Monday, 13 July 2026
భండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్వితా
భండాసుర వధోద్యుక్క శక్తిసేనా సమన్వితా అను అకుంఠిత ధైర్యనామము అమ్మవారికి శ్రీలలితా సహస్ర నామావళిలో అరవై ఐదవ నామంగా వశిన్యాది వాగ్దేవతలు పేర్కొన్నారు.
అమ్మ భండాసురుడు అనే రాక్షసుడిని వధించేదానికి ఉద్యుక్తులైన శక్తి సేనలను కలిగి ఉన్నది.
భండాసురుడు ఎవరు అంటే ఒక రాక్షసుడు.పరమేశ్వరుడు హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు.పర్వత రాజు,హిమవంతుడు తన కుమార్తెను అతనికి సేవలు చేయమని వినియోగించాడు.ఆ సమయంలో దేవతల కోరిక పైన మన్మథుడు అక్కడకు చేరుకున్నాడు.చెట్టు చాటు నుంచి తపస్సులో ఉన్న శివుడి పైన పుష్ప బాణం ప్రయోగించాడు.శివుడు కొంచెం గగుర్పాటుకు లోనైనాడు.కళ్ళు తెరచి,చుట్టూ చూసాడు.మన్మథుడు కనిపించగానే కోపం తారస్థాయికి పోయింది.ఇంకేముంది?మూడవ కన్ను తెరచి,భస్మం చేసాడు మన్మథుడిని.ఆ తరువాత,కొంత కాలానికి గణేశుడు ఆ బూడిదను తన రెండు చేతులతో ప్రోగు చేస్తూ ఉన్నాడు.ఆ బూడిద నుంచి భయంకరమయిన ఆకారంతో రాక్షసుడు ఒకడు పుట్టుకొచ్చాడు.అతనే భండాసురుడు.అతను పెరిగి,పెద్దవాడయ్యాడు.ఘోరమయిన తపస్సు చేసాడు.పురుషుల వలన మరణం రాకుండా వరం సంపాదించుకున్నాడు.ఇంక గర్వం తల కెక్కుతుంది కదా!దుష్టులకు వరాలిస్తే ఏమవుతుంది?సాధువులను,అమాయకులను,అబలలను పీడిస్తారు.ఇతను కూడా దేవతలను,మునులను,సాధువులను పీడించడం మొదలు పెట్టాడు.వైదిక కర్మలకు తీవ్రమయిన ఆటంకం కలిగించసాగాడు.యజ్ఞాలు జరిగే చోటుకు వెళ్ళి,అక్కడ యజ్ఞ కుండంలో రక్త మాంసాలు వేసేవాడు.ముని పత్నులను చెరపట్టేవాడు.వాడి దుర్మార్గానికి అంతం లేకుండా అయిపోయింది.
బాధితులు అందరూ మూకుమ్మడిగా బ్రహ్మ దగ్గరకు వెళ్ళి మొర పెట్టుకున్నారు.ఆయన వకాల్తా తీసుకుని విష్ణువు దగ్గరకు వచ్చాడు.విష్ణువు ఇలా చెబుతాడు.ఆ భండుడు మహాశక్తి వల్ల మాత్రమే అంతమవుతాడు.ఏ పురుష శక్తీ అతనిని ఆపలేదు.
అప్పుడు దేవతలు అందరూ బ్రహ్మ సహాయంతో,విష్ణువు అధ్వర్యంలో ఒక మహాయజ్ఞం ప్రారంభిస్తారు.ఆ యజ్ఞ కుండంలో విష్ణువు ఓంకారంగా తన సుదర్శన చక్రంలోని శక్తిని సమర్పిస్తాడు.బ్రహ్మ తన కమండలంలోని శక్తిని ధారపోస్తాడు.శివుడు తన త్రిశూలం లోని శక్తిని సమర్పిస్తాడు.ఇంద్రుడు తనకు ఎంతో ఇష్టమయిన వజ్రాయుధంలోని శక్తిని సమర్పిస్తాడు.ముక్కోటి దేవతలు అందరూ వారి వారి శక్తులను సమర్పిస్తారు.దేవతల కష్టాలు గట్టెక్కాలని ప్రార్ధిస్తారు.జగన్మాతకు అందరూ చేసిన త్యాగము నచ్చింది.సంతృప్తి చెందింది.ఆ యజ్ఞ వేదిక,అదే చిదగ్ని కుండం నుంచి ఉద్భవించింది.ఆమె సర్వాంగములు సకల దేవతల అంశల నుంచి ఏర్పడినాయి.ఆయుధములు అన్నీ వివిధ దేవతల నుంచి పొందింది.దేవకాంతలు అందరూ సర్వాభరణములు ఆమెకు భక్తితో సమర్పించారు.సూర్యచంద్రాగ్నులు త్రినేత్రములు అయ్యారు.ఆమె తన నాలుగు చేతులలో పాశం,అంకుశము,చెఱకు,పుష్పబాణములు ధరించి ఉంది.మీరందరూ నిశ్చింతగా ఉండండి.నేను భండాసురుడిని తప్పకుండా సంహరిస్తాను అని అభయమిచ్చింది.
భండుడు బండవాడు.అజ్ఞానానికి,మూర్ఖత్వానికి మారు పేరు.మరి ఆ తల్లి?బ్రహ్మ జ్ఞాన స్వరూపిణి.బ్రహ్మ జ్ఞానము అజ్ఞాన తిమిరాన్ని పటాపంచలు చేసి,అంతరింపచేయడమే భండాసుర వధ అంటే!
ఆ తల్లికి చాలా శక్తులు సహాయంగా ఉన్నాయి.వారు...గజదళాధినేత్రి...సంపత్కరీ దేవి,
యశ్వ దళాధీశురాలు...అశ్వారూఢా దేవి,
మంత్రిణి..।శ్యామలా దేవి,
సైన్యాధ్యక్షురాలు..వారాహి,
అగ్ని పుత్రిక...జ్వాలా మాలిని,నిత్యా దేవతలు,బాలా త్రిపుర సుందరి,మహా గణేశ్వరుడు...వీరందరూ రాక్షసుల శస్త్రములకు ప్రత్యస్త్రములు.
ఇవన్నీ కాక ఆమె దగ్గర మహా పాశుపతాస్త్రము,కామేశ్వరాస్త్రము మున్నగు అస్త్ర శస్త్రములు ఉన్నాయి.రణ తంత్ర వ్యూహ సాధనలకు లెక్కే లేదు.ఆ రాక్షసుడిని తుద ముట్టించే దానికి ఆ లోక కళ్యాణి సర్వ సిద్ధంగా,సన్నధంగా ఉంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment