Friday, 6 March 2026
మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసా
మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసా అను అత్యంత అద్భుత నామము శ్రీ లలితా సహస్రనామావళిలో అమ్మవారికి ఇవ్వబడిన ఇరవై ఎనిమిదవ నామము.
ఈ నామము లోని భావము చాలా లోతయినది.అమ్మవారి చిరునవ్వు అవధులు లేని కాంతి ప్రవాహములా గోచరిస్తున్నది.ఆ ప్రవాహములో కామేశ్వరుడు లయమయిపోయి,మునిగి తేలుతున్నాడు.అయ్యవారి మనసును కొంగుకు ముడి వేసుకున్నట్లు ఉంది.అంటే లయకారుడు అమ్మవారి చిరునవ్వుల ఊటలో లయమయిపోతున్నాడు.ఆ పరమేశ్వరుడి మనసును గెలుచుకుని,సతతం తనతోనే,తనలోనే ఉంచుకుంది ఆ కామేశ్వరి.మామూలుగానే ఆమె అందం అట్లాంటిట్లాంటిది కాదు.అలాంటి జగన్మోహిని మందస్మిత అయి అయ్యవారిని ఓరకంట చూస్తే,ఇంకేముంది.హృదయార్పణం జరిగి తీరాల్సిందే!
ఈ విషయంగా శంకరాచార్యులవారు ఇలా అంటున్నారు.చకోర పక్షులు జగన్మాత చిరునగవులు అనే వెన్నెలలను గ్రోలుతున్నాయట.అతి మథురం అయ్యేటప్పటికి విరుగుడుగా అమృతమును పుల్లటి కడుగు నీళ్ళులాగా భావించి త్రాగుతున్నాయట!అంటే అమ్మ చిరునవ్వు అమృతము కంటే అత్యంత మథురనయినది,తీయనైనది.దానికి సాటి ఇంకేమీ లేదు ముల్లోకాలలో!ఆ అతి తీపితో మొహం మొత్తి రుచి మార్పు కోసం చంద్రుని వెన్నెల గ్రోలుతున్నాయి.అంతే!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment