Monday, 11 May 2026
శివ కామేశ్వరాంకస్థా
శివ కామేశ్వరాంకస్థా అను మనోజ్ఞమయిన నామము అమ్మవారికి శ్రీలలితా సహస్ర నామావళిలో చెప్పబడిన ఏభై రెండవ నామము.
శివ స్వరూపుడు,కామస్వరూపుడు అయిన కామేశ్వరుడు అమ్మవారి నాథుడు.ఇంక అమ్మవారి స్థానము ఏమవుతుంది?ఆ తల్లి కామేశ్వరుని అంకమును స్థానముగా చేసుకుని విరాజిల్లుతూ ఉంటుంది.
శివుడు,కాముడు అనునవి పరమేశ్వరుడికి విశేషణములు.అందుకే ఆయన శివకామేశ్వరుడయ్యాడు.పరమేశ్వరుడికి సృష్టి చేయాలని ఇచ్ఛ కలిగింది.ఆ శివుని ఇచ్ఛకు పరమేశ్వరి స్వరూపురాలు అయింది.అందుకే ఆమెను ఇచ్ఛా శక్తి,ఇచ్ఛా స్వరూపురాలు అని అంటారు.శివము అనగా మంగళము అని అర్థము.మంగళము కలిగించువాడు శివుడు.శివుని భార్య శివాని.కాబట్టి ఆమె కూడా మంగళరూపిణియే!ఒకరు కుడి,ఇంకొకరు ఎడమ.ఆ కుడి ఎడమల సంగమము అర్థనారీశ్వర తత్త్వము.ఆ జగజ్జనని కామేశుడైన పరమేశ్వరుని వామాంకమున స్థిరముగా ఉన్నది కావున శివకామేశ్వరాంకస్థా అను నామము సబబుగా ఉన్నది.
శంకరాచార్యులవారు అమ్మవారిని ఇలా పొగుడుతున్నారు.తల్లీ!పరమేశ్వరీ!అమృత సముద్రము మధ్యలో కల్ప వృక్షాలతో నిండి వున్న మణిద్వీపం ఉంది.ఆ ద్వీపంలో కదంబ పుష్పాలతో నిండిన తోట ఉన్నది.అక్కడ చింతామణులచే పొదగబడిన గృహము ఉంది.ఆ లోపల త్రికోణాకారపు మంచము ఉంది.ఆ మంచము మీద పరమశివుని పర్యంకస్థితవై ప్రకాశిస్తూ ఉన్నావు.అక్కడ నీవు జ్ఞాన స్వరూపమై నిరతిశయ సుఖ ప్రవాహరూపముగా ఉన్నావు.నిన్ను ఆ రకంగా చూసి తరించగలిగిన వాళ్ళు ముమ్మాటికీ ధన్యులు!
Subscribe to:
Post Comments (Atom)
🙏
ReplyDelete