Wednesday, 28 May 2025
కాళీయ మర్దన లీల
అథ వారిణి ఘోరతరం ఫణినం ప్రతివారయితుం కృతధీర్భగవన్।
దృతమారిథ తీరగనీపతరుం విషమారుత శోషితపర్ణచయమ్॥1॥
అధిరుహ్య పదాంబురుహేణ చ తం నవపల్లవతుల్యమనోజ్ఞరుచా।
హ్రదవారిణి దూరతరం న్యపతః పరిఘూర్ణితఘోర తరంగగణే॥2॥
భువనత్రయభారభృతో భవతో గురుభారవికంపివిజృంభిజలా।
పరిమజ్జయతి స్మ ధనుశ్శతకం తటినీ ఝటితి స్ఫుటఘోషవతీ॥3॥
అథ దిక్షు విదిక్షు పరిక్షుభితభ్రమితోదరవారినినాదభరైః।
ఉదకాదుదగాదురగాధిపతి స్త్వదుపాంతమశాంతరుషాంధమనాః॥4॥
ఫణశృంగసహస్రవినిఃసృమరజ్వలదగ్నికణోగ్రవిషాంబుధరమ్।
పురతః ఫణినం సమలోకయథా బహుశృంగిణమంజనశైలమివ॥5॥
జ్వలదక్షిపరిక్షరదుగ్రవిషశ్వసనోష్మభరః స మహాభుజగః।
పరిదశ్య భవన్తమనన్తబలం సమవేష్టయదస్ఫుటచేష్టమహో!॥6॥
అవిలోక్య భవంత మథాకులితే తటగామిని బాలకధేనుగణే।
వ్రజగేహతలేఽప్యనిమిత్తశతం సముదీక్ష్య గతా యమునాం పశుపాః॥7॥
అఖిలేషు విభో !భవదీయదశామవలోక్య జిహాసుషు జీవభరమ్।
ఫణిబంధనమాశు విముచ్య జవా దుదగమ్యత హాసజుషా భవతా॥8॥
అధిరుహ్య తతః ఫణిరాజఫణాన్ ననృతే భవతా మృదుపాదరుచా।
కలిశింజితనూపురమంజుమిలత్కరకంకణ సంకులసంక్వణితమ్॥9॥
జహృషుః పశుపాస్తుతుషుర్మునయో వవృషుః కుసుమాని సురేంద్రగణాః।
త్వయి నృత్యతి మారుతగేహపతే! పరిపాహి సమాం త్వమదాంతగదాత్॥10॥
ఇతి కాళీయమర్దనం నామ పంచపంచాశం దశకమ్!!!
నారాయణీయమ్ లోని ఏబది ఐదవ శతకము
హే భగవాన్!యమునా జలములో నివసించు చున్న కృూర సర్పమును అచటి నుండి బయటకు పంపుటకు నిశ్చయించుకున్నావు.అలా నిశ్చయించుకున్న తమరు విషవాయువులతో ఆకులు ఎండిపోయి ఉన్నాయి.అలాంటి తీరమున గల కదంబ వృక్షమును త్వరిత గతిని చేరితిరి.
అప్పుడే చిగురించిన చిగురుటాకు వంటి సుందరమగు కాంతి కల పాదపద్మములతో ఆ కదంబ వృక్షమును అధిరోహించితివి.ఆ వృక్షము పైనుండి తీవ్రముగా ఘోషించుచున్న భయంకరమగు అలలుగల కాళీయమడుగు నీటిలో లోతునకు దుమికితివి.
మూడు లోకములను ఉదరమున దాచుకొని నందున గొప్ప బరువు కల నీవు దుముకుటచే నీ బరువు వలన కదిలి పొంగిన జలము కల కాళింది పెద్దగా ఘోషించుచూ నూరు ధనువుల దూర ప్రాంతమును ముంచి వేసినది.నూరు ధనువులు అంటే రెండు వందల గజముల దూరము.
దిక్కులలో మూలల్లో క్షోభించుట వలన సుడులు తిరిగిన నీటి ఘోషతో పెల్లుబికిన కోపముతో వివేకమును కోల్పోయిన సర్పరాజు కాళీయుడు నీటినుండి నీ వద్దకు చేరెను.
నిప్పు కణికలవలె తీక్ష్ణమైన విషమును వేలకోరల నుండి వెళ్ళగ్రక్కుచున్న వానిని,చాలా శిఖరములు కల కాటుక కొండ వలె నున్న ఆ మహా సర్పమును,నీవు నీ ముందు చూచితివి.
అనన్తమైన బలము కల విషపుగాలులను విడుచుచున్న ఆ మహాసర్పము నిప్పులవలె తీక్ష్ణమైన విషమును కనుల నుండి గ్రక్కుచూ నీ శరీరమును అంతటా కాటు వేసి చేష్టలుడిగియున్న నిన్ను ఆశాంతం చుట్టుకొనెను.
ఇంతలో తీరమున నున్న ఆలమందలు గోపాలబాలురు నీవు గనరాక కలవరపడ సాగిరి.వ్రేపల్లెవాడలో కూడా వందల కొలది అపశకునములను చూచిరి.వెనువెంటనే వారందరూ యమునా నదీ తీర ప్రాంతమునకు పరుగులిడుతూ చేరిరి.
ప్రభూ!పరాత్పరా!యమునా నదీ తీరమున నున్నవారూ,వ్రేపల్లె నుండి వచ్చినవారూ అందరూ నీ వున్న స్థితి,ఆ పరిస్థితి చూసి హతాశులు అయిరి.వారందరూ నిన్ను ప్రాణములు వదిలి వేయమని బ్రతిమిలాడిరి.అంతట నీవు చెరగని చిరునవ్వుతో,త్వరిత గతిని ఆ సర్ప బంధమునుండి విడిపించుకుంటివి.అలా విడిపించుకుని వేగముగా పైకి లేచితివి.
అంతట నీవు కాళీయుని పడగలమీదికి ఎక్కితివి.ఆ కాళీయుని పడగల మీద అతి సుకుమారము అయిన నీ చిన్ని చిన్ని పాదాలతో అందెలు రవళించుచుండగా,కంకణముల కమనీయ ధ్వని కలబోసి మధుర మధురముగా ధ్వనించుచుండగా,అందరికీ నయనానందకరముగా నాట్యము చేసితివి.
హే జగత్పతీ!హే గురువాయూరప్పా!నీవు కాళీయుని పడగలపై నృత్యము చేయడము చూసి గోపాలకుల జన్మలు ధన్యము అయినవి.వారు పరమానందము పొందిరి.మునులు తన్మయత్త్వముతో మహదానందము చవి చూసిరి.ఇంద్రాది దేవతలు తమ సంతోషాన్ని పూలవర్షం కురిపించి వ్యక్తం చేసిరి.అలాంటి మహాప్రదాత అయిన నీవు దుర్నివార్యము అయిన రోగము నుండి నన్ను,మానవాళిని కాపాడుము.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment