Wednesday, 15 July 2026

సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితా

సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితా అను శుభప్రదమయిన నామము అమ్మవారికి శ్రీ లలితా సహస్ర నామావళిలో అరవై ఆరవ నామముగా పేర్కొనబడినది.అమ్మవారు భంఢాసురుని అంతం చేయాలని నిర్ణయించుకుంది.అప్పుడు తన అంకుశం నుంచి సంపత్కరీ దేవి ఉద్భవించింది.ఆమె గజవిద్యలో ప్రవీణురాలు.అమ్మవారి గజసేనకు నాయకురాలు.ఎలాంటి ఏనుగు నైనా మచ్చిక చేసుకుని తన దారిలోకి తెచ్చుకోగల సమర్ధురాలు.అలాంటి సంపత్కరీ దేవి గజారోహుణురాలై,తన గజ సముదాయముతో కలిసి,అమ్మవారికి సేవలు చేస్తున్నది.వ్రజసేవితా అంటే గజసముదాయంతో సేవలు చేయించుకోగల సమర్ధురాలు అని అర్థము. సంపత్కరీదేవి రణ కోలాహలం అనే ఏనుగుపై అధిష్టించి వస్తుంది.ఇది కాకుండా ఇంకో అర్థము కూడా ఉంది.సుఖ సంపద్వికారమయిన చిత్తవృత్తికీ సంపత్కరీ అని పేరు ఉంది.ఆ చిత్తవృత్తిలో శబ్దాదుల సముదాయాన్ని సింధురవ్రజము అని అంటారు.ఇందులోని సుఖ ప్రవృత్తికి,చిత్త ప్రవృత్తికి కారణాలు అయిన సుఖ వికారాలే గజములు.లౌకికమయిన సుఖానుభవాలపై ఇంద్రియ నిగ్రహాల సాథన ద్వారా ఉద్ధరింపజేస్తుంది ఆ తల్లి.అందుకే సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితా అను నామము అతికినట్లు సరిపోయింది.

No comments:

Post a Comment