Friday, 19 June 2026
సుధా సాగర మధ్యస్థా
సుధా సాగర మధ్యస్థా అను దివ్యమయిన నామము అమ్మవారికి శ్రీలలితా సహస్ర నామావళిలో అరవై ఒకటవ నామముగా చెప్పబడినది.శ్రీ చక్రము నందు కేంద్ర బిందువే సహస్రార కమలము.అదే సుధా సాగరము లేదా అమృత సాగరము.ఆ అమృత సాగరము మధ్యలో అమ్మవారు నివసిస్తుంది కాబట్టి ఆ తల్లికి ఆ పేరు వచ్చినది.
బ్రహ్మాండమునకు సంబంథించి అన్నిటికంటే పైన అమృత సాగరము ఉంది.దాని మథ్యలో చింతామణి గృహములో అమ్మవారు ఉంటుంది.
పిండాండమునకు సంబంథించి మనవ శరీరము కదా మనము పరిగణలోకి తీసుకుంటాము.ఇక్కడ మానవ శరీరంలో సహస్రార కమల మధ్య కర్ణిక యందు చంద్ర మండలము ఉంది.ఈ చంద్ర మండలము మధ్య ఇంకొక సుధా సాగరము ఉంది.మన అమ్మవారు అక్కడ ఉంటుంది.
ఇంక సగుణబ్రహ్మోపాసనాపరులు అపరాజిత అనగా శ్రీమన్నగరము పొందుతారు.అక్కడ అర మరియు ణ్య అనే పేరుతో సముద్రము లాంటి రెండు మడుగులు ఉన్నాయి.ఆ రెండు మడుగుల మధ్యలో అమ్మవారు నివసిస్తారు.
మణి ద్వీపానికి సర్వలోకమనే పేరు కూడా ఉంది.దీనికి నాలుగు వైపులా అమృత సాగరము ఉంది.ఈ సముద్రానికి ఇరవై అయిదు ప్రాకారాలు ఉన్నాయి.అవి లోహమయ,కాంస్య,తామ్ర,సీస,ఇత్తడి,పంచలోహ,రజిత,సువర్ణమయ,పుష్పరాగమణి,పద్మ రాగమణి,గోమేథికమణి,వజ్ర,వైఢూర్య,ఇంద్రనీల,ముత్యపు,మరకత,పగడాల,మాణిక్యరత్న,సహస్ర స్తంభ,మనస్సాల,బుద్ధిసాల,అహంకార సాల,సూర్యబింబ సాల,చంద్రబింబ సాల,శృంగార సాల అను ప్రాకారాలు.ఈ ఇరవై అయిదు ప్రాకారాలు పంచ వింశతి తత్త్వములకు ప్రతీకలు.అవి..
పంచ భూతములు...భూమి,జలము,అగ్ని,వాయువు,ఆకాశము,
పంచేంద్రియములు...చెవి,చర్మము,కన్ను,నాలుక,ముక్కు,
పంచ కర్మేంద్రియములు...నోరు,చేతులు,కాళ్ళు,గుదము,జననేంద్రియము,
విషయ పంచకములు...శబ్దము,స్పర్శము,రూపము(ఆకృతి),రసము(రుచి),గంధము(వాసన),
అహంకార త్రయము...అహంకారము,బుద్ధి,మహత్తు(అవ్యక్తము),
మనస్సు,కాలము లేదా పురుషుడు.
కావున అమ్మవారిని సుధా సాగర మధ్యస్థ అనుట ఉచితముగా ఉన్నది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment