Thursday, 30 July 2026

భండసైన్య వధోద్యుక్త శక్తివిక్రమ హర్షితా

భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షితా అను దివ్యప్రదమయిన నామము అమ్మవారికి శ్రీ లలితా సహస్ర నామావళిలో డెబ్బై రెండవ నామముగా చెప్పబడినది. అమ్మవారు యుద్ధానికి సిద్ధము అయింది.రణ రంగములో భండుని చూసింది.అతని సైన్యాన్నీ తేరిపార చూసింది.ఆ దుష్ట మూకల అంతు చూసేదానికి ఉరకలు వేసే ఉత్సాహంతో,ఉద్యుక్తులు అయిన తన శక్తి సైన్యాన్నీ,వారి బల పరాక్రమాన్నీ చూసి ఆనందభరితురాలు అయింది.అందుకనే ఈ నామము చాలా దివ్యంగా అబ్బింది. భండుడు అసురుడు.బండవాడు.అజ్ఞానానికి మారు పేరు.జీవాత్మ వేరు,పరమాత్మ వేరు అనుకుంటాడు.దానికి తోడు కృూరుడు,కుసంస్కారి!రాక్షసుడు కాబట్టి సహజంగానే అసుర ప్రవృత్తి గలవాడు.మూర్ఖులకు నేనే గొప్ప అనే అహంభావం ఎక్కువ ఉంటుంది కదా!వీడు అందులో ఎక్కడా తీసిపోడు.ఎంత అహంభావము అంటే పాంచ భౌతిక శరీరమే నేను అనుకునేటంత!అరిషడ్వర్గములకు దాసోహం అయినవాడు.ఈ జగత్తు,ఈ శరీరమే నిత్యమూ,సత్యమూ అని నమ్మిన మూర్ఖుడు.యథా రాజా తథా ప్రజా అని అంటారు కదా.రాజే అలా ఉంటే అతని ప్రజలు ఇంకెంత ఘనాపాటులు అయి ఉంటారో,మనం ఊహించుకోవచ్చు. అరిషడ్వర్గాలు అంటే కామ,క్రోథ,మోహ,మద,లోభ,మాత్సర్యాలు.ద్వైదీభావన అంటే జీవుడు,దేవుడు వేరు వేరు అనుకోవడం.అహంభావము అంటే అంతా నేనే,నేను అంటే ఈ శరీరమే అనుకోవడము.ఇప్పుడు ఇలాంటి బాహ్యవృత్తులను నశింపచేయాలి.ఆ భావనలతో పూర్తిగా కలుషితమయిన మనసును పాప ప్రక్షాళనము చేయాలి.అప్పుడు కానీ స్వస్వరూప జ్ఞానము,ఆత్మ సాక్షాత్కారము పొందలేరు.అది పూర్తి అయితేనే జ్ఞాని మోక్షము సంపాదించుకోగలతాడు. అందుకే భండుడు అనే బాహ్యప్రవృత్తిని నాశనము చేసేదానికి పరమేశ్వరి సైన్యము అనే అద్వైత శక్తులు ఉద్యుక్తులు అయి రంగంలోకి దిగాయి.ఆ సేనలను చూసి పాప ప్రక్షాళన జరుగుతుంది ఇక అని అమ్మవారి మనసు హర్షాతిరేకముతో నిండిపోయింది.

No comments:

Post a Comment