
ప్రభాజాలములు అంటే కాంతి కిరణాలు.ఆ తల్లి పాదములు పద్మముల కాంతిని సైతం తిరస్కరించేటంత కాంతులతో విరాజిల్లుతున్నాయి.మాములుగా దేవుళ్ళు,దేవతల పాదపద్మములు అని చెప్పుకుంటాము కదా!కానీ ఇక్కడ అమ్మవారి పాదద్వయము అంతకు మించి అనినట్లు ఉంది.ఆమె పాదములు పద్మముల కంటే కూడా దివ్యకాంతులతోను,మృదువుగా,కోమలంగా విరాజిల్లుతున్నాయి.
వశిన్యాది వాగ్దేవతలు ఇలా అనే దానికి గట్టి కారణమే ఉంది.లేకపోతే అంత ఆషామాషీగా ఎలా అనేస్తారు?వారి ఉద్దేశ్యంలో పద్మాలు,వాటి కాంతులు ఎక్కువ సేపు నిలవవు.నీటిలో ఉన్నా సరే,నీటి బయట ఉన్నా సరే.కానీ అమ్మవారి పాదపద్మముల కాంతి అనంతరం,నిరంతరం వెలుగులు చిమ్ముతూనే ఉంటాయి.ఎందుకంటే 360 కిరణములు అమ్మవారి పదద్వయ ప్రభాజాలములే!ఈ కిరణాలే చరాచర జగత్తును ప్రకాశింప చేస్తున్నాయి.లేక పోతే అంతా అంధకార బంధురమే!ఈ పాదాలను మనము పూజిస్తున్నాము అంటే మనము చాలా చాలా అదృష్టవంతులము.ఎందుకంటారా?ఆ పాదములను నిత్యమూ బ్రహ్మ,విష్ణువు,మహేశ్వరులు పూజిస్తారు.అంతేనా?చతుర్వేదముల చేత కూడా పూజింపబడతాయి.
అమ్మవారి కుడి పాదము శుక్లవర్ణము.అమ్మవారి ఎడమ పాదము రక్త వర్ణము.ఈ రెండూ కలిసి అజ్ఞానము,అవిద్యా రూప సంసార బంధమును తొలగింపచేస్తాయి.బ్రహ్మ తేజముతో అమ్మవారి పాదద్వయము ఏర్పడింది.
Tuesday, 21 April 2026
నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణా
నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణా అను శుభప్రదమయిన నామము శ్రీలలితా సహస్ర నామావళిలో అమ్మవారికి పెట్టబడిన నలభై నాల్గవ నామము.
తిమిరము అంటే చీకటి,అజ్ఞానము అని కదా అర్ధము.చీకటిని పారద్రోలాలంటే వెలుతురు కావాలి కదా!అమ్మవారి కాలి గోళ్ళు తన దగ్గరకు నమస్కరించేదానికి వచ్చే భక్తుల అజ్ఞానాంధకారాన్ని పారద్రోలేలాగా దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి.అందులోనూ ఆ గోళ్ళు,అదే నఖములు,దేవతల తలపైన ఉన్న మకుటాలలో ఉండే వజ్ర వైఢూర్యాల రాపిడితో సానబెట్టబడి ఉన్నాయి కదా!ఎందుకంటే ముక్కోటి దేవతలూ అను నిత్యమూ ఆమెకు పాదాభివందనం చేస్తుంటారు కదా!
అమ్మవారి పాదాలు షట్చక్రాలకు పైన ఉండి,చక్రాలపైన అనంతమయిన కిరణాలను వర్షింపచేస్తాయి.అలా వర్షించే కిరణాలలో అగ్నికి సంబంధించినవి 108 ఉన్నాయి.సూర్యుడికి సంబంధించినవి 116 కిరణాలు ఉన్నాయి.అలాగే చంద్ర సంబంధిత కిరణాలు కూడా 136 ఉన్నాయి.దీనినే సౌర సంవత్సరము అని అంటారు.
శంకరాచార్యులు అమ్మవారిని ఇలా స్తుతిస్తున్నారు.అమ్మా!జగన్మాతా!నీవు బ్రహ్మరంథ్ర స్థానములో ఉన్న సహస్రార చక్రములో అయ్యవారితో విహరిస్తున్నావు.నీ పాదద్వయముల మధ్యభాగము నుండి అమృతధారా వర్షములు ఉబికి వేల నాడుల ప్రపంచమును తడుపుతున్నాయి.అమృతాతిశయ కాంతిగల చంద్రుని స్థానము,అనగా బ్రహ్మ రంధ్రమును,వీడి మరలా స్వస్థానమయిన మూలాధారమును చేరుతున్నాయి.అంటే ఒక రకంగా చెప్పాలంటే పాములాగ తనను తాను చుట్టుకున్నట్లుగా ఉంది.పృథ్వీతత్త్వమగు మూలాధారమందు తామరతూండ్ల మధ్యలోని సన్నని రంథ్రములో సూక్ష్మముగా కుండలినీ శక్తిగా నిద్రిస్తూ ఉంటావు.
భక్తుడు నీ పాదపద్మాలను చేరాలంటే చాలా దీర్ఘమయిన యాత్ర చేయాల్సిందే!సాధకుడు తన దేహంలో ఉన్న పృథ్వీతత్వంతో కూడిన మూలాథార చక్రంలో 56 కిరణాలను దాటాలి.ఆ పై జల తత్వాత్మికమయిన మణిపూరక చక్రంలో 52 మయూఖములను దాటాలి.ఆ తరువాత అగ్ని తత్వాత్మికమయిన అనాహత చక్రంలో 54 కాంతి రేఖలు దాటాలి.అటు పైన ఆకాశతత్వాత్మికమయిన విశుద్ధ చక్రము నందు 72 కాంతి కిరణాలు దాటాలి.ఆఖరున మనస్తత్వంతో కూడిన ఆజ్ఞాచక్రము నందు 64 కిరణ పుంజాలు దాటాలి.అప్పుడే అమ్మవారి పాదాలు గోచరమవుతాయి.
శంకరాచార్యుల వారు స్వర్గంలోని కల్పవృక్షం అమ్మవారి కాలి గోటికి కూడా సమం కాదు అని ఎద్దేవా చేస్తున్నారు.ఎందుకంటే కల్పవృక్షం స్వర్గంలోని దేవతల కోరికలు మటుకే తీరుస్తుంది,మనకు కాదు.కానీ అమ్మవారి పాదపద్మాలను నమ్ముకుంటే మన అందరి కోర్కెలూ తీరుస్తుంది.
ఇంకో సారూప్యం కూడా చెబుతున్నారు శంకరాచార్యులవారు.అమ్మవారి గోర్లు చంద్రబింబాలలాగ వెలిగి పోతున్నాయట.శచీ దేవి,మిగిలిన దేవతలు ఆమె పాదాలకు నమస్కరించేటప్పుడు,వారి చేతులు చంద్రుని కాంతికి పద్మాలలాగ ముడుచుకుని పోతున్నాయట.
Saturday, 18 April 2026
కూర్మపృష్ఠజయిష్ణు ప్రపదాన్వితా
కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితా అను మథురమయిన నామము అమ్మవారికి శ్రీలలితా సహస్ర నామావళిలో చెప్పబడిన నలభై మూడవ నామము.తాబేలు వీపుకంటే కూడా సుందరమయిన మీగాళ్ళుతో అమ్మ అలరారుతున్నది.మీగాళ్ళు అంటే అరిపాదము పైభాగము.అమ్మవారి పాదములు మోక్షప్రదములు.నాలుగు వేదాలకు సంబంథమయిన అహం బ్రహ్మాస్మి,తత్త్వమసి,ప్రజ్ఞానం బ్రహ్మ,అయమాత్మా బ్రహ్మ అనే నాలుగు పరమ పవిత్రమయిన వాక్యములు అమ్మవారి పాదాలను ప్రస్తుతించే వేదాలకు చెందినవి.శ్రీమహా విష్ణువు ఆది కూర్మము రూపములో తన పృష్ఠ భాగముతో మంధర గిరిని క్షీరసాగరంలో కృంగకుండా ఆపగలిగాడు.అటువంటి బహు సుందరమయిన ఆ ఆదికూర్మము యొక్క పృష్ఠ భాగము కంటే కూడా జగన్మాత పాదాగ్రములు సుందరమై,అత్యంత మృదుత్వంతో వెలిగిపోతున్నాయి.
అమ్మవారిని కీర్తించడంలో శంకరాచార్యులు రెండాకులు ఎక్కువే చదివారు అని ఎప్పుడూ అనుకుంటాము కదా!ఇక్కడ కూడా అది నిజమయింది.ఆయన ఇలా అంటున్నాడు.ఓ అఖిలాండేశ్వరీ!నీ పాదములు యశస్సును కలిగించేవి.విపత్తులను హరిస్తాయి.పురారి అయిన శివుడు వివాహ సమయంలో మృదువైన నీ పాదములను చేతబట్టి సన్నెకల్లును త్రొక్కించాడు.ఆరాయి పైన పెట్టినప్పుడు పాదం కమిలి పోతుందేమోనని బహు వ్యాకులపడినాడు.అలాంటి సుతిమెత్తని పాదాగ్రములను కఠినమయిన తాబేలు పృష్ఠ భాగముతో పోల్చడం సబబేనా అని వాపోతున్నాడు.
ఓ లలితా పరమేశ్వరీ!నిన్ను ఆశ్రయించిన వారికి సత్కీర్తులను కలిగిస్తావు.సకల ఆపదలు తొలగిస్తావు.నీ పాదాగ్రములు మంచికి పుట్టినిల్లు లాంటివి.నీ పాదాగ్రములు చెడు అనేది దరిచేరలేని శుభకరమయిన వాకిళ్ళు.
Friday, 17 April 2026
గూఢగుల్ఫా
గూఢగుల్ఫా అను అమ్మవారి నామము శ్రీలలితా సహస్ర నామావళిలోని నలభై రెండవ నామము.ఇంపైన,లావైన చీలమండలు అమ్మవారు కలిగి ఉన్నారు.అమ్మవారు చీలమండలు కనిపించకుండా,చీరకుచ్చెళ్ళను నేల తాకేదాకా జారవిడిచి ఉంది.కాలి మట్టెలుకూడా కనిపించకుండా చీర కుచ్చెళ్ళు జీరాడుతున్నాయి.పద్మాసనం వేసుకుని ఉన్నప్పుడు కూడా కానరావు.అలగే పీఠం మీద కూర్చున్నప్పుడు ఒక కాలు పీఠం మీద,రెండో కాలు పద్మాసన స్థితిలో ఉన్నా కూడా చీలమండలు కానరావు.ఎందుకంటే స్త్రీ యొక్క సౌందర్యము భర్తకు మటుకే అంకితము.గుహ్య స్థానము రత్నమణి సూచకము.చీలమండలు సంథి స్థానము.
Tuesday, 14 April 2026
ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభి జంఘికా
ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభి జంఘికా అను సుందర నామము అమ్మవారికి శ్రీ లలితా సహస్ర నామావళిలో చెప్పబడిన నలభై ఒకటవ నామము.
అమ్మవారి జంఘికలు,అనగా పిక్కలు మన్మధుని అంబులపొది లాగా కనిపిస్తున్నది.అదీ ఎర్రని రంగులో ఆరుద్ర పురుగులతే చుట్టూ చెక్కబడినట్లు ఉంది.ఆమె జంఘికలు మన్మథుని సుమబాణ తుణీరము లాగ గోచరిస్తున్నది.మన్మథుని బాణ తుణీరము ఎర్రని ఇంద్రగోపములచేత పొదగబడి ఉంటుంది.
ఆరుద్ర పురుగులు వ్యవసాయము మొదలు పెట్టుటకు ఆరుద్ర కార్తె అనుకూలమయినది.అవి ఎర్రగా గురివింద గింజలంత ఉంటాయి.ఆరుద్ర పురుగు మఖ్ మల్ వస్త్రము లాగ అందమయిన,సున్నితమయిన,ఎర్రని పట్టు వస్త్రము కప్పుకున్నట్లు ఉంటుంది.వర్షంలో ఇవి చావకుండా ఇంద్రుడు కాపాడుతుంటాడు.కాబట్టి వీటిని ఇంద్రగోపములు అని అంటారు.అమ్మవారి జంఘికములు ఇంద్రగోపములతో పొదగబడిన మన్మథ బాణతూణీరములాగ ఉంది.అందులో మల్లెలు,చంపకములు(సంపంగెలు),పున్నాగములు మొదలైన సుగంథ భరిత పుష్పములతో చేయబడిన బాణాలు ఉంటాయి.మన్మథుని విల్లు ఇక్షుకము(చెఱకుగడ)తోనూ,వింటి నారి బిసతంతువులు(తామరతూండ్లలోని సన్నని దారములు)తో చేయబడి ఉంటుంది.ఇంతేనా!ఆ విల్లు పైన సమ్మోహన మంత్రమూ,వశీకరణ మంత్ర బీజాక్షరములు లిఖించబడి ఉంటాయి.
శంకరాచార్యులవారు ఇంకొంచెం ఎక్కువగా వర్ణిస్తున్నారు అమ్మవారి జంఘికములను.హే గిరిసుతా!ఈశ్వరుని గెలిచేదాని కోసరము మన్మథుడు నీ పిక్కలను పదేసి బాణాలుండే అమ్ముల పొదిలాగ తయారు చేసుకున్నాడు.నిజానికి ఆయన దగ్గర ఉండేవి ఐదు బాణాలే.అవి చాలవని నీ గోటికొనలనెడు బాణాగ్రములు కనుపించుచున్నవి అని అంటున్నాడు.ఆ బాణాగ్రములు అమ్మవారి పాదములకు మ్రొక్కుచున్న దేవతల కిరీటములచే పదును పెట్టబడి ఉన్నాయి.అంటే ప్రొద్దున లేచి ముక్కోటి దేవతలు ఆమెకు సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారన్నమాట.మరి ఆ కిరీటాలు అమ్మవారి కాలి గోళ్ళకు రాసుకుంటుంటే గోర్లు పదునెక్కకుండా ఉంటాయా?
ఇదే కాకుండా ఇంకో విశ్లేషణ.ఇంద్రగోపములు అంటే మంత్రము లోని బీజాక్షరములు అని రహస్యార్థము.తూణము లేక తూణీరము అంటే మంత్ర సముదాయము.తూణము నందు ఉండే బాణములచేత మంత్రములు సూచితమవుతున్నాయి.ఆ జగన్మాత యొక్క జంఘికలు మహావర్ణ సంపుటికలు.
Monday, 13 April 2026
మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితా
మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత అని మంగళప్రదమయిన నామము అమ్మవారికి శ్రీ లలితా సహస్ర నామావళిలో పెట్టబడిన నలభైవ నామము.
అమ్మవారు మాణిక్య కిరీటము వంటి మోకాలు చిప్పలతో విరాజిల్లుతున్నది.
శంకరాచార్యులవారు అమ్మవారి మోకాలు చిప్పలగురించి ఇలా ప్రస్తావించారు.ఆమె జానువులు,అనగా మోకాళ్ళు,చాలా కఠినంగా ఉన్నాయి.ఆమె ముల్లోకాలకు తల్లి అయినా,పతివ్రతా ధర్మాన్ని తు.చ.తప్పకుండా పాటించింది.అను నిత్యమూ కామేశుడికి సేవలు చేస్తుంది.భక్తిగా మోకాళ్ళపైన పాదాభివందనం చేస్తుంది.కాబట్టే ఆమె మోకాలి చిప్పలు ఐరావతం యొక్క కుంభస్థలం అంత గట్టిగా ఉన్నాయి.కామేశుడికే తెలిసినవి అనడంలో ఒక నిగూఢమయిన పరమార్థం కూడా ఉంది.పార్వతీ పరమేశ్వరులు అర్థనారీశ్వరులు కదా!శంకరుడు పద్మాసనంలో కూర్చుంటాడు కదా!అప్పుడు ఎడమ తొడ మీదకు కుడి అరికాలు ఆనుతుంది కదా!ఇక్కడ ఎడమ తొడ అమ్మవారిది.కుడి అరిపాదం అయ్యవారిది.ఆ అరికాలి స్పర్శతో అమ్మవారి తొడ మృదత్వం అయ్యవారికి ఎరుకయింది.అంతే కానీ ఇంకో రకంగా కాదు అని శంకరాచార్యులవారి ఉవాచ.
అన్మ ఎర్రని చీర కట్టుకుని ఉంది.కాబట్టి ఆమె మోకాళ్ళు ఆ ఎర్రని చీరతో కప్పబడి ఉండటంతో మాణిక్యాలలాగా వెలిగి పోతున్నాయి అని కూడా చెబుతున్నారు.
Sunday, 12 April 2026
కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితా
కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితా అను మంగళకరమయిన నామము అమ్మవారికి శ్రీలలితా సహస్ర నామావళిలో పెట్టబడిన ముప్పై తొమ్మిదవ శుభనామము.పరమేశ్వరునికి మటుకే తెలిసిన సౌభాగ్యశ్రీలతోను మృదుత్వంతోను కూడిన ఊరువులు కలిగి ఉంది అమ్మవారు.భార్య యొక్క సర్వాంగములు భర్తకు ఒక్కడికే తెలుస్తాయి.కాబట్టి వశిన్యాది వాగ్దేవతలు కూడా ఆమె ఊరువులను ఇంక దేనితోను పోల్చలేదు.
అమ్మవారి సర్వాంగములు వివిధ దేవతలయొక్క అంశలనుండి ప్రకటితమయ్యాయి కదా!అలా వరుణుని తేజస్సుతో ఊరువులు,పిక్కలు కలిగాయి.భూదేవి తేజముతో నితంబభాగము అనగా పిరుదులు కలిగాయి.అమ్మవారి ఊరువుల జంటలో ఎడమ తొడ సౌభాగ్యానికి సంకేతము.కుడి తొడ మార్దవ సంకేతము కలిగి ఉంది.ఊరు లలో ఊ అను అక్షరము,రు లో ఉకారము ఉన్నాయి.ఇందులో ఉ కారము దక్షిణ ఊరువు.ఊ కారము వామోరువు.వామోరువు పరాసూచితము.దక్షిణోరువు అపరాసూచితము.వామోరువు జగత్తులోని బ్రహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అను నాలుగు వర్ణములకు సూచన.దక్షిణోరువు భూమి,నీరు,వాయువు,నిప్పు,ఆకాశము అనే పంచభూతములు మరియు మనోబుద్ధ్యహంకారములకు సూచనగా నిలుస్తాయి.
కామేశుడికే తెలిసిన ఊరూద్వయం అని వశిన్యాది వాగ్దేవతలు అమ్మవారి ఊరువులను దేనితో పోల్చలేదు.కానీ శంకరాచార్యులవారు మాత్రం కొంచెం ధైర్యం చేసారు.ఆయన ఇలా అన్నారు.అమ్మా!పరమేశ్వరీ!వేదవిహితమయిన ధర్మానుష్టానము కలిగినదానివి.నీ ఊరువులు రెండూ దిగ్గజముల తొండాల శోభనూ,బంగారు అరటి బోదెల అందాన్నీ ధిక్కరిస్తున్నాయి.అవి అత్యంత శోభాయమానంగా వెలిగిపోతున్నాయి.అలాగే నీ జానువులు,అనగా మోకాలి చిప్పలు రెండూ చక్కనయిన వట్రువులు(గోళాకారం)లాగా ఉన్నాయి.నీవు పతివ్రతా శిరోమణివి కదా!నిరంతరమూ నీ భర్తకు సేవలు చేసేతూ,మోకాళ్ళపై పాదాభివందనం చేస్తుంటావు కదా!అలా ఆ మోకాళ్ళు నేలకు రాసుకుని,రాసుకుని కఠినంగా మారాయి.ఎంతటి గట్టిదనం అంటే ఐరావత దిగ్గజము యొక్క కుంభస్థలాలను సైతం ధిక్కరిస్తున్నాయి.అవి జయకరంగా విరాజిల్లుతూ ప్రకాశిస్తున్నాయి.
