Saturday, 16 May 2026
సుమేరు శృంగ మధ్యస్థా
సుమేరు శృంగ మధ్యస్థా అను అసమాన నామము అమ్మవారికి శ్రీలలితా సహస్ర నామావళిలో చెప్పబడిన ఏభై ఐదవ నామము.
ఆ తల్లి శుభకరమయిన మేరు పర్వతము యొక్క శిఖరము మధ్య ప్రదేశంలో ఉంది.శ్రీచక్రంలోని బిందువే మేరుశృంగం.ఇక్కడ ఉండే త్రిభుజంలో తూర్పు కోణం వద్ద ఇచ్ఛాశక్తి,నైఋతీ కోణం వద్ద క్రియా శక్తి మరియు వాయువ్య కోణం వద్ద జ్ఞానశక్తి ఉంటాయి.ఈ మూడింటి బిందు స్థానం అయిన మేరుశృంగంలో అమ్మవారు అయ్యవారి వామాంకం పై ఆశీనురాలయి ఉంటుంది.కాబట్టి ఈనామ మంత్రాన్ని సుమేరు మధ్య శృంగస్థా అని కూడా పలుకుతారు.సుందరమయిన మేరు శిఖరాలు మూడు ఉన్నాయి.వాటి మధ్యలో ఇంకో శిఖరం ఉంది.మధ్య శిఖరంలో అమ్మవారు అయ్యవారితో కూడి ఉంటారు.మిగిలిన మూడు శిఖరాలు క్రమముగా బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులలోకాలకు ఆధారములు అయ్యాయి.
మనలో ఉండే వెన్నెముకను మేరుదండమని అంటారు.ఆ వెన్నెముక మధ్యనుండి సుషుమ్నా మర్గము సహస్రార చక్రము వరకూ ఉంటుంది.మేరు పదాన్ని విడదీస్తే మ్+అ+ఇ+ర్+ఉ.ఈ అయిదు అక్షరములు అయిదు శృంగములు.దీనిలో మధ్యలో ఉన్నది ఇ.కాబట్టి ఆ తల్లి సుమేరు శృంగ మధ్యస్థా అయింది.
Friday, 15 May 2026
స్వాధీన వల్లభా
స్వాధీన వల్లభా అను పరమ పవిత్రమయిన నామము అమ్మవారికి శ్రీలలితా సహస్ర నామావళిలో చెప్పబడిన ఏభై నాల్గవ నామము.తన స్వాధీనంలో వల్లభుడిని ఉంచుకుంది గాబట్టి ఆ తల్లికి
స్వాధీన వల్లభా అనే నామము అతికినట్లు సరిపోయింది.శివుడు శక్తితో కూడినప్పుడే సృష్టి,స్థితి,లయ కార్యములు చేయగలతాడు.లేకపోతే అడుగుకూడా జరపలేడు.త్రికోణాకారంలో ఉండే శ్రీచక్రము నందు శివుడు బిందు స్వరూపుడు.అంటే ఆమె గుప్పెట్లో ఉన్నాడు అన్నమాట.
శివుని ఇచ్ఛాశక్తి పరమేశ్వరి.అమ్మవారు త్రిలోకసుందరి.మరి అయ్యవారు ఎలా తప్పించుకుంటాడు?శివుని ఆత్మ శివాని ఆధీనంలో ఉంది.కాళికా పురాణంలో పరమేశ్వరి చింతామణి గృహమునంద శివుడు ఉన్నాడని చెప్పబడిఉంది.శంకరాచార్యులు ఇలా అంటున్నారు.శక్తితో ఉంటే శివం-కదలగలిగేది.శక్తి లేకుంటే శవం-కదలలేనిది.అంటే అమ్మవారితో ఉంటేనే అయ్యవారికి మంచిది,మేలు.శివుడి రూపమయిన లింగము శక్తిరూపమయిన పానమట్టం లేకపోతే నిలువలేదు.శంకరుడే అమ్మవారి వెనక కళ్ళకు గంతలు కట్టినా తిరుగుతుంటే,ఇంక మన పరిస్థితి ఏంది?అమ్మవారి కాళ్ళ పైన పడి,మ్రొక్కుకోవాల్సిందే!
Wednesday, 13 May 2026
శివా
శివా అను మంగళప్రదమయిన నామము అమ్మవారికి శ్రీలలితా సహస్ర నామావళిలో చెప్పబడిన ఏభై మూడవ నామము.
ఆ తల్లి శివుని శరీరంలో అర్థ భాగం అయింది.అయ్యవారిని అర్థ నారీశ్వరుడిని చేసేసింది.అసలు నిజానికి వారు ఇద్దరు కాదు,ఒక్కరే!అది మన మట్టి బుర్రలకు అర్థం అయ్యేదానికి జీవితకాలం సరిపోదు.అమ్మవారు సదాశివుని ఇచ్ఛాస్వరూపురాలు.సృష్టించాలనే ఇచ్ఛ గలిగింది ఆ తండ్రికి.ఆ ఇచ్ఛే మన శక్తి.పరమేశ్వరి శివునితో అభేదము పొందింది గావున శివా అయింది.శివము అనగా మంగళము.కాబట్టి అయ్యవారు,అమ్మవారు మంగళస్వరూపులు.శివుడికి దేవతలు,రాక్షసులు అని భేదం లేదు.ఆయన దృష్ఠిలో అందరూ ఒకటే.అందరి మంచీ కోరుకుంటాడు.శివ అంటే శాంతించువాడు అని కూడా అర్థం ఉంది.
వేదములలో ఇలా చెప్పారు.ఎవడైతే స్వాభావికంగా నిర్మలుడో,స్వచ్ఛత ఉందో,శమము,జగదాధారమగుట,భక్తులకు మోక్షదాయిత్వము,బలము,ఇచ్ఛాశక్తి అనే గుణములు ఉన్నాయో అతడే శివుడు అని చెప్పబడి ఉంది.ఆ తల్లి తండ్రి అనుబంథము,బంథము విడదీయలేనిది కావున ఇవి ఇద్దరికీ వర్తిస్తాయి.కాబట్టి అమ్మ శివా అయింది.
ఈశ్వరుని అష్ట మూర్తులు సూర్యుడు,జలము,పృథివి,వాయువు,వహ్ని,ఆకాశము,దీక్షిత బ్రాహ్మణుడు మరియు చంద్రుడు.లింగ పురాణంలో ఈశానుడు,అనగా వాయువు భార్య శివా అని చెప్పబడినది.
Monday, 11 May 2026
శివ కామేశ్వరాంకస్థా
శివ కామేశ్వరాంకస్థా అను మనోజ్ఞమయిన నామము అమ్మవారికి శ్రీలలితా సహస్ర నామావళిలో చెప్పబడిన ఏభై రెండవ నామము.
శివ స్వరూపుడు,కామస్వరూపుడు అయిన కామేశ్వరుడు అమ్మవారి నాథుడు.ఇంక అమ్మవారి స్థానము ఏమవుతుంది?ఆ తల్లి కామేశ్వరుని అంకమును స్థానముగా చేసుకుని విరాజిల్లుతూ ఉంటుంది.
శివుడు,కాముడు అనునవి పరమేశ్వరుడికి విశేషణములు.అందుకే ఆయన శివకామేశ్వరుడయ్యాడు.పరమేశ్వరుడికి సృష్టి చేయాలని ఇచ్ఛ కలిగింది.ఆ శివుని ఇచ్ఛకు పరమేశ్వరి స్వరూపురాలు అయింది.అందుకే ఆమెను ఇచ్ఛా శక్తి,ఇచ్ఛా స్వరూపురాలు అని అంటారు.శివము అనగా మంగళము అని అర్థము.మంగళము కలిగించువాడు శివుడు.శివుని భార్య శివాని.కాబట్టి ఆమె కూడా మంగళరూపిణియే!ఒకరు కుడి,ఇంకొకరు ఎడమ.ఆ కుడి ఎడమల సంగమము అర్థనారీశ్వర తత్త్వము.ఆ జగజ్జనని కామేశుడైన పరమేశ్వరుని వామాంకమున స్థిరముగా ఉన్నది కావున శివకామేశ్వరాంకస్థా అను నామము సబబుగా ఉన్నది.
శంకరాచార్యులవారు అమ్మవారిని ఇలా పొగుడుతున్నారు.తల్లీ!పరమేశ్వరీ!అమృత సముద్రము మధ్యలో కల్ప వృక్షాలతో నిండి వున్న మణిద్వీపం ఉంది.ఆ ద్వీపంలో కదంబ పుష్పాలతో నిండిన తోట ఉన్నది.అక్కడ చింతామణులచే పొదగబడిన గృహము ఉంది.ఆ లోపల త్రికోణాకారపు మంచము ఉంది.ఆ మంచము మీద పరమశివుని పర్యంకస్థితవై ప్రకాశిస్తూ ఉన్నావు.అక్కడ నీవు జ్ఞాన స్వరూపమై నిరతిశయ సుఖ ప్రవాహరూపముగా ఉన్నావు.నిన్ను ఆ రకంగా చూసి తరించగలిగిన వాళ్ళు ముమ్మాటికీ ధన్యులు!
Sunday, 10 May 2026
సర్వాభరణ భూషితా
సర్వాభరణ భూషితా అను మంగళకరమైన నామము అమ్మవారికి శ్రీలలితా సహస్రనామావళిలో చెప్పబడిన ఏభై ఒకటవ శుభ నామము.
