Monday, 20 July 2026

చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా

చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా అను దివ్యమయిన నామము అమ్మవారికి శ్రీలలితా సహస్ర నామావళిలో అరవై ఎనిమిదవ నామముగా పేర్కొన్నారు.ఆ తల్లి పుట్టిందే దుష్ట శిక్షణార్థం.మరి ఆమె రథం ఎలా శోభిస్తూ ఉంటుందో మనము చెప్పాలా?ఆమె అధిరోహించిన రథము పేరు చక్రరాజము.ఆ రథము సమస్త ఆయుథములతే అలంకరింపబడి ఉన్నది.ఆమె దర్పము,తేజస్సు,శోభ దశదిశలా ప్రకటితమవుతున్నది.శ్రీచక్రానికి మించిన చక్రము ఈ అనంత సృష్టిలో మరొకటి లేదు.అందుకే అది చక్రరాజము అయినది.సమస్త దోషాలను నివారించగల శక్తి కలది.సమస్త కోరికలను తీర్చగల సత్తా ఉన్నది.సకల సౌభాగ్యాలు ఇవ్వగల దివ్యమయిన యంత్రము ఈ శ్రీచక్రము.శ్రీవిద్యోపాసన,శ్రీచక్రార్చన అందరికీ వల్ల అయ్యే పనులు కావు. అమ్మవారి చక్రరాజ రథము తొమ్మిది పర్వములతోను,పది యోజనముల ఎత్తు,నాలుగు యోజనములు వైశాల్యము కలిగి ఉంటుంది. ఇప్పుడు అసలు సిసలైన శ్రీచక్రము గురించి ప్రస్తావించుకుందాము.ఇది కూడా చక్రరాజమే!ఇందులో అజ్ఞానమనే అసుర సంహారం జరుగుతుంది.అంతేనా?జ్ఞాన సంపద పెంచుకునేదానికి అనువైన,అన్ని రకాల ఆత్మగుణ సూచితమయిన సూక్ష్మాయుధాలు ఉంటాయి.అవి వాడడం మనకు తెలియాలి.అంతే!వేదవిధులకు భంగం కలిగించే చర్యలనే అసురులు అనుకోవాలి.ఆ అసురులను తెగటార్చడానికి పరివార దేవతలు,అంగ దేవతలు సంకేత పూర్వకంగా ఉంటాయి.వీటినే చక్ర రాజములోని పర్వములు అనుకోవాలి.శ్రీచక్రం నవ చక్రాకృతమై,నలుబది నాలుగు అంచులు కలిగి ఉంటుంది.శివశక్త్యుభయరూపముగా వెలసి ఉంటుంది.అంటే శివ శక్తి,శివానీ శక్తి...రెండూ కలసి ఉంటాయి.శంకరాచార్యులవారు ఇలా వివరించారు.శ్రీచక్రములో శివకోణములు నాలుగు ఉంటాయి.వీటి కోణములు క్రిందికి ఉంటాయి.శక్తి కోణములు ఐదు ఉంటాయి.వీటి కోణములు పైకి ఉంటాయి.మూల ప్రకృతులు తొమ్మిది ఉంటాయి.అష్ట దళములు ఎనిమిది ఉంటాయి.ఇవి కాక షోడశ దళములు పదహారు,త్రివలయములు మూడు,భూపురత్రయములు మూడు ఉంటాయి.ఇలా మొత్తము కలిపి నలభై నాలుగు కోణములు,ఇరవై ఎనిమిది మర్మ స్థానములు,ఇరవై నాలుగు సంథులు ఉన్నాయి.శ్రీచక్రము నందు సృష్టికి మూల కారణమయిన మూల ప్రకృతులు అను పేరుగల తొమ్మిది త్రికోణములు ఉన్నాయి.అందుకని నవయోన్యాత్మకము అని అంటారు.ఈ నవ యోనులు నవ ధాతువులై సృష్టి మూలకములు అవుతున్నాయి.వాటిలో త్వక్కు,రుథిరము,మాంసము,మేథస్సు,అస్థి అనునవి శక్తి మూలకములు.ధాతువులు....మజ్జు, శుక్రము,ప్రాణము,జీవుడు.ఇవి శివ మూలకములు.దశమ యోని బైంథవ స్థానము. ఈ చక్రరాజామునకు ఒకటే చక్రము.ఆ చక్రమే సూర్యుడు.అమ్మవారు సూర్యుడినే ఇరుసుగా గలిగి,ఖగోళములోని సౌర కుటుంబం అనే ఏక చక్రమును అధిరోహించి ఉంది.

No comments:

Post a Comment