Saturday, 11 April 2026
రత్న కింకిణికా రమ్య రశనా దామ భూషితా
రత్న కింకిణి కా రమ్య రశనా దామ భూషితా అను దివ్య నామము అమ్మవారికి శ్రీ లలితా సహస్ర నామావళిలో చెప్పబడ్డ ముప్పై ఎనిమిదవ పవిత్ర నామము.
అమ్మవారు రత్నములతోను,చిరు గజ్జెలతోను మిక్కిలి రమణీయ మైన సువర్ణపు ఒడ్డాణం ధరించి,అలరారుతున్నది.ఆడవారు మొలనూలు,లేక ఒడ్డాణం ధరిస్తారు.అమ్మవారికి ఆభరణములకు లెక్కలేదు కదా!అన్నీ నవ రత్న ఖచిత సువర్ణాభూషణములే!అందులో ఈ ఒడ్డాణం అంచులకు నవరత్నములతో పొదిగిన చిరుగంటలు వ్రేలాడు తున్నాయి.ఆమె ఒడ్డాణం నాభి మీదుగా ఉంది.
అమ్మ విరాట్ స్వరూపాన్ని ఒకసారి ఊహించుకుందాము.అప్పుడు నాభికి పైన ఊర్ధ్వలోకములు,నాభి క్రింద అధోలోకములు ఉన్నట్లు కాన వస్తుంది.ఆ రెండింటినీ ఈ ఒడ్డాణం అనుసంథానిస్తున్నట్లు అనిపిస్తుంది కదా!
Tuesday, 7 April 2026
అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతటీ
అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతటీ అను పరమ పవిత్రమయిన నామము శ్రీలలితా సహస్ర నామావళిలో అమ్మవారికి పెట్టబడిన ముప్పై ఏడవ నామము.
బాలభానుడు రాగ రంజితమయిన ఎఱుపు రంగుకే ఇంకొంచెం ఎఱుపు అద్దినట్లు మెరిసి పోతుంటాడు కదా!అలాంటి కుంకుమ పువ్వు ఎఱుపు రంగు వస్త్రముతో ప్రకాశించు కటి ప్రదేశము కలిగి ఉంది అమ్మవారు.అరుణవర్ణం అంటే ఎరుపు.ఎరుపుకే ఎరుపు అద్దడం అంటే ఇంకా శోభాయమానంగా అమ్మవారు వెలిగి పోతున్నట్లు.
సూర్యుని రథసారథి అనూరుడు.అతను అరుణ వర్ణంలో ఉంటాడు.అందుకని అరుణుడు అని అంటారు.అనూరుడు అంటే ఊరువులు లేని వాడు అని అర్థం.ఊరువులు అంటే తొడలు.
ఆ తల్లి కట్టుకునిన వస్త్రం ఒక్కటే అరుణ వర్ణం కాదు.ఆమె మొత్తం అరుణ వర్ణంలో మునిగి తేలుతుంటుంది.ఆమెకు ఎరుపు రంగు అంటే అంత ఇష్టం.ఆమె అలంకరణకు వాడే ఆభరణాలు ఎరుపు.ఆమె కొప్పులో తురుముకునే పూలు ఎరుపు.ఆమె కట్టిన వస్త్రం ఎరుపు.అంతా అరుణమయం.ఎందుకంటే బాలభానుడు లాగా ఆమె మన జీవితాలలో వెలుతురు తెస్తుంది.ఎర్రని గులాబీ లాగా ప్రేమలు పంచుతుంది.ఎరుపు ఉత్తేజం తీసుకుని వస్తుంది.సకల వేదవేదాంగాలు పుక్కిట బట్టిన బ్రాహ్మడి ముఖకమలం అరుణవర్ణ రంజితంగా ఉంటుంది.అంటే బ్రహ్మ జ్ఞానంతో వెలిగి పోతుంది.అమ్మకూడా జ్ఞానేశ్వరి కదా!ఆమె జ్ఞానం వలన శరీరం మొత్తం ఎర్రగా మెరిసిపోతుంది.దానికి తోడు ఆమె ధరించిన ఎర్రని వలువలు ఆమె జ్ఞానానికి,ప్రేమకు ఉద్దీపన చేకూరుస్తున్నాయి.
