Friday, 31 July 2026
నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా
నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా అను అద్భుతమయిన నామము అమ్మవారికి శ్రీ లలితా సహస్ర నామావళిలోని డెబ్బై మూడవ నామముగా చెప్పబడినది.అమ్మవారికి పదహేను మంది నిత్యా దేవతలు,అదే తిథి దేవతలు ఉన్నారు కదా.వారందరూ భండాసుర సంహారనికి ఉద్యమించారు వసతమ తమ శక్తి సేనలతో.అట్టి వారి పరాక్రమా పాటవాలను వీక్షించుచున్నది మన అమ్మవారు.వారి శక్తి యుక్తులు చూసి మురిసిపోతున్నది.మనసు నందు సంతోషం ఉత్తేజితమవుతున్నది.అమ్మవారి సైన్యంలో జ్వాలామాలిని,వహ్వివాసినీ ఉన్నారు కదా!వారు నిత్యమూ ప్రకాశిస్తూ ఉంటారు.రాక్షసి మూకలు రాత్రుళ్ళు విజృంభిస్తారు కదా!కానీ అమ్మవారి సైన్యాలు ఆ తీకటిలో కూడా వారిని గుర్తించి,చీకటిని కడిగేసినట్లు శుభ్రం చేసేస్తారు.వాళ్ళను నామరూపాలు లేకుండా చేస్తారు.
భండాసురుని సేనాపతులు పదహేను మంది.వారు...దమనక,దీర్ఘజిహ్వ,హబక,హలుమల్ల,కక్లన,కల్లివాహన,ధుక్లన,పుత్రకేతు,చంద్రబాహు,కుక్కుర,జంబుకాక్ష,కుంభగ,తీక్షశృంగ,త్రికంటక మరియు చంద్రగుప్త.
వీరినందరినీ మన నిత్యా దేవతలు సంహరించేటప్పుడు చూపిన పరాక్రమాటోపానికి మన అమ్మవారు మహదానందభరితురాలు అయింది.కాబట్టి ఆ తల్లికి ఈ పేరు సముచితంగా ఉన్నది.
Thursday, 30 July 2026
భండసైన్య వధోద్యుక్త శక్తివిక్రమ హర్షితా
భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షితా అను దివ్యప్రదమయిన నామము అమ్మవారికి శ్రీ లలితా సహస్ర నామావళిలో డెబ్బై రెండవ నామముగా చెప్పబడినది.
అమ్మవారు యుద్ధానికి సిద్ధము అయింది.రణ రంగములో భండుని చూసింది.అతని సైన్యాన్నీ తేరిపార చూసింది.ఆ దుష్ట మూకల అంతు చూసేదానికి ఉరకలు వేసే ఉత్సాహంతో,ఉద్యుక్తులు అయిన తన శక్తి సైన్యాన్నీ,వారి బల పరాక్రమాన్నీ చూసి ఆనందభరితురాలు అయింది.అందుకనే ఈ నామము చాలా దివ్యంగా అబ్బింది.
భండుడు అసురుడు.బండవాడు.అజ్ఞానానికి మారు పేరు.జీవాత్మ వేరు,పరమాత్మ వేరు అనుకుంటాడు.దానికి తోడు కృూరుడు,కుసంస్కారి!రాక్షసుడు కాబట్టి సహజంగానే అసుర ప్రవృత్తి గలవాడు.మూర్ఖులకు నేనే గొప్ప అనే అహంభావం ఎక్కువ ఉంటుంది కదా!వీడు అందులో ఎక్కడా తీసిపోడు.ఎంత అహంభావము అంటే పాంచ భౌతిక శరీరమే నేను అనుకునేటంత!అరిషడ్వర్గములకు దాసోహం అయినవాడు.ఈ జగత్తు,ఈ శరీరమే నిత్యమూ,సత్యమూ అని నమ్మిన మూర్ఖుడు.యథా రాజా తథా ప్రజా అని అంటారు కదా.రాజే అలా ఉంటే అతని ప్రజలు ఇంకెంత ఘనాపాటులు అయి ఉంటారో,మనం ఊహించుకోవచ్చు.
అరిషడ్వర్గాలు అంటే కామ,క్రోథ,మోహ,మద,లోభ,మాత్సర్యాలు.ద్వైదీభావన అంటే జీవుడు,దేవుడు వేరు వేరు అనుకోవడం.అహంభావము అంటే అంతా నేనే,నేను అంటే ఈ శరీరమే అనుకోవడము.ఇప్పుడు ఇలాంటి బాహ్యవృత్తులను నశింపచేయాలి.ఆ భావనలతో పూర్తిగా కలుషితమయిన మనసును పాప ప్రక్షాళనము చేయాలి.అప్పుడు కానీ స్వస్వరూప జ్ఞానము,ఆత్మ సాక్షాత్కారము పొందలేరు.అది పూర్తి అయితేనే జ్ఞాని మోక్షము సంపాదించుకోగలతాడు.
అందుకే భండుడు అనే బాహ్యప్రవృత్తిని నాశనము చేసేదానికి పరమేశ్వరి సైన్యము అనే అద్వైత శక్తులు ఉద్యుక్తులు అయి రంగంలోకి దిగాయి.ఆ సేనలను చూసి పాప ప్రక్షాళన జరుగుతుంది ఇక అని అమ్మవారి మనసు హర్షాతిరేకముతో నిండిపోయింది.
Wednesday, 29 July 2026
జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా
జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా అను అతి సుందర నామము అమ్మవారికి శ్రీ లలితా సహస్ర నామావళిలో డెబ్బై ఒకటవ నామముగా చెప్పబడినది.
అగ్ని దేవుని పుత్రిక జ్వాలామాలిని.ఆమె శుక్లపక్ష చతుర్దశీ తిథి దేవత.ఆమె చేత వెలిగింపబడిన వహ్ని ప్రాకారము మధ్యలో మన అమ్మవారు ప్రకాశిస్తూ,ఆసీనురాలై ఉంటుంది.ఆమె తిథులకు సంబంధించిన నిత్యా దేవతలలో శుద్ధ చతుర్దశీ తిథికీ మరియు కృష్ణ పక్ష విదియ తిథికీ చెందినది.
నిత్యా దేవతలు పదహారు మంది.చంద్రుని కళలు పదహారు.పదిహేను తిథులకు పదిహేను నిత్యలు ఉన్నారు.పదహారవ కళ మహానిత్య.ఆమె పరమేశ్వరి.
వారు..
తిథి........శుక్ల పక్షము....కృష్ణ పక్షము...
పాడ్యమి......కామేశ్వరి.....చిత్రా,
విదియ....భగమాలిని.....।।।జ్వాలా మాలిని,
తదియ...।।నిత్య క్లిన్నా.।।।।।....సర్వ మంగళా,
చవితి......భేరుండా........విజయా,
పంచమి....వహ్నివాసినీ...నీలపతాకా,
షష్టి......మహా వజ్రేశ్వరీ......నిత్యా,
సప్తమి....శివదూతీ...కుల సుందరీ,
అష్టమి...త్వరతా....త్వరితా,
నవమి...।।।కుల సుందరీ....శివదూతీ,
దశమి....నిత్యా.....మహా వజ్రేశ్వరి,
ఏకాదశి...నీలపతాకా...వహ్నివాసిని,
ద్వాదశి....।విజయ....।।భేరుండా,
త్రయోదశి.....సర్వ మంగళా...నిత్యక్లిన్నా,
చతుర్దశి....జ్వాలామాలిని...భగమాలిని మరియు
పూర్ణిమ...చిత్రా..........కామేశ్వరి.
జ్వాలామాలిని అగ్ని స్వరూపురాలు.తాకితే భస్మమయిపోవడమే,దాటిపోయే ప్రసక్తే లేదు.అందుకే అమ్మవారు భండాసురుడి పైన యుద్ధానికి పోయేటప్పుడు తన సైన్యానికి చుట్టూ వహ్ని ప్రాకారంగా విస్తరించమని జ్వాలామాలినిని ఆదేశించింది.
ఇంక ఇప్పుడు శ్రీచక్రం గురించి చెప్పుకుందాము.శ్రీచక్రంలో శక్తి సంజ్ఞ కలవి ఐదు చక్రాలు,అగ్ని సంజ్ఞ కలవి నాలుగు చక్రాలు ఉంటాయి.ఈ త్రికోణముల కలయికతో ఏర్పడినదే వహ్నిప్రాకారము.మధ్యలో ఉన్న బిందువే పరమేశ్వరి అయిన మన అమ్మ.
Monday, 27 July 2026
కిరి చక్ర రథారూఢ దండనాథ పురస్కృతా
కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృతా అను దివ్యనామము అమ్మవారికి శ్రీ లలితా సహస్ర నామావళిలో డెబ్బైవ నామముగా పేర్కొనబడినది.అమ్మవారికి పదహారు మంది మంత్రిణులు ఉన్నారు కదా!అందులో దండనాథ అను దేవి ఉంది.ఆమెకు ఇంకొక నామము వారాహి దేవి.ఆమె రథము కిరిచక్రము.కిరిచక్రము అధిరోహించిన దండనాథ దేవిచేత సేవింపబడుతున్నది మన తల్లి.అందుకనే ఈపేరు పెట్టబడినది.కిరి అంటే వరాహము.కిరి చక్రరథమును అధిరోహించింది కాబట్టి ఆమెకు వారాహి అనే నామము కూడా ఉంది.కిరి చక్ర రథము వరాహ రూపములో ఉంటుంది.అంతే కాకుండా వరాహములచే లాగబడుతుంది.ఆమె చేతిలో దండము ఉంటుంది.కాబట్టి దండనాథ అను నామము సార్థకము అయినది.పురస్కృతా అంటే సేవింపబడడం,పూజింప బడడం అని అర్థం.
కిరి చక్రమునకు ఐదు పర్వములు ఉంటాయి.పర్వములు అంటే ఆవరణలు లేక అంతస్తులు.ఈ అంతస్తులలో వివిధ దేవతలు ఆయుధాలు ధరించి ఉంటారు.ఐదవ ఆవరణములో నల్లగా,వరాహమునకు ఉన్న కోరలు కలిగిన దండినీ ఉంటుంది.ఆమే వారాహీ దేవత.కిరి చక్ర రథ సేనకు పన్నెండు మంది సేనానులు ఉన్నారు.వారు..।పంచమి,దండనాథ,సంకేతా,సమయేశ్వరీ,సమయ సంకేతా,వారాహీ,పోత్రిణీ,శివా,వార్తాళీ,మహా సేనానీ,ఆజ్ఞా చక్రేశ్వరీ మరియు అలిందినీ.
ఈ వారాహీ దేవతే అమ్మ వారికి ప్రధాన సేనాని.వారాహీ దేవతకు ఉపాసన కూడా ఉంది.కాశీ క్షేత్రంలో వారాహీ మందిరం కూడా ఉంది.ఈమె బీజాక్షరము హూం!అంటే పోట్లాడే స్వభావము కలది.
Wednesday, 22 July 2026
గేయ చక్ర రథారూఢా మంత్రిణీ పరిసేవితా
గేయ చక్ర రథారూఢా మంత్రిణీ పరిసేవితా అను సుందరమయిన నామము అమ్మవారికి శ్రీలలితా సహస్ర నామావళిలో అరవై తొమ్మిదవ నామముగా చెప్పబడినది.అమ్మవారు జగన్మాత!అతి భయంకరుడైన భండాసురుడి పైకి యుద్ధానికి నడుము బిగించింది.మరి ఆమె మంత్రిణులు ఎలా ఉండాలి?అమ్మవారికి పదహారు మంది మంత్రిణులు ఉన్నారు.అందులో శ్యామలా దేవి అత్యంత సన్నిహితురాలు.శ్యామలా దేవి రథము పేరు గేయచక్రము.శ్యామలా దేవి గేయచక్రము అనే తన రథమును అథిరోహించి,అమ్మవారి సేవలో నియతం తరిస్తుంది.ఈమెను రాజశ్యామలా దేవి అని కూడా అంటారు.ఆమె అథిరోహించిన రథానికి ఏడు పర్వములు ఉంటాయి.ఇక్కడ పర్వము అంటే ఆవరణ అని అర్థము.ఈ ఏడు ఆవరణలలో వివిథ రకాల దేవతలు ఉంటారు.
