Wednesday, 24 June 2026
కామాక్షీ
కామాక్షీ అను అమృతతుల్యమయిన నామము అమ్మవారికి శ్రీ లలితా సహస్ర నామావళిలో అరవై రెండవ నామముగా చెప్పబడింది.ఆ తల్లి కరుణామయి.ఆమె అణువణువు భక్తులకొరకు కరుణ,దయ,ప్రేమ,జాలితో నిండి ఉంటాయి.అలాంటిది ఆమె కనుదోయి కరుణారస సాగరాలు కాక ఇంకేమవుతాయి?ఆమె సదా,సర్వదా దయావర్షాన్ని కురిపిస్తూ ఉంటుంది.అక్షములు అంటే కళ్ళు.ఆమె తన అందమయిన,దయార్ద్ర దృష్టి గల నయనాలతో మన అందరి కామనలను తీరుస్తుంది.అందుకే కామాక్షి అనే నామము ఆమెకు బహు సొబగు కూరుస్తున్నది.
శ్రీమాత ఆవిర్భావ కాలమున అగ్ని దేవుని తేజస్సుతో నేత్రములు కలిగాయి.అమ్మవారి కుడి నేత్రము ఇ కారము-అధిష్ఠాన దేవత ఇంద్రుడు,ఎడమ నేత్రము ఈ కారము-అధిష్ఠాన దేవత విరాట్పురుషుడు.మరి ఆమె కామాక్షి కాకుండా ఎలాఉంటుంది?ఆమె కన్నులు మీనాల లాగా,చంచలంగా ఉంటాయి.ఆమె కనులు మీనాలయితే మరి నీరెక్కడ అని అంటారా?ఆమె వదనమే మనోహరమయిన,శోభాయమానమయిన సరోవరము.ఆమె సౌందర్యమే ఒక పరీవాహము.అక్కడే ఆ మీనద్వయం విహరిస్తుంది.ఆ తల్లి కుడి కన్ను సూర్యుడిలాగ పగలును,ఎడమ కన్ను చంద్రుడి లాగ రాత్రిని కలిగిస్తాయి.ఆమె చూపులు భక్తకోటికి ప్రేమలు,దుష్టశక్తికి క్రోధం చూపిస్తాయి.
కామేశ్వరుడు అయిన తన పతిని తన కళ్ళలోనే పెట్టుకుంటుంది.కాబట్టి కామాక్షి అయింది.ఆయనను మోహపూర్తమయిన దృక్కులతో చూస్తుంది,కాబట్టి కామాక్షి అయింది.కాముడినే తన కన్నులుగా గలిగినది,ఈ విశ్వ సృష్టి కోసరము.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment