Tuesday, 30 June 2020

సౌందర్య లహరి శ్లోక 1

శివః శక్త్యాయుక్తోయది భవతి శక్తః ప్రభవితుం
న చే దేవం దేవో నఖలు కుశలః స్పన్దితు మపి/
అతస్త్వా మారాధ్యాం హరిహర విరిఞ్చాదిభిరపి
ప్రణన్తుం స్తోతుంవా కథ మకృత పుణ్యః ప్రభవతి//1//
  1. అమ్మా!తల్లీ!ఓ భగవతీ!సర్వ మంగళకారుడైన,సర్వ మంగళ సహితుడైన శివుడు జగన్నిర్మాణ శక్తివి అయిన నీతో కూడినప్పుడే ఈ జగత్తులన్నింటినీ సృష్టించేదానికి సమర్థుడు అవుతాడు.లేకపోతే కాడు.నీతో కలవలేకపోతే,కూడకపోతే ఆ దేవ దేవుడు తనకు తాను కదలటానికి కూడా అశక్తుడు అవుతాడు.అలాంటప్పుడు హరి హర బ్రహ్మాదుల చేత పూజింప దగ్గ దానివి అయిన నిన్ను మ్రొక్కటానికి గాని,స్తుతించటానికి గాని మేము పూర్వ జన్మలో పుణ్యం చేసుకొని వుండాలి.అలా పుణ్యం చేయని వ్యక్తులకు నిన్ను పూజించే సమర్థత ఎక్కడి నుంచి వస్తుంది?తప్పకుండా రాదు.

తనీయాంసం పాంసుం తవచరణ పజ్కేరుహ భవం

తనీయాంసం పాంసుం తవచరణ పఙ్కేరుహ భవం విరిఞ్చిస్సఞ్చిన్వన్ విరచయతి లోకా నవికలమ్/ వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరః సంక్షుద్యైనం భజతి భసితోద్ధూళనవిధిమ్// ఓ తల్లీ!మాతా!అమ్మా!ఆ బ్రహ్మదేవుడు నీ చరణకమలాలలొ పుట్టిన పరాగాన్ని కొంచెంగా తీసుకునే ఈ సమస్త లోకాలను ఎలాంటి చిన్న తప్పుకూడా లేకుండా సృజిస్తున్నాడు.ఇలా ఇసుమంత ఈ పదరజస్సునే మహావిష్ణువు కూడా ఆదిశేషుడై తన వెయ్యి శిరస్సులతో భారంగా మోస్తున్నాడు.శివుడు ఆ పరాగాన్నే చక్కగా మెదిపి విభూతి లాగా తన ఒంటికి అద్దుకుంటున్నాడు.