Wednesday, 10 June 2026

చింతామణి గృహాంతస్థా

చింతామణి గృహాంతస్థా అను అందమయిన నామము అమ్మవారికి శ్రీ లలితా సహస్ర నామావళిలో ఏభై ఏడవ నామముగా చెప్పబడినది. అమ్మ చింతామణులచే నిర్మింపబడిన గృహంలో విరాజిల్లుతున్నది.చింతామణి అనేది ఒక రత్నము.అది ఒక్కటి ఉంటేనే ఎన్నో కోరికలు తీరుస్తుంది.అలాంటిది,ఆ మణులతోటే గృహము మొత్తం నిర్మింపబడింది అంటే ఇంకెలా ఉంటుంది? మానవుని శరీరంలో చింతామణి గృహం సహస్రారంలో ఉంటుంది.ఆ సాథన చేసేవాడు మూలాథారం నుండి సహస్రారంకు చేరుకుంటే అన్ని చింతలకూ ముక్తాయింపు చెప్పినట్లే!అతను నిష్కాముడై బ్రహ్మత్వానికి చేరుకుంటాడు. చింతామణి గృహము నవరత్న ప్రాకారానికి మధ్యలో ఉంటుంది.అందులో నాలుగు మండపాలు ఉంటాయి.ప్రతి మండపమూ వేయి స్తంభాలతో ఉంటుంది.మొదటిది శృంగార మండపము,రెండవది ముక్తి మండపము,మూడవది జ్ఞాన మండపము,నాల్గవది ఏకాంత మండపము.అన్ని మండపాలూ కోటి సూర్య ప్రభలతో,సర్వాంగ సుందరంగా ఉంటాయి.చింతామణి గృహమునే శ్రీచక్రంలో బిందు మండలము అంటారు. మూలాధారగత కుండలినీ శక్తి జాగృతమై బిందు మండలము చేరితే ఉపాసకుడు జగన్మాత దరికి చేరుకున్నట్లే!అంటే సంకల్ప సిద్ధుడు అవుతాడు.అదే చింతామణి తత్త్వము.అంటే జీవుడు సమూలంగా చింతలకు దూరమవుతాడు.బ్రహ్మానందభరితుడు అవుతాడు.అంతటితో అతను నిష్కాముడు అవుతాడు.అమ్మవారు మనలను అలా ముక్తి మార్గంలోకి పంపిస్తుంది. కల్ప వృక్షం అంటే చింతామణితో కూడిన సంకల్పము.కామథేనువు అంటే చింతామణితో కూడిన వాక్కు.అలాంటి సంకల్పము,అలాంటి వాక్కు ఆ తల్లి భక్తుడికి కానుకగా ప్రసాదిస్తుంది.

No comments:

Post a Comment