శ్రీ చక్రము లోని త్రికోణమే గేయచక్రము.ఈ త్రికోణానికి అథిష్ఠాన దేవత అయిన త్రిపురాంబయే శ్యామలా దేవి.ఇంకో రకంగా చెప్పుకోవాలంటే గేయ చక్రమే సూర్య మండలము.సూర్య లోకం పొందిన యోగినులు దేవిని ధ్యానించి,పరలోకం చేరుతారు.
అమ్మవారికి పదహారు మంది మంత్రిణులు ఉన్నారు అనుకున్నాము కదా!వారు...సంగీత యోగిని,శ్యామా,శ్యామలా,మంత్రనాయకా,మంత్రిణీ,సచివేశానీ,ప్రధానేశా,కుశప్రియ,వీణావతీ,వైణికీ,మంద్రిణీ,ప్రియకప్రియా,నీపప్రియా,కదంబవేశ్యా,కదంబ వనవాసినీ మరియు సదామలా.
Monday, 20 July 2026
చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా
చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా అను దివ్యమయిన నామము అమ్మవారికి శ్రీలలితా సహస్ర నామావళిలో అరవై ఎనిమిదవ నామముగా పేర్కొన్నారు.ఆ తల్లి పుట్టిందే దుష్ట శిక్షణార్థం.మరి ఆమె రథం ఎలా శోభిస్తూ ఉంటుందో మనము చెప్పాలా?ఆమె అధిరోహించిన రథము పేరు చక్రరాజము.ఆ రథము సమస్త ఆయుథములతే అలంకరింపబడి ఉన్నది.ఆమె దర్పము,తేజస్సు,శోభ దశదిశలా ప్రకటితమవుతున్నది.శ్రీచక్రానికి మించిన చక్రము ఈ అనంత సృష్టిలో మరొకటి లేదు.అందుకే అది చక్రరాజము అయినది.సమస్త దోషాలను నివారించగల శక్తి కలది.సమస్త కోరికలను తీర్చగల సత్తా ఉన్నది.సకల సౌభాగ్యాలు ఇవ్వగల దివ్యమయిన యంత్రము ఈ శ్రీచక్రము.శ్రీవిద్యోపాసన,శ్రీచక్రార్చన అందరికీ వల్ల అయ్యే పనులు కావు.
అమ్మవారి చక్రరాజ రథము తొమ్మిది పర్వములతోను,పది యోజనముల ఎత్తు,నాలుగు యోజనములు వైశాల్యము కలిగి ఉంటుంది.
ఇప్పుడు అసలు సిసలైన శ్రీచక్రము గురించి ప్రస్తావించుకుందాము.ఇది కూడా చక్రరాజమే!ఇందులో అజ్ఞానమనే అసుర సంహారం జరుగుతుంది.అంతేనా?జ్ఞాన సంపద పెంచుకునేదానికి అనువైన,అన్ని రకాల ఆత్మగుణ సూచితమయిన సూక్ష్మాయుధాలు ఉంటాయి.అవి వాడడం మనకు తెలియాలి.అంతే!వేదవిధులకు భంగం కలిగించే చర్యలనే అసురులు అనుకోవాలి.ఆ అసురులను తెగటార్చడానికి పరివార దేవతలు,అంగ దేవతలు సంకేత పూర్వకంగా ఉంటాయి.వీటినే చక్ర రాజములోని పర్వములు అనుకోవాలి.శ్రీచక్రం నవ చక్రాకృతమై,నలుబది నాలుగు అంచులు కలిగి ఉంటుంది.శివశక్త్యుభయరూపముగా వెలసి ఉంటుంది.అంటే శివ శక్తి,శివానీ శక్తి...రెండూ కలసి ఉంటాయి.శంకరాచార్యులవారు ఇలా వివరించారు.శ్రీచక్రములో శివకోణములు నాలుగు ఉంటాయి.వీటి కోణములు క్రిందికి ఉంటాయి.శక్తి కోణములు ఐదు ఉంటాయి.వీటి కోణములు పైకి ఉంటాయి.మూల ప్రకృతులు తొమ్మిది ఉంటాయి.అష్ట దళములు ఎనిమిది ఉంటాయి.ఇవి కాక షోడశ దళములు పదహారు,త్రివలయములు మూడు,భూపురత్రయములు మూడు ఉంటాయి.ఇలా మొత్తము కలిపి నలభై నాలుగు కోణములు,ఇరవై ఎనిమిది మర్మ స్థానములు,ఇరవై నాలుగు సంథులు ఉన్నాయి.శ్రీచక్రము నందు సృష్టికి మూల కారణమయిన మూల ప్రకృతులు అను పేరుగల తొమ్మిది త్రికోణములు ఉన్నాయి.అందుకని నవయోన్యాత్మకము అని అంటారు.ఈ నవ యోనులు నవ ధాతువులై సృష్టి మూలకములు అవుతున్నాయి.వాటిలో త్వక్కు,రుథిరము,మాంసము,మేథస్సు,అస్థి అనునవి శక్తి మూలకములు.ధాతువులు....మజ్జు, శుక్రము,ప్రాణము,జీవుడు.ఇవి శివ మూలకములు.దశమ యోని బైంథవ స్థానము.
ఈ చక్రరాజామునకు ఒకటే చక్రము.ఆ చక్రమే సూర్యుడు.అమ్మవారు సూర్యుడినే ఇరుసుగా గలిగి,ఖగోళములోని సౌర కుటుంబం అనే ఏక చక్రమును అధిరోహించి ఉంది.
Thursday, 16 July 2026
అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటి భిరావృతా
అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటిభిరావృతా అను అందమయిన నామము అమ్మవారికి శ్రీ లలితా సహస్ర నామావళిలో అరవై ఏడవ నామముగా చెప్పబడినది.మన జగన్మాత అశ్వారూఢాదేవి అను దేవతచే అధిష్ఠింపబడిన అనేకానేక గుర్రములచే ఆవరింపబడియున్నది.మనము కోరికలే గుర్రాలయితే అంటుంటాము కదా!నిజముగానే కోరికలు అనేవి గుర్రాలలాంటివి.మనము అదుపులో పెట్టకపోతే అవే మనల్ని అదుపులోకి,అదే వాటి స్వాధీనంలోకి తెచ్చుకుంటాయి.కాబట్టి జర జాగ్రత్తగా ఉండాలి.అంటే ఇంద్రియములు అనే అశ్వములను అదుపులో ఉంచి,జ్ఞాన సముపార్జనకు మార్గము చూపుతుంది ఆ తల్లి!
అశ్వారూఢాదేవి అమ్మవారి పాశము నుంచి ఉద్భవించినది.ఆమెను అమ్మవారు తన అశ్వములకు దళాధినేత్రిగా ఎంచుకున్నది.ఇలా అని బ్రహ్మాండ పురాణములో చెప్పబడి యున్నది.అశ్వారూఢా దేవి అపరాజిత అను అశ్వమును అధిష్ఠించి ఉంటుంది.ఆమె అన్ని జాతుల అశ్వములను అదుపులో ఉంచుకోగల ప్రజ్ఞా పాటవాలు కలది.రణరంగములో అన్ని అశ్వములు తన ఆజ్ఞలకు లోబడి,నడుచుకునేలా చేయగలదు.ఈమె తన అశ్వ సేనతో అమ్మవారికి ముందు ఉండి,మిగిలిన అశ్వములు నలువైపులూ ఉంచుతుంది.
Subscribe to:
Posts (Atom)