Sunday, 9 August 2026

కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వరా

కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వరా అను దివ్యనామము శ్రీ లలితా సహస్ర నామావళిలో అమ్మవారికి పెట్టబడిన డెబ్బై ఏడవ నామము. అమ్మవారు భండాసురుని సంహారమునకు బయలుదేరింది.సమరం భీకరంగా సాగుతున్నది.భండుడి సోదరుడు అయిన విశుక్రుడు జయవిఘ్నము అనే యంత్రాన్ని ప్రయోగించాడు.దానిని ఎలా ఛేదించాలో,ఇంకెలా భేదించాలో ఒక్క క్షణం అర్థం కాలేదు.శత్రువు సంధించిన జయవిఘ్నము నాశనము చేయాలంటే విఘ్న నాశనము జరగాలి.అంటే విఘ్న నాశకుడు కావాలి.అప్పుడు జగన్మాత చిరునగవుతో కామేశుని చూసింది.తక్షణం ఆమె ఒడిలోకి బాలగణేశుడు ఉద్భవించాడు.అంత కంటే విఘ్న నాయకుడు ఇంకెక్కడ దొరుకుతాడు?ఒక్కడు చాలు అన్నట్లు మహా గణేశుడు జయవిఘ్న యంత్రాన్ని నామరూపాలు లేకుండా చేసాడు. విశుక్రుడు శక్తి సేనల మధ్యలో జయవిఘ్నము అనే శిలా యంత్రాన్ని ప్రతిష్టించాడు కదా!దాని విశిష్టతలు తెలుసుకుందాము.ఆ యంత్రానికి అష్ట దిక్కులు ఉన్నాయి.ప్రతి దిక్కుకూ కోణములు ఉన్నాయి.ప్రతి కోణములోనూ విశుక్రుడు పాతిన శూలములు ఉన్నాయి.ఆ ఎనిమిది దిక్కులలో ఉండే ప్రతి శూలానికీ ఒక్కొక్క శక్తిని ఆవాహనం చేసాడు.ఆ శక్తులు...అలసా,కృపణా,దీనా,నిద్రా,తంద్రా,ప్రమీలికా,క్లీబామరియు నిరహంకారా.వీటి ప్రభావం వలన శక్తి సైన్యానికి కళ్ళు బైర్లు కమ్మాయి.నిద్ర లాగా మగత వచ్చింది.పిరికితనం ఆవహించింది.అందరూ చతికిల బడ్డారు.శక్తి సేన మొత్తమూ చైతన్యరహితమయిపోయింది.నిర్వీర్యమయింది.వారికి ఇంక యుద్ధం చేయాలనే ఆసక్తే పూర్తిగా చచ్చిపోయింది.ఈ విషయం గమనించిన వారాహీ,శ్యామల అమ్మవారికి తెలియ చేసారు.అప్పుడు ఇంక జగన్మాత అవలోకనం చేసుకుంది.గట్టిగా బుద్ధి చెప్పకపోతే శత్రువు ఇలానే తోక ఆడిస్తుంటాడని.అప్పుడు అమ్మవారు కామేశుని క్రీగంటితో,చిరు నవ్వుతో చూసింది.ఇంకేముంది.మన బొజ్జ వినాయకుడు బుజ్జి పాపాయి లాగా అమ్మ ఒడి చేరాడు.ఆ తల్లికి బుజ్జివాడే!కానీ నిజానికి పొట్టి వాడు,పొట్టవాడు,గట్టివాడు,గజాననుడు గజగజలాడించాడు శత్రుమూకలను.పెద్ద పెద్ద చెవులతో,చిన్న చిన్న కన్నులతో,వక్ర తుండముతో ఉన్నాడు.రక్త వర్ణముతో,పది చేతులతో రక్త హీనులను చేసాడు భండుడి సేనలను.ఆ గణేశుడు బ్రహ్మాండమంతటి వాడు,బ్రహ్మాండాలనే అబ్బురపరిచే విధంగా బల్ రణం కావించాడు.ఇంతకీ ఆ గణపతి ఎవరు?అతని ఔన్నత్యం ఏంది?అతను షట్చక్రములలో మూలాధారమందు ఉండే మూలకారకుడు.కుండలినీ శక్తిని ఊర్థ్వ ముఖంగా పయనింపచేసేవాడు.అతడు పృథివీ తత్త్వాత్మకుడు.సర్వ మంత్రాలలోనూ గురు వందనం తరువాత ఆహ్వానింపబడేవాడు.సర్వ పూజలకూ,సర్వ కార్యములకూ తొలి పూజలు అందుకునేవాడు.అతను దైవ పంచాయతనములలో ఒకడు.ఇన్ని శక్తులు ఉన్న మన బొజ్జ గణపయ్యను ఆ తల్లి ఆవిర్భవింపచేసింది.మన బుజ్జి గణేశు తల్లి మాట కాదనగలడా!రణరంగంలో వీర విహారం చేసాడు.విశుక్రుడు ప్రతిష్టించిన జయ విఘ్న యంత్రాన్నీ,దాని అష్ట దిక్కులందు ఉండే శూలాలనూ తుత్తునియలు చేసాడు.ఆ శూలములపైన ఆహ్వానింపబడిన క్షుద్ర దేవతలను నామరూపాలు లేకుండా సర్వ నాశనము చేసాడు.

No comments:

Post a Comment