Wednesday, 1 April 2026
స్తనభార దళన్మధ్య పట్టబంధ వళిత్రయ
స్తనభార దళన్మధ్య పట్టబంధ వళిత్రయ అను పవిత్రమయిన శుభనామము శ్రీలలితా సహస్ర నామావళిలో అమ్మవారికి పెట్టబడిన ముప్పై ఆరవ నామము.
స్తనభారంతో నడుము విరిగిపోతుందేమో అన్నట్లు ఉందట అమ్మవారికి.అలా కాకుండా చుట్టూ పట్టీలు వలె వళిత్రయము కానవస్తుంది అంట.వళిత్రయము అంటే అమ్మవారి పొట్టపైన ఉన్న మూడు మడతలు.
ఆ తల్లి స్తన ద్వయం రవిసోమాత్మకమయిన కాలాన్ని సూచిస్తుంది.అట్టి కాలాన్ని భరిస్తుంది కాబట్టి కాలస్వరూపిణి అనే నామము సార్థకమయినది.వశిన్యాది వగ్దేవతలు ఆమెను ఇలా వర్ణించగా అమ్మ అరమోడ్పు కన్నులతో మందస్మిత అయిందట!
ఆ ముడతలకు చాలా అర్థం ఉంది.ఆ మూడు ముడతలు సత్త్వ రజస్తమములనే గుణత్రయానికి ప్రతీక.స్థూల సూక్ష్మ కారణ దేహాలకు గురుతులు.మువురమ్మలు అయిన మహాలక్ష్మి,మహాకాళీ,మహా సరస్వతులుగా అనుకోవచ్చు.అంతే కాకుండా త్రిమూర్తులు అయిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భావించవచ్చు.ముల్లోకాలు అయిన భూ,భువ,సువర్లోకములుగా సమన్వయించుకోవచ్చు.
ఇప్పుడు ఇంక శంకరాచార్యుల వారు ఏమి చెబుతున్నారో గ్రహిస్తాము.
అమ్మవారు సదా అయ్యవారి స్మరణలోనే ఉంటారు కదా!అందుకని సారెకు ప్రక్కలయందు చెమట పట్టి రవిక బిగుతు అవుతున్నదట!అందువల్ల చంకల దగ్గర ఒరుసుకుంటున్నదట.ఆ భారానికి సన్నని,లేలేత నడుము విరిగిపోకుండా మన్మథుడుచే ఏలకుల లతచేత కట్టబడిన మూడు కట్లవలె ఉన్నాయి అంట ఆ మూడు ముడతలు.ఆ మూడు ముడతలు అంత శోభాయమానంగా ఉన్నాయట!
అన్నిటికంటే ఉత్తమమయిన విశ్లేషణ.శంకరాచర్యులవారు మన అందరికీ తల్లిగా,ప్రౌడ సౌందర్యంతో విరాజిల్లుతున్నది అని చెబుతున్నారు.బిడ్డల తల్లి అయిన ప్రౌడ స్త్రీకి ఉదరం పై ముడతలు అందం కన్నా పరిపూర్ణమయిన స్త్రీత్వానికి,మాతృత్వానికీ అర్థం చెబుతున్నట్లు ఉంది.సంకేతంగా కనిపిస్తున్నాయి.
Subscribe to:
Posts (Atom)