అపాద మస్తకమూ,అంటే కాలి మెట్టెల నుండి శిరోభూషణమైన చూడామణి వరకు వివిధ ఆభరణములను తల్లి ధరించి ఉంది.కల్ప సూత్రములో అమ్మవారు నలభై రకాల నగలు పెట్టుకుని ఉందని వర్ణన జరిగింది.ఆమె థరించిన వాటిలో కొన్ని సౌభాగ్యదాయకమయినవి,మరి కొన్ని సౌందర్యదాయకమయినవి.మంగళసూత్రము,నల్లపూసలు,కమ్మలు,ముక్కు పుడక,కాలి మట్టెలు సౌభాగ్యకరములు.
మిగిలినవి సౌందర్యదాయకములు.
ఏడు వారాల నగలు
................
ఆదివారము...సూర్యుని కోసం కెంపుల కమ్మలు,హారాలు మొదలగునవి
సోమవారము...చంద్రుని కోసం ముత్యాల హారాలు,గాజులు మొ॥॥
మంగళ వారము..కుజుని కోసం పగడాల దండలు,ఉంగరాలు మొ॥
బుథవారము..బుధుని కోసం పచ్చల పతకాలు,గాజులు మొ॥
గురువారము..బృహస్పతి కోసం పుష్యరాగం కమ్మలు,ఉంగరాలు మొ॥
శుక్రవారము...శుక్రుని కోసం వజ్రాల హారాలు,ముక్కెర మొ॥
శనివారము...శని ప్రభావం పడకుండా ఉండడం కోసం నీలమణి హారాలు మొ॥
ముక్కెర సౌభాగ్య చిహ్నము.కాబట్టి ముత్యాల అడ్డబాస పెట్టుకుంది.
అమ్మవారు నవరత్నములు పొదిగిన ఒడ్డాణము,తప్తకాంచనము,వైఢూర్యమణులతో సిద్థము చేసిన భుజకీర్తులు,గొడుగు వంటి తాటంకములు,సూర్య చంద్రుల వంటి ఆకారముతో రత్న నిర్మితమయిన దివ్యమగు చూడామణి,శుక్ర నక్షత్రముతో సమానమయిన స్వచ్ఛమయిన నాసాభరణము,అమూల్య రత్నములతో పొదిగిన మకుటము,మణులతో పొదిగిన ఉంగరము,రత్న నిర్మితమయిన కింకిణులతో,కంకణములతో అమ్మవారు విరాజిల్లుతున్నారు.
సప్తశతిలో ఇంకా ఇలా చెప్పారు.పాలసముద్రుడు అమ్మవారికి మంచి ముత్యాల హారము,మంచి నాణ్యమయిన చీరలు,దివ్యమయిన శిరోరత్నము,చెవి కమ్మలు,కడియములు,పాపిడి బొట్టు,భుజకీర్తులు,కాలి యందెలు,కంఠాభరణములు,అన్ని వ్రేళ్ళకూ శ్రేష్ఠమయిన ఉంగరాలు ఇచ్చాడు.విశ్వకర్మ బంగారు గండ్ర గొడ్డలి,పలు రకములు అయిన అస్త్రములు,అభేద్యమయిన కవచము ఇచ్చాడు.సముద్రుడు ఎప్పటికీ వాడని ఉత్తమజాతి తామరపూల హారములు తలలో ముడుచుకునేదానికి,మెడలో వేసుకునేదానికీ ఇచ్చాడు.హిమవంతుడు సింహ వాహనము,అనేక రకములు అయిన రత్న భూషణములు ఇచ్చాడు.కుబేరుడు మథువు కొరకు అక్షయ పాత్రను ఇచ్చాడు.శేషుడు గొప్పదైన మణులతో చెక్కిన నాగహారమును ఇచ్చాడు.అమ్మవారు ముక్కోటి దేవతల అంశతో ప్రకటితమయింది కదా!కాబట్టి ఆ దేవతల దగ్గర నుంచి ఆభరణములూ,అస్త్రములూ వచ్చాయి.
అమ్మవారు సంహారానికి పోయినట్లుగా లేదు.సర్వాభరణ భూషిత అయి శుభకార్యానికి బయలుదేరినట్లు ఉంది.ఆమె శక్తి సైన్యముతో చక్రరాజము గేయచక్రము,కిరిచక్రము మొదలైన రథములతో బయలుదేరింది.
Saturday, 9 May 2026
అనవద్యాంగీ
అనవద్యాంగీ అను సుందర,పరిపూర్ణమయిన నామము అమ్మవారికి శ్రీలలితా సహస్ర నామావళిలో చెప్పబడిన ఏభయవ నామము.
అమ్మ అంగములు అన్నీ పరిపూర్ణంగా ఉన్నాయి.ఎలాంటి దోషాలూ లేవు,కానరావు.అవయవములు అన్నీ వినూత్న శోభతో,ఎలాంటి దోషాలూ లేకుండా,పరిపూర్ణంగా ఉన్నయి.సాముద్రిక శాస్త్రానికే ప్రామాణికంగా ఉన్నాయి.ఆమె పొందిక గలిగిన శరీరావయములతో,లావణ్యరాశిగా ఒప్పారుతున్నది.మనం చందమామను చూసి నోరెళ్ళబెడతాము.చందమామ ఎంత అందంగా ఉంటుంది కదా!కానీ దానిలో కూడా మచ్చ ఉంది.కానీ అమ్మవారి విషయానికి వస్తే,ఎక్కడా ఏ లోపమూ చూపలేము.అనవద్యాంగీ అంటే నింద్యములు కాని అంగములు కలది అని అర్థము.సర్వారుణాఽనవద్యాంగ్యై అని అమ్మవారిని స్తుతిస్తే అమ్మవారితో పాటు అయ్యవారుకూడా వరాలిస్తాడట!ఎంతైనా భార్యను మెచ్చుకుంటే భర్తకూడా సంతోషించి,మెత్తపడతాడు కదా!
Wednesday, 6 May 2026
సర్వారుణా
సర్వారుణా అను నామథేయము అమ్మవారికి శ్రీలలితా సహస్ర నామావళి లో పెట్టబడిన నలభై తొమ్మిదవ శుభనామము.
అమ్మవారు అరుణారుణ కాంతులతో శోభిల్లుతున్నది.ఒక్కటేమిటి?ఆమెకు సంబంథించిన ప్రతి విషయమూ ఎరుపుతో కలబోత అయినదే!అమ్మవారి శరీరఛాయ ఎఱుపు!ఆమె ధరించిన ఆభరణములు అన్నీ ఎఱుపే!ఆమె పళ్ళ పైన ఉండే చిగుళ్ళు ఎఱుపు!పెదవులు ఎర్రటి దొండపండ్లే!ఆమె కట్టిన వస్త్రం ఎఱుపు!ఆమెకు ఇష్టమయిన రంగు ఎఱుపు!సర్వం అరుణమయమే!అందుకే ఆమెకు సర్వారుణా అనే నామధేయం అతికినట్లు సరిపోయింది.ఆమె అంతా ఎఱుపులో మునిగి,తేలుతుంది కదా!అమ్మవారి శరీరం సింథూరం లాగ ఎర్రని ఎఱుపు.ఆమె చేతిలో కలువ కూడా నేను ఏమీ తక్కువ తినలేదు అన్నట్లు ఎర్రగా మెరిసిపోతుంది.రత్నఘటమునందుంచిన ఎర్రని,కోమలమయిన పాదాలతో అలరారుతున్నది.ఇవేనా?అంటే,ఊహూ!ఆమె తలలో తురుమిన పూలు కూడా ఎర్రదనంతో చిక్కగా ఉండే కదంబము,మందారము,దాడిమీ కుసుమాలతో ఘుమాయిస్తున్నాయి.ఆ తల్లి ముక్కెర గురించి చెప్పనే అఖ్ఖరలేదు.ఎఱ్ఱని పగడపు ముక్కెర సంపెంగలాంటి నాసిక అందాన్ని ద్విగుణీకృతం చేస్తున్నది.ఆమె రెండు పెదాలలో ఒకటి విద్రుమము లాగ,ఇంకొకటి దొండపండులాగ ముచ్చట గొలుపుతున్నాయి.తమషానా!ఆమె చిదగ్నికుండ సంభూత కదా!వీటన్నిటినీ త్రోసి రాజంటూ అపాదమస్తకమూ ఎఱ్ఱని కాంతులతో విరాజిల్లుతున్నది.
అడుగడుగునా అరుణవర్ణ శోభిత అమ్మవారు.ప్రాతః సమయాన ఉదయభానుడి కిరణాలు,సాయం సమయాన సంధ్యారుణ కిరణాలకు బోధకములు అనిపిస్తుంది.భక్తులకు చైతన్యం కలిగించే జ్ఞానోదయానికి సంకేతములుగా భావించాలి.ఆ ఎఱుపు అద్వైత చైతన్యానికి నాంది పలికే సంకేతం!ఆమె శరీరం నుండి వెలువడే అరుణకాంతులు ఆ తల్లి కరుణాంతరంగ,అనిర్వచనమయిన,ఆప్యాయతా వీక్షణాలు.అపాద మస్తకమూ అరుణవర్ణంతో భాసిల్లుతున్నది.అమ్మ నుదుటన కస్తూరీ తిలకంతో కళకళలాడుతున్నది.
Subscribe to:
Posts (Atom)